SBI FD Vs Post Office TD: రిస్క్ లేని పెట్టుబడికి కేరాఫ్ అడ్రస్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FDలు). మంచి వడ్డీ ఆదాయం, ఈజీగా ఉండే విత్‌డ్రా రూల్స్, మనకు నచ్చిన టైమ్ పిరియడ్ ఎంచుకునే వెసులుబాటు వంటివి FDల్లో ఉండే బెనిఫిట్స్. ప్రస్తుతం, చాలా బ్యాంకులు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. దీనికి అదనంగా, డిపాజిట్లను ఆకట్టుకోవడానికి స్పెషల్ FD స్కీమ్స్ కూడా అందిస్తున్నాయి.
పోస్ట్ ఆఫీస్ కూడా తక్కువ తినలేదు. స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ రూపంలో, వివిధ కాల వ్యవధుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్ (టైమ్ డిపాజిట్స్) అమలు చేస్తోంది. టెన్యూర్‌ను బట్టి వీటిపై వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి.
RBI రెపో రేటు మార్పుపై ఆధారపడి బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరిస్తాయి. పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ (Post Office Time Deposit - POTD) వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం ప్రతి త్రైమాసికంలో (3 నెలలకు ఒకసారి) సవరిస్తుంది.
కాల పరిమితి
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో టర్మ్ డిపాజిట్ కాల పరిమితి 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ పథకాలు 1, 2, 3, 5 సంవత్సరాల కాలానికి మాత్రమే పెట్టుబడి అవకాశాలను అందిస్తాయి.
వడ్డీ ఆదాయం
సాధారణ ప్రజల విషయంలో, రూ. 2 కోట్ల కంటే తక్కువున్న రిటైల్ డిపాజిట్ల మీద 3 నుంచి 7 శాతం మధ్య వడ్డీని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI Fixed Deposit Interest Rate) చెల్లిస్తోంది. ఇవే కాల వ్యవధుల్లో సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.5 శాతం వడ్డీ లభిస్తుంది. బ్యాంక్ ప్రత్యేక పథకం అమృత్ కలశ్ కింద, సాధారణ ఇన్వెస్టర్లకు 7.1 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం పే చేస్తోంది. అమృత్ కలశ్ స్కీమ్ వ్యవధి 400 రోజులు. ఈ పథకం ఈ ఏడాది ఆగస్టు 15తో ముగుస్తుంది.
పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్ల మీద వడ్డీ 6.8 నుంచి 7.5 శాతం మధ్య (Post Office Fixed Deposit Interest Rate) ఉంటుంది. వడ్డీని ఏటా జమ చేస్తారు. సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక రేట్లు లేవు.
వడ్డీ రేట్ల పోలిక
POTD ---- ఒక ఏడాది కాల పరిమితికి వడ్డీ 6.80%; రెండేళ్ల కాలానికి వడ్డీ 7%; మూడేళ్ల కాలానికి వడ్డీ 7%; ఐదేళ్ల కాలానికి వడ్డీ 7.5%
SBI FDs-- ఒక ఏడాది కాల పరిమితికి వడ్డీ 6.90%; రెండేళ్ల కాలానికి వడ్డీ 7%; మూడేళ్ల కాలానికి వడ్డీ 6.50%; ఐదేళ్ల కాలానికి వడ్డీ 6.50%
పన్ను ప్రయోజనాలు
స్టేట్ బ్యాంక్, పోస్ట్ ఆఫీస్ రెండూ ఆదాయపు పన్ను చట్టం కింద పన్ను ప్రయోజనాలను (Income Tax Benefits) అందిస్తున్నాయి.
మెచ్యూర్ క్లోజర్ రూల్
పోస్టాఫీసులో, కాల పరిమితికి ముందే ఫిక్స్‌డ్ డిపాజిట్ మొత్తాన్ని వెనక్కు తీసుకోవచ్చు. డిపాజిట్ చేసిన తేదీ నుంచి ఆరు నెలల లోపు వరకు విత్‌డ్రాకు అనుమతించరు. డిపాజిట్ చేసిన ఆరు నెలల తర్వాత - ఒక సంవత్సరం లోపు ఖాతాను మూసిస్తే, పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్‌కు వర్తించే వడ్డీ రేటును ఆ డిపాజిట్‌కు వర్తింపజేస్తారు. 1 సంవత్సరం తర్వాత క్లోజ్ చేస్తే వడ్డీ రేటులో కొంత మొత్తాన్ని కోత పెడతారు.
SBI FDని కూడా ముందుగానే విత్‌డ్రా చేసుకోవచ్చు. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, రూ.5 లక్షల లోపు టర్మ్ డిపాజిట్‌ను ముందే విత్‌డ్రా చేసుకుంటే 0.50 శాతం పెనాల్టీ (అన్ని టెన్యూర్స్‌కు) ఉంటుంది. రూ. 5 లక్షలు దాటిన టర్మ్ డిపాజిట్‌లపై పెనాల్టీ 1 శాతం (అన్ని టెన్యూర్స్) పడుతుంది. బ్యాంక్ వద్ద డిపాజిట్ ఉన్న కాలాన్ని బట్టి, 0.50 శాతం లేదా 1 శాతం తగ్గించి వడ్డీ చెల్లిస్తారు.
ఇది కూడా చదవండి: హోమ్ లోన్ తీసుకునేవాళ్లకు బంపరాఫర్, భారీ డిస్కౌంట్ ఇస్తున్న గవర్నమెంట్ బ్యాంక్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial