Personal Loan Benefits: ఎవరికైనా హఠాత్తుగా డబ్బులు అవసరమైతే, వెంటనే సర్దుబాటు చేసుకోగల మార్గాల్లో పర్సనల్‌ లోన్‌ ఒకటి. ఒక వ్యక్తికి ప్రి-అప్రూవ్డ్‌ పర్సనల్‌ లోన్‌ ఆఫర్‌ ఉంటే, డాక్యుమెంట్లతో పని లేకుండా కేవలం 5 నిమిషాల్లో ఆ డబ్బు తీసుకోవచ్చు. ప్రి-అప్రూవ్డ్‌ పర్సనల్‌ లోన్‌ ఆఫర్‌ లేకపోతే, అవసరమైన డాక్యుమెంట్లతో లోన్‌ కోసం అప్లై చేయాలి. అన్ని అర్హతలు ఉంటే 2, 3 పని దినాల్లో డబ్బు చేతికి అందుతుంది. బ్యాంక్‌లు లేదా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCలు) వ్యక్తిగత రుణాలను మంజూరు చేస్తున్నాయి. 


గృహ రుణం, వాహన రుణం వంటి సురక్షిత రుణాలకు వ్యక్తిగత రుణం భిన్నం. దీనికి ఎలాంటి తాకట్టు అవసరం లేదు. కేవలం నమ్మకం మీదే పర్సనల్‌ లోన్‌ మంజూరు అవుతుంది. అంటే, వ్యక్తిగత రుణం అనేది అసురక్షిత రుణం (Unsecured loan). కాబట్టి, సురక్షిత రుణాలతో పోలిస్తే వీటిపై వడ్డీ కాస్త ఎక్కువగా ఉంటుంది. పర్సనల్‌ లోన్‌ను నెలవారీ సమాన వాయిదాల్లో (EMI) తిరిగి చెల్లించవచ్చు.


వ్యక్తిగత రుణం ఎందుకు తీసుకోవాలి? ‍(Why do you need a personal loan?)


అత్యవసర అనారోగ్య పరిస్థితి: ఉన్నట్లుండి ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రిలో చేరాల్సి వస్తే, వైద్య ఖర్చుల కోసం అప్పటికప్పుడు డబ్బు కావాలి. ఆరోగ్య బీమా ఉన్నా సరిపోకపోవచ్చు. అలాంటి పరిస్థితిలో ఒక పర్సనల్‌ లోన్‌ మీ టెన్షన్‌ తగ్గిస్తుంది. వైద్య ఖర్చుల కోసం ఒకేసారి డబ్బు తీసుకుని, నెలకు కొంత చొప్పు ఆర్థిక భారం లేకుండా తిరిగి చెల్లించవచ్చు. కనిష్టంగా 12 నెలల నుంచి 60 నెలల వరకు, ఎంపిక చేసిన వ్యక్తులకు గరిష్టంగా 72 నెలల వరకు EMI ఫెసిలిటీతో బ్యాంక్‌లు వ్యక్తిగత రుణాలు మంజూరు చేస్తున్నాయి.


వివాహం: ఆడయినా, మగయినా.. జీవితంలో మరో మెట్టు ఎదిగే ఘట్టం వివాహం. పెళ్లిని సింపుల్‌గా రిజిస్టర్‌ ఆఫీస్‌లో చేసుకోవచ్చు, ఊరువాడా మోత మోగేలా ఆడంబరంగానూ చేసుకోవచ్చు. డాబుసరిగా జరిపించాలంటే డబ్బు కావాలి. క్యాటరింగ్ నుంచి కళ్యాణ మంటపం వరకు కరెన్సీ నోట్లు మంచినీళ్లలా ఖర్చవుతాయి. ఏమైనా సరే 'తగ్గేదే లే' అన్నట్లుండాలంటే.. పర్సనల్‌ లోన్‌ తీసుకోవచ్చు, EMIల పద్ధతిలో ఈజీగా తీర్చేయొచ్చు. 


కొత్త ఇల్లు/ఆధునీకరణ: కొత్త ఇల్లు కొనడానికి/కట్టుకోవడానికి డౌన్‌ పేమెంట్‌ లేకపోయినా, బ్యాంక్‌ ఇచ్చే హౌసింగ్‌ లోన్‌ చాలకపోయినా, వెనకడుగు వేయకుండా వ్యక్తిగత రుణం కోసం అప్లై చేయవచ్చు. పాత ఇంటిని రీమోడల్‌ చేసి, ఆధునిక హంగులు అద్దాలన్నా పర్సనల్‌ లోన్‌కు ప్రిపేర్‌ కావచ్చు. మీ అవసరానికి తగ్గట్లుగా, వేల రూపాయల నుంచి లక్షల రూపాయల వరకు రుణం అందుబాటులో ఉంటుంది.


హాలిడే - జాలీడే: రొటీన్‌ లైఫ్‌ బోర్‌ కొడితే కొన్ని రోజులు విహార యాత్రకు వెళ్లి రావచ్చు. కొన్నిసార్లు అనుకోకుండా వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో వేరే వాళ్లను డబ్బు అడిగి సర్దుబాటు చేసుకునే సమయం కూడా ఉండకపోవచ్చు. లాస్ట్‌ మినిట్‌ సిట్యుయేషన్‌లో, చాలా తక్కువ డాక్యుమెంటేషన్‌తో వ్యక్తిగత రుణం తీసుకోవచ్చు. డబ్బులు దొరకవేమోనన్న బెంగను ఇది దూరం చేస్తుంది.


విద్య కోసం: మన దేశంలో విద్యా ద్రవ్యోల్బణం అతి భారీగా ఉంది. పెద్ద చదువు చదవాలన్న ఆశ దవ్యోల్బణం దగ్గర ఆగిపోకూడదనుకుంటే, మీ పిల్లలకు 'బెస్ట్‌' ఇవ్వాలని మీరు భావిస్తే.. వ్యక్తిగత రుణం తీసుకోచ్చు. ఈ నిర్ణయం మీ పిల్లల భవిష్యత్తుకు భద్రత కల్పిస్తుంది.


ట్రెండ్‌ ఫాలో అవుదాం: ప్రస్తుత 5G యుగంలో, సాంకేతికత వేగాన్ని అందుకోవడం ఒక సవాల్‌. ఈరోజు లేటెస్ట్‌ అనుకున్నది రేపటికి ఔట్‌ డేటెడ్‌ అవుతోంది. మీ చేతిలోని స్మార్ట్‌ఫోన్‌ నుంచి మీ ఇంట్లోని ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్‌ వరకు, ప్రతీదీ ఆధునికంగా ఉండాలంటే దానికి తగ్గట్లుగా ఖర్చు పెట్టాలి. ఇలాంటి వాటి కోసం తీసుకునే పర్సనల్‌ లోన్‌.. ట్రెండ్‌ను మీ ఫ్రెండ్‌గా చేస్తుంది. 


అడిగినంత లోన్‌ ఇస్తున్నారు కదాని అతిగా ఆశ పడితే సుఖపడ్డట్లు చరిత్రలో లేదు. అప్పు తీసుకునే ముందు ఈ విషయాన్ని గట్టిగా గుర్తు చేసుకోండి.


మరో ఆసక్తికర కథనం: ఎస్‌బీఐ స్పెషల్‌ ఎఫ్‌డీ స్కీమ్‌, ఎక్కువ వడ్డీకి గ్యారెంటీ, గడువు కూడా పెంపు