SBI KYC Updation Through YONO App: కేవైసీ (Know Your Customer) వివరాలు అప్‌డేట్‌ చేయమని ప్రతి బ్యాంక్‌ తన కస్టమర్లను అడుగుతుంటుంది. కేవైసీ అప్‌డేట్‌ చేయకపోతే కొన్ని ఇబ్బందులు వస్తాయి. మీకు స్టేట్‌ బ్యాంక్‌లో అకౌంట్‌ ఉంటే, యోనో యాప్‌ ద్వారా మీరు సులభంగా కేవైసీ అప్‌డేట్‌ చేయవచ్చు.


రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) నిర్దేశం ప్రకారం, బ్యాంక్‌ కస్టమర్‌ తన KYCని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడం తప్పనిసరి. మనీలాండరింగ్ నిరోధక చట్టం 2002 (PMLA) నిబంధన ప్రకారం, బ్యాంక్‌ దగ్గర కస్టమర్‌ తాజా వివరాలు ఉండేలా చూసుకోవాలి. కేవైసీని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తుంటే అది కస్టమర్‌కు కూడా ఉపయోగమే, కొన్ని కీలక సేవల్లో ఇబ్బందులు రాకుండా ఉంటాయి.


బ్యాంక్‌కు అందిచగలిగిన మీ వ్యక్తిగత వివరాలే కేవైసీ. ఒకవేళ మీరు వేరే ఇంటికి మారితే, కొత్త ఇంటి అడ్రస్‌ను మీ అకౌంట్‌ డిటైల్స్‌లో యాడ్‌ చేయాలి. ఇతర వివరాలు మారినా ఇలాగే చేయాలి. ఒకవేళ ఏ వివరాలు మారకపోయినా, అదే విషయాన్ని బ్యాంక్‌కు చెప్పాలి. ఇదే కేవైసీ అప్‌డేషన్‌.
  
మీ సమీపంలోని SBI బ్రాంచ్‌కు వెళ్లి కేవైసీ అప్‌డేషన్‌ పూర్తి చేయొచ్చు. మీ వివరాలు ఏవీ మారకపోతే, ప్రి-ఫిల్డ్‌ ఫార్మాట్‌లో ఉన్న Annexure A ఫామ్‌ ద్వారా ఆ విషయాన్ని బ్యాంక్‌కు నివేదించాలి. దీనిపై మీరు సంతకం చేయాలి. మీరు స్వయంగా వెళ్లి ఆ ఫామ్‌ బ్యాంక్‌ బ్రాంచ్‌లో ఇవ్వొచ్చు లేదా రిజిస్టర్డ్‌ మెయిల్ అడ్రస్‌ ద్వారా బ్యాంక్‌కు ఇ-మెయిల్ చేయవచ్చు.


ఒకవేళ KYC వివరాల్లో ఏదైనా మార్పు ఉంటే, KYC అప్‌డేట్ చేయడానికి ఒరిజినల్ KYC డాక్యుమెంట్‌, ఒక ఫోటో తీసుకుని SBI బ్రాంచ్‌కు వెళ్లాలి. ఈ సందర్భంలో KYC అప్‌డేషన్ కోసం Annexure C 'సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్‌'ను సబ్మిట్‌ చేయాలి. 


బ్యాంక్‌ బ్రాంచ్‌కు వెళ్లేంత తీరిక & ఓపిక మీకు లేకపోతే, ఎస్‌బీఐ యోనో యాప్‌ ద్వారా కూడా KYC అప్‌డేట్‌ చేయవచ్చు. మీ వివరాల్లో ఎలాంటి మార్పు లేకపోతేనే యోనో యాప్ ద్వారా KYC అప్‌డేట్ చేయడం వీలవుతుందని గుర్తుంచుకోవాలి.


YONO ద్వారా SBI KYCని ఎలా అప్‌డేట్ చేయాలి?


స్టెప్‌ 1: మీ యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఉపయోగించి యోనో యాప్‌లోకి లాగిన్ కావాలి.
స్టెప్‌ 2: హోమ్ స్క్రీన్ ఎగువ ఎడమ వైపున ఉన్న మెనులో ERVICE REQUEST మీద క్లిక్‌ చేయండి. KYC అప్‌డేట్ గడువు ఉన్నవారికి మాత్రమే ఈ మెనూ కనిపిస్తుంది.
స్టెప్‌ 3: Update KYC మీద క్లిక్ చేయండి.
స్టెప్‌ 4: ఇక్కడ, మీ ప్రొఫైల్ పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది, ఆ పనిని పూర్తి చేయండి.
స్టెప్‌ 5: మీ చిరునామాను ధృవీకరించండి. అవసరమైతే.. మీ వృత్తి, ఆదాయం కూడా అప్‌డేట్‌ చేయవచ్చు.
స్టెప్‌ 6: మీ చిరునామా వివరాలను అప్‌డేట్‌ చేయాలనుకుంటే, KYC చిరునామా వివరాల అప్‌డేషన్‌ ఆప్షన్‌లో YES మీద క్లిక్‌ చేయండి. 
స్టెప్‌ 7: కింద ఉన్న బాక్స్‌లో టిక్ చేసి, నెక్ట్స్‌ బటన్‌ మీద నొక్కండి.
స్టెప్‌ 8: ఇప్పుడు, మీ రిజిస్టర్డ్ మొబైల్‌ నంబర్‌కు వచ్చిన OTPని అక్కడ నింపి, సబ్మిట్‌ బటన్‌ క్లిక్‌ చేయండి. అంతే, SBI KYC అప్‌డేషన్‌ పూర్తవుతుంది.


మరో ఆసక్తికర కథనం: శాఖాహారం కంటే మాంసాహార భోజనం రేటు తక్కువ - సీన్‌ రివర్స్‌ అయిందేందబ్బా?