Income Tax Return For AY 2023-24: 2022-23 ఆర్థిక సంవత్సరం లేదా 2023-24 మదింపు సంవత్సరానికి (అసెస్‌మెంట్ ఇయర్) ఆన్‌లైన్‌లో ఆదాయపు పన్ను పత్రాలు దాఖలు చేయడానికి, ఆన్‌లైన్ ఐటీఆర్-1 (ITR-1) & ఐటీఆర్-4 (ITR-4) ఫారాలను ఆదాయపు పన్ను విభాగం సిద్ధం చేసింది. ఈ ఫారాల ద్వారా ఆన్‌లైన్‌లో ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయాల్సిన పన్ను చెల్లింపుదార్లు, ఆన్‌లైన్ ఫామ్ యాక్టివేట్ అయిన తర్వాత ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్ చేయవచ్చు. ఈ సమాచారాన్ని ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్ ద్వారా ఆదాయ పన్ను విభాగం ప్రకటించింది.
ప్రి-ఫిల్డ్ డేటాతో ఆన్‌లైన్ ఫారాలు
2023-24 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి ఆన్‌లైన్ ITR-1 & ITR-4 సిద్ధమయ్యాయని ఆదాయపు పన్ను విభాగం ట్వీట్ కూడా చేసింది. ఈ ఫారాల్లో కొంత సమాచారం ముందస్తుగానే నింపి (prefilled data) ఉంటుంది. ఈ సమాచారంలో, ఫారం-16 ప్రకారం జీతం ఆదాయం, పొదుపు ఖాతాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల ద్వారా వచ్చిన వడ్డీ ఆదాయం ఉంటాయి. ఎక్సెల్ యుటిలిటీ ఫారంతో పోలిస్తే ఆన్‌లైన్ ఫారం భిన్నంగా ఉంటుంది. ఎక్సెల్ యుటిలిటీ ఫారం ద్వారా ITR ఫైల్ చేయడానికి ముందుగా ఆ ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో అవసరమైన సమాచారాన్ని నింపి, తిరిగి ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి.
ఎక్సెల్ యుటిలిటీ ఫారంతో పోలిస్తే. ఆన్‌లైన్ ఫారం ద్వారా ITR ఫైల్ చేయడం చాలా సులభం. ఇందులో ఇచ్చిన సమాచారాన్ని ఫారం-16తో పాటు యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్‌లో (AIS) కనిపించే సమాచారంతో సరిపోల్చుకోవాలి. ఏవైనా తేడాలు కనిపిస్తే సరిచేసుకోవాలి. తద్వారా, ITR ఫైలింగ్ ద్వారా ఆదాయ పన్ను విభాగానికి పన్ను చెల్లింపుదారు అందించే ఆదాయ సమాచారం సరైనదే అని నిరూపించవచ్చు.
ఎవరు, ఏ ఫారాన్ని దాఖలు చేయాలి?
ఐటీఆర్-1ను వ్యక్తులు (Individuals), ఉద్యోగులు, సీనియర్ సిటిజన్స్ సమర్పిస్తారు. ఐటీఆర్-4ను వ్యాపారులు, వృత్తి నిపుణులు దాఖలు చేస్తారు.
వార్షిక ఆదాయం రూ. 50 లక్షల వరకు ఉన్న పన్ను చెల్లింపుదార్లు, జీతం ఆదాయం, ఇంటి ఆస్తి, వడ్డీ ఆదాయం, రూ. 5 వేల వరకు వ్యవసాయ ఆదాయం వంటి వనరులు ఉన్నవాళ్లు ITR-1 దాఖలు చేయాలి. వ్యాపారం, వృత్తి ద్వారా రూ. 50 లక్షల వరకు ఆదాయం ఉన్న వ్యక్తులు, HUFలు (హిందూ అవిభక్త కుటుంబాలు), సంస్థలు (LLPలు మినహా) ITR-4 దాఖలు చేయాలి. ఈ ఆదాయం 44AD, 44DA, 44AE సెక్షన్ల కింద వ్యాపారం లేదా ఏదైనా వృత్తి నుంచి వచ్చి ఉండాలి, వ్యవసాయ ఆదాయం రూ. 5000 మించకూడదు.
ఆదాయ పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి, జీతం తీసుకునే వ్యక్తులకు జూన్ నెలలో కంపెనీ యాజమాన్యాలు జారీ చేసే ఫారం-16 అవసరం. ఫారం-16 జారీకి చివరి తేదీ జూన్ 15.
2022-23 ఫైనాన్షియల్ ఇయర్ లేదా 2023-24 అసెస్‌మెంట్ సంవత్సరానికి ITR దాఖలు చేయాల్సిన చివరి తేదీ జులై 31, 2023. ఈ ఏడాది ఫిబ్రవరి రెండో వారంలోనే, 2022-23 ఆర్థిక సంవత్సరం లేదా 2023-24 అసెస్‌మెంట్ సంవత్సరానికి కొత్త ఆదాయపు పన్ను రిటర్న్ ఫారాలను CBDT నోటిఫై చేసింది.
ఇది కూడా చదవండి: లాంగ్‌టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం ఏ మ్యూచువల్ ఫండ్ కరెక్ట్?