NPS News: ఎన్‌పీఎస్‌కు (National Pension System) సంబంధించి, 'పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ' (PFRDA) కొత్త రూల్‌ తీసుకువస్తోంది. ఈ నిబంధన 01 ఏప్రిల్‌ 2024 నుంచి అమల్లోకి వస్తుంది. వాస్తవానికి దీనిని కొత్త నిబంధన అనే కంటే మరింత రక్షణ అంటేనే బాగుంటుంది. 


PFRDA ఇచ్చిన అప్‌డేట్‌ ప్రకారం, ఎన్‌పీఎస్‌ ఖాతాలోకి లాగిన్‌ అయ్యే విధానం మరికొంత కఠినంగా & ఇంకాస్త భద్రంగా మారుతోంది. అకౌంట్‌లో ఉన్న చందాదార్ల డబ్బు ఆన్‌లైన్‌ చోరుల బారిన పడకుండా, ఎన్‌పీఎస్‌ ఖాతాలకు 'పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ' మరింత రక్షణ కల్పిస్తోంది. దీనికోసం ఆధార్‌ అథెంటికేషన్‌ను తప్పనిసరి చేసింది.


NPSలో కొత్త సెక్యూరిటీ ఫీచర్‌
NPS CRA (Central Record Keeping Agency) సిస్టమ్‌లోకి లాగిన్ అయ్యే సమయంలో, ఆధార్ ఆధారిత ధృవీకరణను (Aadhaar based authentication) పీఎఫ్‌ఆర్‌డీఏ తప్పనిసరిగా మార్చింది. ఇప్పుడు, CRA సిస్టమ్‌లోకి లాగిన్ కావడానికి టు-ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ (Two-Factor Authentication - 2FA) ఉంటుంది. 


లాగిన్‌కు సంబంధించిన కొత్త నిబంధన 01 ఏప్రిల్ 2024 నుంచి అమలులోకి వస్తుంది. దీనిపై, పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ గతంలోనే ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఎన్‌పీఎస్‌ ఖాతాలోకి లాగిన్‌ కావడానికి ఆధార్‌ ధృవీకరణను కూడా జత చేయడం వల్ల, లాగిన్ ఫ్రేమ్‌వర్క్‌ మరింత బలంగా మారుతుందని ఆ సర్క్యులర్‌లో PFRDA పేర్కొంది. ప్రభుత్వ కార్యాలయాలు, స్వయంప్రతిపత్త సంస్థల్లో NPS కార్యకలాపాలకు ఇది సురక్షితమైన వ్యవస్థను సృష్టిస్తుందని వెల్లడించింది.


నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ను PFRDA నియంత్రిస్తుంది. PFRDA సర్క్యులర్ ప్రకారం.. ఇప్పటికే ఉన్న 'యూజర్ ఐడీ & పాస్‌వర్డ్' లాగిన్ ప్రక్రియతో ఆధార్ ఆధారిత ధృవీకరణ అనుసంధానం అవుతుంది. ఫలితంగా.. టు-ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ తర్వాత మాత్రమే  సీఆర్‌ఏ సిస్టమ్‌లోకి లాగిన్ కావడానికి వీలవుతుంది. అంటే, ఆధార్‌తో లింక్‌ అయిన మొబైల్‌ నంబర్‌కు OTP వస్తుంది. ఆ OTP ఎంటర్‌ చేస్తేనే ఖాతాలోకి లాగిన్‌ అవ్వగలరు. ఇది, చందాదార్ల ఖాతాలకు భద్రత పెంచుకుంది. ప్రస్తుతం, పాస్‌వర్డ్ ఆధారిత లాగిన్ ద్వారా సెంట్రల్ రికార్డ్ కీపింగ్‌ను యాక్సెస్ చేసి, తద్వారా ఎన్‌పీఎస్ లావాదేవీలు చేస్తున్నారు. 


NPS అకౌంట్‌ నుంచి పాక్షికంగా డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి (partial withdrawal of pension), ఈ ఏడాది ఫిబ్రవరి (01 ఫిబ్రవరి 2024) నుంచి కొత్త నిబంధన అమలవుతోంది. 


ఫిబ్రవరి 01 నుంచి, NSP ఖాతాలో జమ అయిన మొత్తం డబ్బులో, యజమాన్యం వాటాను మినహాయించి, చందాదార్లు కట్టే వాటా నుంచి మాత్రమే పాక్షికంగా విత్‌డ్రా చేసుకోవాలి. అది కూడా, ఖాతా నిల్వలో 25 శాతం మించకుండా ఉపసంహరించుకోవాలి. అలాగే, కాంట్రిబ్యూషన్‌ మీద వచ్చే వడ్డీ ఆదాయాన్ని పాక్షికంగా విత్‌డ్రా చేసుకునే అవకాశం లేదు. 


కొత్త నిబంధన ప్రకారం, కొన్ని ప్రత్యేక పరిస్థితుల కోసం మాత్రమే NPS ఖాతా నుంచి డబ్బును పాక్షికంగా ఉపసంహరించుకునేందుకు అనుమతిస్తారు. అవి:


- పిల్లల ఉన్నత చదువుల కోసం. చట్టబద్ధంగా దత్తత తీసుకున్న పిల్లలకు కూడా వర్తింపు.
- పిల్లల వివాహ ఖర్చుల కోసం. చట్టబద్ధంగా దత్తత తీసుకున్న పిల్లలకు వర్తింపు.
- చందాదారు పేరిట ఇల్లు కట్టుకోవడం లేదా కొనడానికి. జాయింట్‌ ఓనర్‌షిప్‌ కూడా కవర్ అవుతుంది. ఇండివిడ్యువల్‌ హౌస్‌ లేదా అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్‌కు ఇది వర్తిస్తుంది. పూర్వీకుల ఆస్తి కాకుండా, సబ్‌స్క్రైబర్‌కు ఇప్పటికే నివాస ఆస్తి ఉంటే పెన్షన్‌ ఖాతా నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకోవడం కుదరదు. 
- దీర్ఘకాలిక/ప్రాణాంతక వ్యాధుల చికిత్స ఖర్చుల కోసం. క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్యూర్, ప్రైమరీ పల్మనరీ ఆర్టరీ హైపర్‌టెన్షన్, మల్టిపుల్ స్క్లెరోసిస్, మేజర్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్, కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్ట్, కొవిడ్-19 ఇతర పెద్ద స్థాయి జబ్బులు ఈ పరిధిలోకి వస్తాయి.
- చందాదారుకు అవయవ వైకల్యం ఉండి, దానికి అవసరమైన వైద్య ఖర్చుల కోసం.
- స్టార్టప్ లేదా కొత్త వెంచర్‌ను ఏర్పాటు చేసేందుకు.
- నైపుణ్యం పెంచుకోవడానికి


మరో ఆసక్తికర కథనం: మీకు పీపీఎఫ్‌, ఎస్‌ఎస్‌వై ఖాతా ఉందా?, జరిమానా తప్పించుకోవడానికి ఇంకొన్ని రోజులే గడువు!