Zero Cost Term Insurance Details: ప్రస్తుతం, మన దేశంలో జీవిత బీమా (Life Insurance), ఆరోగ్య బీమా ‍‌(Health Insurance) రంగాల్లో చాలా ప్రొడక్ట్స్‌/ప్లాన్స్‌ అందుబాటులో ఉన్నాయి. బీమా తీసుకునే వాళ్ల సంఖ్య కూడా భారీగా పెరిగింది. సంపాదించే వ్యక్తి లేదా కుటుంబ పెద్ద ఈ లోకంలో లేని సమయంలోనూ ఆ కుటుంబం ఆర్థికంగా కుంగిపోకుండా ధీమా కల్పిస్తుంది బీమా. 


జీవిత బీమా విభాగంలో... లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (LIC) సహా చాలా బ్యాంకులు, సంస్థలు పోటీ పడుతున్నాయి. కస్టమర్లను ఆకట్టుకోవడానికి కొత్త పథకాలు, ఆప్షన్లను అందిస్తున్నాయి. ఈ క్రమంలో వచ్చిందే ‘జీరో కాస్ట్‌ టర్మ్‌ ఇన్సూరెన్స్‌’ (Zero cost term insurance). 


‘జీరో కాస్ట్‌ టర్మ్‌ ఇన్సూరెన్స్‌’ అంటే ఏంటి? ‍‌(What is 'Zero Cost Term Insurance'?)
సాధారణంగా, టర్మ్‌ ఇన్సూరెన్స్‌లో డబ్బులు తిరిగి రావు. కానీ, మీ కష్టార్జితాన్ని మళ్లీ మీ జేబులోకి చేర్చేదే 'జీరో కాస్ట్‌ టర్మ్‌ ఇన్సూరెన్స్‌'. ఈ ప్లాన్‌లో, అప్పటి వరకు మీరు కట్టిన ప్రీమియం మొత్తాన్ని బీమా సంస్థ తిరిగి మీకు ఇచ్చేస్తుంది. అంటే, డబ్బు పోగొట్టుకోకుండానే బీమా రక్షణ పొందొచ్చు.


ఇంకాస్త వివరంగా చెప్పుకుందాం. సాధారణంగా టర్మ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవడానికి జనం పెద్దగా ఇష్టపడడం లేదు. సంప్రదాయ జీవిత బీమా పథకాల తరహాలో... టర్మ్‌ ఇన్సూరెన్స్‌ కోసం కట్టిన ప్రీమియం ‍‌(Insurance premium) డబ్బులు తిరిగి రాకపోవడమే దీనికి ప్రధాన కారణం. దీనిని దృష్టిలో పెట్టుకుని, బీమా కంపెనీలు అమలు చేస్తున్న ప్లాన్‌ ‘జీరో కాస్ట్‌ టర్మ్‌ ఇన్సూరెన్స్‌’. అన్ని పాలసీల్లాగే దీనిలోనూ బీమా రక్షణ ఉంటుంది. దురదృష్టవశాత్తు పాలసీదారు మరణిస్తే, నామినీకి బీమా సొమ్ము అందుతుంది. ఈ ప్లాన్‌ ఉన్న అదనపు బెనిఫిట్‌.. ప్రీమియం డబ్బు వెనక్కు తిరిగి రావడం. టర్మ్‌ ప్లాన్‌ తీసుకుని కొన్ని సంవత్సరాలు ప్రీమియం కట్టిన తర్వాత, ఏ కారణం వల్లనైనా ఇక టర్మ్‌ ఇన్సూరెన్స్‌ వద్దని మీరు అనుకుంటే, ఆ పాలసీని సదరు సంస్థకు సరెండర్‌ చేయవచ్చు. అలా చేస్తే, అప్పటి వరకు మీరు కట్టిన ప్రీమియం డబ్బును బీమా కంపెనీ తిరిగి మీకు ఇచ్చేస్తుంది. ఆ ప్రీమియం మీద GSTని మాత్రం మినహాయించుకుంటుంది. 


అంటే, అవసరం అనుకున్నంత కాలం టర్మ్‌ ఇన్సూరెన్స్‌ కవరేజ్‌లో ఉండి, అవసరం లేదు అనుకున్నప్పుడు ఆ పాలసీని తిరిగి ఇచ్చేయొచ్చు. అప్పటివరకు కట్టిన డబ్బును తిరిగి తీసుకోవచ్చు. ప్రీమియం కట్టినంత కాలం రక్షణ ఉంటుంది, ఆ తర్వాత డబ్బంతా తిరిగి చేతికి వస్తుంది. అంటే, మీకు ఎలాంటి ఖర్చు లేకుండా ఇన్సూరెన్స్‌ బెనిఫిట్‌ పొందొచ్చు.


‘జీరో కాస్ట్‌ టర్మ్‌ ఇన్సూరెన్స్‌’ తీసుకోవడానికి ఎవరు అర్హులు? ‍‌(Who is eligible for 'Zero Cost Term Insurance'?)
45 సంవత్సరాల వయస్సు మించని వాళ్లు మాత్రమే ఇలాంటి పాలసీ తీసుకోవడానికి అర్హులు. అయితే, డబ్బు అవసరమైన సందర్భాల్లో తొందరపడి పాలసీని సరెండర్‌ చేయవద్దు. మీరు యాక్టివ్‌గా పని చేస్తున్నంత కాలం మీ కుటుంబానికి తగిన రక్షణ ఉండాలని గుర్తు పెట్టుకోండి. ఇక మీరు ఇంటి నుంచి కదలాల్సిన అవసరం లేని సందర్భంలో, మీపై ఎలాంటి ఆర్థిక బాధ్యతలు లేనప్పుడు, మీ కుటుంబానికి ఆర్థికంగా ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు మాత్రమే జీరో కాస్ట్‌ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని సరెండర్‌ చేసే నిర్ణయం తీసుకోవడం మంచింది.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవే