Public Provident Fund: దేశంలో అత్యంత పబ్లిక్‌ ఫాలోయింగ్‌ ఉన్న చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఒకటి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌ (PPF) స్కీమ్. ఈ పథకంలో పెట్టుబడి పెడితే, 15 సంవత్సరాల వ్యవధిలో భారీ స్థాయిలో డబ్బు కూడబెట్టవచ్చు. ప్రస్తుతం, పీపీఎఫ్‌ అకౌంట్‌లో డిపాజిట్ చేసిన మొత్తంపై 7.1 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. పెట్టుబడి + వడ్డీ కలిపి ఈ పథకం నుంచి కోటి రూపాయల వరకు వసూలు అవకాశం కూడా ఉంది. దీని కోసం కొన్ని ప్రత్యేక చిట్కాలు పాటించాలి. ఈ స్టెప్స్‌ తూ.చా. తప్పకుండా అమలు చేస్తే, PPF ఖాతాలో జమ చేసిన మొత్తంపై ఎక్కువ వడ్డీ డబ్బులు పొందొచ్చు.


PPF ఖాతాలో పెట్టుబడి తేదీ చాలా ముఖ్యం
మార్కెట్‌ ఎక్స్‌పర్ట్స్‌ అభిప్రాయం ప్రకారం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌ ఖాతాలో డబ్బు జమ చేసే తేదీకి చాలా ఇంపార్టెన్స్‌ ఉంటుంది.  ఖాతాదారు, ప్రతి నెల 5వ తేదీ లోపు PPF పథకంలో డబ్బులు వేస్తే, అతనికి ఈ పథకం కింద గరిష్ట వడ్డీ రేటు ప్రయోజనం లభిస్తుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, PPF ఖాతాలో వడ్డీ మొత్తాన్ని నెలవారీ ప్రాతిపదికన లెక్కిస్తారు, కానీ ఆ మొత్తాన్ని సంవత్సరం చివరిలో ఖాతాలో జమ చేస్తారు. PPF స్కీమ్‌లో సంవత్సరం చివరిలో మీకు ఎంత వడ్డీ లభిస్తుంది అనే విషయం... మీరు ప్రతి నెలా ఏ తేదీన అమౌంట్‌ డిపాజిట్‌ చేశారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. 5వ తేదీ లోపు జమ చేసిన సొమ్ముపైనే ప్రభుత్వం ఆ నెల వడ్డీని లెక్కిస్తుంది. కాబట్టి, అధిక వడ్డీ ప్రయోజనాన్ని పొందడానికి ప్రతి నెలా 5వ తేదీలోపు మీ PPF ఖాతాలో డబ్బును డిపాజిట్ చేయండి.


ఏకమొత్తంగా పెట్టే పెట్టుబడిపై ఎక్కువ వడ్డీ ఆదాయం
PPF అకౌంట్‌లో ఏడాదికి కనిష్టంగా రూ. 500 నుంచి గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. దీనిని దఫదఫాలుగా జమ చేయవచ్చు లేదా ఒకేసారి మొత్తం లక్షన్నర రూపాయలు డిపాజిట్‌ చేయవచ్చు. ఈ నేపథ్యంలో, పెట్టుబడి మొత్తానికి కూడా ఇక్కడ ఇంపార్టెన్స్‌ ఉంటుంది. ఏప్రిల్ 5వ తేదీ లోపు ఒకేసారి రూ.1.5 లక్షలు పెట్టుబడి పెడితే, ఈ మొత్తంపై మీకు ప్రతి నెలా వడ్డీ లభిస్తుంది. దీనివల్ల వడ్డీ మొత్తం పెరుగుతుంది. అలా కాకుండా, ప్రతి నెలా తక్కువ మొత్తంలో జమ చేస్తూ వెళితే, దానిపై వచ్చే వడ్డీ డబ్బులు కూడా తక్కువగానే ఉంటాయి.


PPF ఖాతాకు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన విషయాలు
మీరు పోస్టాఫీసు లేదా బ్యాంకులో పీపీఎఫ్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేయవచ్చు. ఈ పథకంలో జమ చేసే మొత్తానికి, ఆదాయ పన్ను సెక్షన్ 80C కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1.5 లక్షల వరకు రాయితీ లభిస్తుంది. తల్లిదండ్రుల పర్యవేక్షణలో పిల్లలు కూడా పీపీఎఫ్‌ ఖాతా స్టార్ట్‌ చేయవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో మీకు డబ్బు అవసరమైతే, ఈ అకౌంట్‌ మీద రుణం కూడా పొందొచ్చు.


మరో ఆసక్తికర కథనం: ఆధార్‌లో మొబైల్‌ నంబర్‌ అప్‌డేట్‌ చేయడం ఎలా?, డిసెంబర్‌ 14 వరకు ఇది 'ఉచితం'


Join Us on Telegram: https://t.me/abpdesamofficial