LIC loan: భారతదేశంలో కోట్లాది మంది ప్రజలు కనీసం ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ‍‌(LIC) పాలసీ అయినా కలిగి ఉన్నారు. ఈ పాలసీల్లో పెట్టుబడి రిస్క్ ఉండదు. పైగా దీర్ఘకాలికంగా మంచి రాబడి ప్రయోజనాన్ని, జీవిత బీమా కవరేజ్‌ను కూడా అందిస్తాయి. ఇవి మాత్రమే కాదు, ఎల్‌ఐసీ పాలసీపై రుణ సౌకర్యం  (Loan Against LIC Policy) కూడా లభిస్తుందని మీకు తెలుసా. అత్యవసర పరిస్థితుల్లో, బ్యాంకు నుంచి వ్యక్తిగత రుణం తీసుకునే బదులు LIC బీమా పాలసీపై మీరు రుణం తీసుకోవచ్చు. తద్వారా... చదువులు, పెళ్లి, ఇల్లు, విదేశాలకు వెళ్లడం, మెడికల్ ఎమర్జెన్సీ వంటి అవసరాలను తీర్చుకోవచ్చు.


LIC పాలసీపై రుణం ఎలా తీసుకోవాలో తెలుసా?     
LIC పాలసీపై లోన్ ఎలా తీసుకోవాలో చాలామందికి తెలియదు. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పాలసీపై ఎల్‌ఐసీ ఇచ్చే రుణాన్ని సురక్షిత రుణంగా (Secured loan) పరిగణిస్తారు. అంటే, రుణ మొత్తానికి మించి విలువైనదాన్ని తనఖాగా తీసుకుంటారు. ఇక్కడ, మీ బీమా పాలసీయే మీ రుణానికి గ్యారెంటీగా పని చేస్తుంది. ఒక వ్యక్తి ఈ రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించలేకపోతే, అతని పాలసీ డబ్బు నుంచి రుణాన్ని జమ చేసుకుంటారు. మీ పాలసీపై మీకు ఎంత రుణం లభిస్తుందనే సమాచారాన్ని మీరు LIC ఈ-సర్వీసెస్‌ (LIC e- Services) ద్వారా తెలుసుకోవచ్చు. లోన్‌కు బదులుగా, ఎల్‌ఐసి పాలసీ బాండ్‌ను తన వద్దే ఈ కంపెనీ ఉంచుకుంటుంది. పాలసీ మెచ్యూరిటీ సమయానికి మీరు రుణాన్ని చెల్లించని పక్షంలో, పాలసీ డబ్బు నుంచి లోన్ మొత్తాన్ని మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని పాలసీదారుకు అప్పగిస్తుంది. లోన్‌ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా, కొంతమంది ఈ మార్గాన్ని అనుసరిస్తుంటారు.


పాలసీపై ఎంత రుణం పొందవచ్చు?      
పాలసీ మొత్తం సరెండర్ విలువలో 90 శాతం వరకు LIC రుణం ఇస్తుంది. కొన్ని ప్రీ-పెయిడ్ పథకాలపై ఈ పరిమితి 85 శాతం వరకు ఉంటుంది. దీంతో పాటు, పాలసీపై రుణం తీసుకోవడానికి, మీ బీమా పాలసీని ప్రారంభించి కనీసం 3 సంవత్సరాలై ఉండాలి.


ఎల్‌ఐసీ రుణం కోసం ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు ప్రక్రియ:
మొదట, ఎల్‌ఐసీ ఈ-సర్వీసెస్‌లో మీ పేరు, వివరాలు నమోదు చేసుకోవాలి.
ఆ తర్వాత, ఈ-సర్వీసెస్‌లోనే లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
మీరు సంబంధిత పత్రాలతో పాటు KYC ప్రక్రియను పూర్తి చేయాలి.
ఇప్పుడు మీరు అన్ని పత్రాలను LIC బ్రాంచ్‌కు పంపాలి.
దీని తర్వాత, 3 నుంచి 5 రోజుల్లో మీ లోన్‌కు ఆమోదం లభిస్తుంది.


ఎల్‌ఐసీ రుణం కోసం ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ప్రక్రియ:
మీరు LIC రుణం కోసం ఆఫ్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం, మీ పాలసీని కలిగి ఉన్న LIC బ్రాంచ్‌కు వెళ్లాలి. అక్కడ, రుణం కోసం దరఖాస్తు ఫారాన్ని నింపాలి. మీ పాలసీ బాండ్, ఇతర అవసరమైన పత్రాలను అక్కడి అధికారులకు సమర్పించాలి. దీని తర్వాత, 3 నుంచి 5 రోజుల్లో మీ లోన్‌కు ఆమోదం లభిస్తుంది.