Income Tax Refund Update: ఇన్‌కమ్‌ టాక్స్‌ రిటర్న్‌ను ఫైల్ చేయడానికి ఇక ఎక్కువ సమయం లేదు. గత వారం రోజులుగా ఐటీఆర్‌ ఫైలింగ్‌ నంబర్స్‌లో వేగం పెరిగింది, ప్రతిరోజు ఈ నంబర్‌ కొత్త రికార్డ్‌ స్థాయిలో ఉంటోంది. మరో శుభవార్త ఏంటంటే.. ఇన్‌కమ్‌ టాక్స్‌ రిఫండ్‌ డబ్బులు టాక్స్‌ పేయర్ల బ్యాంక్‌ అకౌంట్లలో క్రెడిట్‌ కావడం కూడా ప్రారంభమైంది.


ఇన్‌కమ్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ పోర్టల్‌లోని సమాచారం ప్రకారం, ఇప్పటివరకు 11.31 కోట్ల మంది వ్యక్తిగత పన్ను చెల్లింపుదార్లు పోర్టల్‌లో రిజిస్టర్‌ అయ్యారు. ప్రస్తుత సీజన్‌లో (2023-24 అసెస్‌మెంట్ ఇయర్‌) ఇప్పటి వరకు 2.61 కోట్లకు పైగా ఆదాయ పన్ను పత్రాలు దాఖలు అయ్యాయి. వారం రోజుల క్రితం వీటి సంఖ్య దాదాపు 1.30 కోట్లు. అంటే, ఒక్క వారంలో ఈ నంబర్‌ స్కైరాకెట్‌ను తలపించింది, ఏకంగా 1.25 కోట్లకు పైగా రిటర్నులు దాఖలు అయ్యాయి.


టాక్స్‌ ఫైలింగ్‌ను ధృవీకరించడం తప్పనిసరి
ఇన్‌కమ్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ పోర్టల్‌లోని లెక్కల ప్రకారం, ఇప్పటి వరకు ఫైల్‌ చేసిన రిటర్న్స్‌లో సుమారు 2.41 కోట్ల ఆదాయ పన్ను పత్రాలను టాక్స్‌ పేయర్లు ధృవీకరించారు/ఈ-వెరిఫై చేశారు. ఐటీ రిటర్న్‌ ఫైల్‌ చేయడంతోనే టాక్స్‌ పేయర్‌ పని పూర్తి కాదు. దానిని వెరిఫై చేస్తేనే రిటర్న్‌ సమర్పించే ప్రక్రియ పూర్తవుతుంది. అప్పడు, ఆ రిటర్న్‌కు సంబంధించిన ప్రాసెస్‌ వర్క్‌ను ఇన్‌కమ్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ స్టార్ట్‌ చేస్తుంది. ఆదాయ పన్ను పత్రాల్లో టాక్స్‌ పేయర్‌ ప్రకటించిన సమాచారం సరైనదని తేలితే, క్లెయిమ్ చేసిన రిఫండ్ మొత్తాన్ని అతని బ్యాంక్‌ ఖాతాలోకి ఐటీ డిపార్ట్‌మెంట్‌ జమ చేస్తుంది.


ప్రాసెసింగ్‌లో పెరిగిన వేగం
ఆదాయ పన్ను విభాగం వారం రోజుల క్రితం నుంచి టాక్స్ రిటర్న్‌ల ప్రాసెసింగ్‌ ప్రారంభించింది. ఇప్పుడు, ఆ ప్రక్రియ మరింత వేగంగా మారింది. పోర్టల్‌లో ఉన్న సమాచారం ప్రకారం, టాక్స్‌ పేయర్లు వెరిఫై చేసిన 1.13 కోట్ల ITRలను ఇన్‌కమ్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఇప్పటి వరకు ప్రాసెస్ చేసింది. వీటిలో, రిఫండ్ అర్హత కలిగిన టాక్స్‌ పేయర్ల బ్యాంక్‌ ఖాతాల్లోకి డబ్బును జమ చేసింది.


మీరు కూడా ఇన్‌కమ్‌ టాక్స్‌ రిటర్న్‌ దాఖలు చేసినట్లయితే, దానికి సంబంధించిన స్టేటస్‌ను మీరు ఎప్పుడైనా చెక్‌ చేయవచ్చు. రిటర్న్ దాఖలు చేసి వెరిఫై చేస్తే, ప్రస్తుత సమాచారం ప్రకారం, ఆ ITRను వారం రోజుల్లో ఐటీ డిపార్ట్‌మెంట్‌ ప్రాసెస్‌ చేస్తోంది. రిటర్న్ ప్రాసెస్ చేసిన తర్వాత 1-2 రోజుల్లో రిఫండ్‌ మొత్తం పన్ను చెల్లింపుదారుకు అందుతోంది.


రిఫండ్‌ స్థితిని ఎలా తనిఖీ చేయాలి? ( How to Check Income Tax Refund Status):
https://www.incometax.gov.in/iec/foportal/ లింక్‌ ద్వారా ఆదాయ పన్ను విభాగం ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోకి వెళ్లండి
హోమ్‌ పేజీలో "క్విక్‌ లింక్స్‌" ఆప్షన్‌ కనిపిస్తుంది.
డ్రాప్‌డౌన్ మెనులో, ఏడో బాక్స్‌లో "నో యువర్ రీఫండ్ స్టేటస్‌" కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి
ఇప్పుడు, అక్‌నాలెడ్జ్‌మెంట్‌ నంబర్‌, మొబైల్ నంబర్ వంటి వివరాలను పూరించండి. మీ ITR ఫామ్‌ మీద అక్‌నాలెడ్జ్‌మెంట్‌ నంబర్‌ ఉంటుంది.
మీ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. సంబంధింత గడిలో దానిని నింపండి. 
ఇప్పుడు మీ రిఫండ్‌ స్టేటస్‌ మీకు స్కీన్‌ మీద కనిపిస్తుంది.


మరో ఆసక్తికర కథనం: కొత్త హైట్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఎం-క్యాప్‌, ఇండియన్‌ బ్యాంక్స్‌కు ఈ ఫీట్‌ అసాధ్యం!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial