LIC Jeevan Azad Policy: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC), జీవన్ ఆజాద్ (Plan No. 868) పేరుతో పాలసీని రన్‌ చేస్తోంది. సేవింగ్స్‌తో పాటు లైఫ్‌ ఇన్సూరెన్స్ కవరేజీని కలగలిపి అందించే ఎల్‌ఐసీ స్కీమ్‌ ఇది. దీని ద్వారా పాలసీదారు కుటుంబానికి ఆర్థిక భద్రత, పొదుపు ప్రయోజనం రెండూ అందుతాయి.


ఎల్‌ఐసీ జీవన్ ఆజాద్ పథకం కింద రూ. 5 లక్షల వరకు (Sum Assured) బీమా కవరేజ్‌ ఉంటుంది. దీంతో పాటు, మరికొన్ని బెనిఫిట్స్‌ కూడా అందుతాయి.


LIC జీవన్ ఆజాద్ అనేది.. పరిమిత కాల చెల్లింపు ఎండోమెంట్ పథకం. పాలసీ కొనసాగుతున్న సమయంలో దురదృష్టవశాత్తు పాలసీహోల్డర్‌ మరణిస్తే, బాధిత కుటుంబానికి ఆర్థిక సాయాన్ని ఈ పథకం అందిస్తుంది. పాలసీ మెచ్యూరిటీ తేదీ నాటికి పాలసీహోల్డర్‌ జీవించి ఉంటే, జీవిత బీమా కోసం హామీ ఇచ్చిన మొత్తం డబ్బు చేతికి వస్తుంది. ఈ స్కీమ్‌ ద్వారా ఎల్‌ఐసీ నుంచి లోన్‌ కూడా తీసుకోవచ్చు. 


హామీ మొత్తం ఎంత?
ఎల్‌ఐసీ జీవన్ ఆజాద్ స్కీమ్‌లో, బేసిక్‌ అజ్యూరెన్స్ కింద కనిష్టంగా రూ. 2 లక్షలు, గరిష్టంగా రూ. 5 లక్షలు ఇస్తారు. ఈ పాలసీని కనిష్ట కాల వ్యవధి 15 సంవత్సరాలు, గరిష్ట కాల వ్యవధి 20 సంవత్సరాలు.


ఎన్ని సంవత్సరాల పాటు ప్రీమియం కట్టాలి?
ఎల్‌ఐసీ జీవన్ ఆజాద్ ప్లాన్‌లో ప్రీమియం చెల్లింపు వ్యవధి మైనస్‌ 8 (-8) సంవత్సరాలుగా ఉంటుంది. అంటే.. పాలసీ చెల్లింపు వ్యవధి కంటే 8 సంవత్సరాల ముందే ప్రీమియం కట్టడం కంప్లీట్‌ అవుతుంది. ఉదాహరణకు... మీరు 20 ఏళ్ల కాల వ్యవధి ఆప్షన్‌ను ఎంచుకుంటే (20-8), 12 ఏళ్ల పాటు ఎల్‌ఐసీ జీవన్ ఆజాద్ ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. ఆ తర్వాత మిగిలిన 8 సంవత్సరాలు కూడా మీరు పాలసీ కవరేజ్‌లో ఉంటారు. 


పాలసీదారు వెసులుబాటును బట్టి వార్షిక, ‍‌అర్ధ వార్షిక, త్రైమాసిక, ‍‌నెలవారీ ప్రాతిపదికన ప్రీమియం చెల్లించవచ్చు. వీటిలో ఏదో ఒక ఆప్షన్‌ ఎంచుకోవాలి.


పాలసీదారు వయస్సు ఎంత ఉండాలి?
LIC ఆజాద్ ప్లాన్ తీసుకోవడానికి పాలసీదారు వయస్సు కనిష్టంగా 90 రోజుల నుంచి గరిష్టంగా 50 సంవత్సరాల వరకు ఉండాలి. అంటే, మూడు నెలల వయస్సున్న పిల్లల పేరు మీద కూడా ఈ పాలసీ తీసుకోవచ్చు. 50 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు తీసుకుంటే, ఆ తర్వాత 8 సంవత్సరాల పాటు పాలసీ కవరేజ్‌లో ఉంటారు.


డెట్‌ బెనిఫిట్‌ ఎంత ఉంటుంది?
బీమా తీసుకున్న వ్యక్తి పాలసీ మెచ్యూరిటీ తేదీ కంటే ముందే మరణిస్తే, ఈ పథకం కింద డెత్‌ బెనిఫిట్‌ లభిస్తుంది. మరణ ప్రయోజనం బేసిక్ సమ్ అష్యూర్డ్ లేదా వార్షిక ప్రీమియంలో ఏడు రెట్లకు సమానంగా ఉంటుంది. పాలసీదారు మరణించిన తేదీ వరకు చెల్లించిన మొత్తం ప్రీమియంలో ఇది 105% కంటే తక్కువ కాకుండా ఉంటుంది.


మరో ఆసక్తికర కథనం: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అప్డేట్! షేర్లు ఎందుకిలా క్రాష్‌ అవుతున్నాయ్‌!


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. సంప్రదాయ బీమా పాలసీల్లో వచ్చే రాబడి కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఏదైనా పాలసీని కొనే ముందు ఆ పాలసీ డాక్యుమెంట్ పూర్తిగా చదవడం, ఎల్‌ఐసీ ఏజెంట్‌ నుంచి పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది. మీ అవసరాలకు తగినట్లుగా ఉంటేనే ఏ పాలసీ అయినా తీసుకోండి. వీలయితే ఆర్థిక నిపుణుడి సలహా తీసుకోవడం మేలు.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial