Mahila Samman Savings Certificate Update: పొదుపు, పెట్టుబడుల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 'మహిళ సమ్మాన్ బచత్ పత్ర యోజన'ను (Mahila Samman Savings Certificate Scheme) ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023 బడ్జెట్‌లో ప్రకటించారు. పెట్టుబడులు పెట్టడానికి ఏప్రిల్ 1 నుంచి ఈ స్కీమ్ అందుబాటులోకి వచ్చింది. మహిళల కోసం ఇదో గొప్ప పథకం అని ప్రధాని మోదీ అభివర్ణించారు.
మహిళా సమ్మాన్ బచత్ పత్ర యోజన గురించి ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. మహిళల గౌరవం, సాధికారతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, మహిళ సమ్మాన్ బచత్ పత్ర దీనికి ఉత్తమ ఉదాహరణ అని పేర్కొన్నారు. ఏప్రిల్ 1న, ఇండియన్ పోస్ట్ కూడా దీని గురించి ఒక ట్వీట్ చేసింది. దేశవ్యాప్తంగా 1.59 లక్షల పోస్టాఫీసుల్లో ఈ పథకాన్ని ప్రారంభించినట్లు వెల్లడించింది.
మహిళ సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ పథకం
మహిళ సమ్మాన్ బచత్ పత్ర యోజనలో రెండేళ్ల కాలానికి మాత్రమే పెట్టుబడి పెట్టవచ్చు. మీరు ఈ పథకంలో ఒక వెయ్యి రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ డబ్బును ఏకమొత్తంగా జమ చేయాలి, విడతల వారీగా పెట్టుబడి ఈ పథకంలో కదరదు. ఈ స్కీమ్ కింద సింగిల్ అంకౌంట్ మాత్రమే తెరవగలరు, జాయింట్ అకౌంట్‌కు వీలు లేదు. మహిళ సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్‌పై 7.5 శాతం వార్షిక వడ్డీని చెల్లిస్తున్నారు. ఈ వడ్డీని త్రైమాసిక ప్రాతిపదికన (3 నెలలకు ఒకసారి) ఖాతాలో జమ చేస్తారు.
మహిళ సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్‌లో ఎలా పెట్టుబడి పెట్టాలి?
2023 ఏప్రిల్ 1వ తేదీ నుంచి, దేశంలోని ప్రతి మహిళ, మైనర్ బాలికల పేరిట సంరక్షులు ఈ పథకంలో చేరవచ్చు. దేశవ్యాప్తంగా 1.59 లక్షల పోస్టాఫీసుల్లో ప్రస్తుతం ఈ పథకం అందుబాటులో ఉంది.
ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలంటే మీ సమీపంలోని పోస్టాఫీసు లేదా బ్యాంకు శాఖకు వెళ్లాలి.
మహిళ సమ్మాన్ బచత్ పత్ర యోజన ఫారం నింపాలి.
వ్యక్తిగత, నివాస చిరునామా రుజువు పత్రాలతో కలిసి ఈ ఫారాన్ని సంబంధిత అధికారులకు సమర్పించాలి.
పెట్టుబడి పెట్టాలనుకుంటున్న మొత్తాన్ని చెక్కు లేదా నగదు రూపంలో జమ చేయవచ్చు.
మీ పెట్టుబడికి సంబంధించిన రసీదును తీసుకోవడం మాత్రం మరిచిపోవద్దు.