Income Tax Return Filing 2024: మన దేశంలో, టాక్స్‌ పేయర్లు ఎవరి ఆదాయ పన్ను పత్రాలను వాళ్లే సులభంగా సమర్పించేందుకు ఆదాయ పన్ను విభాగం (Income Tax Deportment) చాలా మార్పులు తీసుకువస్తోంది. అయినప్పటికీ, ఇన్‌కమ్‌ టాక్స్‌ రిటర్న్‌ ఫైలింగ్‌ ఇప్పటికీ సంక్లిష్టంగానే ఉంది. ఐటీఆర్‌లో కనిపించే చాలా విభాగాలు, సెక్షన్లు, నిబంధనలు సామాన్యుడికి అర్ధం కాని ఫజిల్స్‌లా మారాయి. అందుకే, మన దేశంలో మెజారిటీ టాక్స్ పేయర్లు (Taxpayers) ఐటీఆర్‌ ఫైలింగ్‌ కోసం ఆడిటర్ల మీద ఆధారపడుతున్నారు.


ITR ఫైలింగ్‌ను సరళీకృతం చేస్తూనే, ఆదాయ పన్ను విభాగం ప్రతి సంవత్సరం పన్ను విధానంలో కొన్ని మార్పులు తీసుకువస్తోంది. ఈ సంవత్సరం కూడా అలాంటి మార్పులు/ సవరణలు ఉన్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరం (2024-25 అసెస్‌మెంట్ ఇయర్) కోసం ITR దాఖలు చేసే ముందు, ఈ ఏడాది కొత్తగా వచ్చిన మార్పులు లేదా సవరణల గురించి  తెలుసుకుని ITR ఫైల్ చేస్తే కొంత డబ్బు ఆదా చేసే అవకాశం కూడా ఉంటుంది.


ఈ ఏడాది ఐటీఆర్‌ ఫైలింగ్‌లో వచ్చిన ఆరు కీలక మార్పులు:


1. డిఫాల్ట్‌గా కొత్త పన్ను విధానం: రిటర్న్‌ దాఖలు చేయడానికి ఐటీ పోర్టల్‌లోకి వెళ్లగానే, పన్ను చెల్లింపుదార్లందరికీ కొత్త పన్ను విధానం (New Tax Regime) డిఫాల్ట్‌ ఆప్షన్‌గా కనిపిస్తుంది.


2. పాత పన్ను విధానంలోకి మారడం: ఇది చాలా కీలకమైన విషయం. మీకు కొత్త పన్ను విధానం వద్దు, పాత విధానమే కావాలంటే, మీ ITRను 2024 జులై 31వ తేదీలోపు ఫైల్ చేయాలి. ఈ గడువులోగా ఆదాయ పన్ను పత్రాలను దాఖలు చేయలేకపోతే, మీరు ఆటోమేటిక్‌గా కొత్త పన్ను విధానంలో ఉండిపోతారు. ఇక ఈ ఏడాదికి మారలేరు.


3. గత ఆప్షన్లు చెల్లవు: పన్ను విధానాలను ఎంచుకోవడం కోసం గత ఏడాది లేదా అంతకుముందు ఏవైనా ఆప్షన్లు పెట్టుకుని ఉంటే, ఈ ఏడాది అవి వర్తించవు.


4. పన్ను విధానంలో మార్పు: వ్యాపారస్తులు కాని లేదా వృత్తి నిపుణులు కాని వ్యక్తులకు ఇది వర్తిస్తుంది. అంటే, వ్యాపార (Business) ఆదాయం లేదా వృత్తి (Profession) నుంచి ఆదాయం లేని వ్యక్తులు ప్రతి సంవత్సరం పాత పన్ను విధానం & కొత్త పన్ను విధానంలో దేన్నైనా ఎంచుకోవచ్చు. అంటే, గత ఏడాది కొత్త విధానంలో ఐటీఆర్‌ ఫైల్‌ చేస్తే, ఈ ఏడాది పాత విధానంలో ఫైల్‌ చేయవచ్చు. జీతం తీసుకునే ఉద్యోగులు (Salaried employees) కూడా పాత లేదా కొత్త విధానాల్లో దేనికైనా మారవచ్చు. ఈ మూడు కేటగిరీల వ్యక్తులకు ప్రతి సంవత్సరం ఈ ఆప్షన్‌ అందుబాటులో ఉంటుంది.


5. వ్యాపారం లేదా వృత్తి నిపుణులు: వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఆదాయం సంపాదిస్తున్న వ్యక్తులు ప్రతి సంవత్సరం పాత-కొత్త విధానాల మధ్య మారలేరు. వ్యాపారం లేదా వృత్తిని కొనసాగిస్తూ ఆదాయం సంపాదించినంత కాలం, కొత్త విధానంలో కొనసాగవచ్చు. పాత విధానమే కావాలనుకుంటే, జీవితకాలంలో ఒక్కసారి ఆ ఆప్షన్‌ లభిస్తుంది, తిరిగి కొత్త విధానానికి రాలేరు.


6. కొత్త పాలన నుంచి మారడం: వ్యాపారం లేదా వృత్తి ఆదాయం ఉన్న వ్యక్తులు కొత్త పన్ను విధానం నుంచి తప్పుకుని పాత పన్ను విధానంలోకి మారాలని భావిస్తే, తప్పనిసరిగా Form-10IEA ఫైల్ చేయాలి.


ఎలాంటి జరిమానా లేకుండా ఆదాయ పన్ను పత్రాలు సమర్పించడానికి 2024 జులై 31వ తేదీ వరకే గడువు ఉంది. ఈ తేదీలోగా ఐటీఆర్‌ సమర్పించలేకపోతే, 2024 ఆగస్టు 01 నుంచి ఆలస్య రుసుము (Late Fine) కట్టి ఐటీఆర్‌ ఫైల్‌ చేయాల్సి వస్తుంది. లేట్‌ ఫైన్‌తో ఐటీఆర్‌ ఫైల్‌ చేయడానికి ఈ ఏడాది డిసెంబర్‌ 31 వరకు అవకాశం ఉంటుంది.


మరో ఆసక్తికర కథనం: యెస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌పై కోట్ల రూపాయల జరిమానా - ఆర్‌బీఐతో అట్లుంటది