PAN AADHAR CARD LINK: పాన్‌తో ఆధార్‌ను లింక్‌ చేసుకోవాలని ఆదాయ పన్ను విభాగం (Income Tax Department) చాలా కాలంగా చెబుతూ, ఒక విధంగా హెచ్చరిస్తూ వస్తోంది. ఈ అనుసంధానం గడువును ఇప్పటికే అనేక దఫాలు పొడిగించింది. ఈసారి మాత్రం.. ఇదే లాస్ట్‌ ఛాన్స్‌, ఇక పొడిగింపు కొదర్దని కుండబద్ధలు కొట్టేసింది.


మార్చి 31 వరకే తుది గడువు
2023 మార్చి 31వ తేదీలోగా (ఈ నెలాఖరు లోగా) పాన్‌ - ఆధార్‌ లింకింగ్‌ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదాయ పన్ను విభాగం స్పష్టం చేసింది. ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారం పాన్‌ - ఆధార్‌ అనుసంధానం తప్పనిసరని సూచించింది. మినహాయింపు వర్గంలోకి రాని వాళ్లంతా కచ్చితంగా పాన్‌- ఆధార్‌ లింకేజీ పూర్తి చేయాలని తేల్చి చెప్పింది. ఈసారి మిస్సయితే మాత్రం పాన్‌ కార్డు పనికి రాకుండా పోతుందని, అప్పుడు తాము కూడా ఏం చేయలేమని ఆదాయ పన్ను విభాగం స్పష్టం చేసింది. 


పాన్‌ - ఆధార్‌ లింకేజీ పూర్తి కాకపోతే, 2023 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ‍‌(01.04.2023 నుంచి) ఆ పాన్ కార్డ్‌ ఇన్‌ఆపరేటివ్‌గా మారుతుందని ఆదాయ పన్ను విభాగం తెలిపింది. గడువు తేదీ ముంచుకొస్తోంది కాబట్టి త్వరగా అనుసంధానం పూర్తి చేయండంటూ ఇన్‌కమ్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ తొందరపెడుతోంది.


ఫైన్‌ కడితేనే ప్రస్తుతం లింకింగ్‌
పాన్‌- ఆధార్‌ అనుసంధానికి ఇప్పటికే చాలా గడువులు దాటాయి. ప్రస్తుతం, ఆలస్య రుసుముగా (లేట్‌ ఫీజ్‌) వెయ్యి రూపాయలు కడితేనే పాన్‌తో ఆధార్‌ అనుసంధానం పూర్తవుతుంది.


లేట్‌ ఫీజ్‌ ఎలా చెల్లించాలి?
పాన్‌ - ఆధార్‌ లింకేజీ కోసం egov-nsdl.com వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
ఇందులో Tax applicable - (0021) ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత (500) Other Receipts ఆప్షన్‌ మీద క్లిక్‌ చేయాలి.
ఇప్పుడు మీ పాన్‌, అసెస్‌మెంట్‌ ఇయర్‌, పేమెంట్‌ మెథడ్‌, అడ్రస్‌, ఈ-మెయిల్‌, మొబైల్‌ నంబర్‌ వంటి వెబ్‌సైట్‌లో అడిగిన వివరాలన్నీ ఇవ్వాలి.
ఇప్పుడు, కింద కనిపించే క్యాప్చా కోడ్‌ ఎంటర్‌ చేసి పేమెంట్‌ పూర్తి చేయాలి.
మీరు కట్టిన లేట్‌ ఫీజ్‌ను ఓకే చేయడానికి 5 రోజుల వరకు సమయం పడుతుంది. 
ఆ తర్వాత ఐటీ విభాగం ఈ-ఫైలింగ్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి, పాన్‌ - ఆధార్‌ అనుసంధానం పూర్తి చేయవచ్చు.


పాన్‌ కార్డ్‌ ఇన్‌ఆపరేటివ్‌గా మారితే ఏం జరుగుతుంది?
PAN అంటే పర్మినెంట్‌ అకౌంట్‌ నంబర్. భారతదేశ పౌరుడికి ఆదాయ పన్ను విభాగం కేటాయించే ప్రత్యేక శాశ్వత సంఖ్య ఇది. ఆంగ్ల అక్షరాలు, అంకెల కలబోత ఇది. మీ వివరాలను తెలిపే ప్రత్యేక అర్ధంతో ఈ ఆంగ్ల అక్షరాలు, అంకెల కూర్పు ఉంటుంది. ఒకవేళ, ఆదాయ పన్ను విభాగం నిర్దేశించిన గడువులోగా పాన్‌ - ఆధార్‌ అనుసంధానం ప్రక్రియను పూర్తి చేయపోతే పాన్‌ నిరుపయోగంగా మారుతుంది. మన దేశంలో ఆర్థిక లావాదేవీలన్నింటికీ పాన్‌ ఆధారం. ఇది పని చేయకపోతే, బ్యాంక్‌ ఖాతా తెరవలేరు. ఆర్థిక సంస్థల ద్వారా రుణాలు పొందలేరు. ఇప్పటికే ఉన్న బ్యాంక్‌ ఖాతాల్లో నగదు లావాదేవీలకు కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులకు ఉపయోగించే డీమ్యాట్‌ అకౌంట్‌ను కూడా ఓపెన్‌ చేయలేరు.