Investment Tips in Telugu: పెట్టుబడి పెట్టే ప్రతి వ్యక్తికి సాధారణంగా కొన్ని టార్గెట్స్‌ ఉంటాయి. తన జీవితంలోని ప్రతి ముఖ్యమైన/ఖర్చుతో కూడుకున్న సందర్భంలో తన పెట్టుబడులు ఉపయోగపడాలని కోరుకుంటాడు. ప్రతి వ్యక్తి వయస్సును బట్టి పెట్టుబడి వ్యూహాలు భిన్నంగా ఉంటాయి. 30 ఏళ్ల లోపు ఉన్నప్పుడు ఒకలా, 30-40 ఏళ్ల వయస్సులో మరోలా, పదవీ విరమణకు దగ్గరగా ఉన్నప్పుడు ఇంకో విధంగా స్ట్రాటెజీస్‌ మారుతుంటాయి. తక్కువ రిస్క్‌తో ఎక్కువ రిటర్న్‌ తీసుకోవాలంటే, పోర్ట్‌ఫోలియోలో మార్పులు ఉండాలి.


వయస్సు ఆధారంగా పెట్టుబడులు
వయస్సు-ఆధారిత పెట్టుబడుల వెనుకున్న ప్రాథమిక సూత్రం ఏమిటంటే... మీ వయస్సుకు తగ్గట్లుగా మీ ఇన్వెస్ట్‌మెంట్‌ రిస్క్‌ ఉండాలి. ఈక్విటీలు ఎక్కువ రిస్క్‌తో ఎక్కువ రాబడిని అందిస్తాయి. కాబట్టి వాటిని మీ పోర్ట్‌ఫోలియోలో భాగం చేయాలి. ఈక్విటీల కోసం ఎంత కేటాయించాలన్నదానికి ఒక కొండ గుర్తు ఉంది. మీ ప్రస్తుత వయస్సును 100 నుండి తీసేస్తే ఎంత మిగులుతుందో, మీ పెట్టుబడిలో అంత శాతాన్ని ఈక్విటీ మార్కెట్‌లోకి మళ్లించాలి. అంటే, మీ వయస్సు పెరిగే కొద్దీ ఈ కేటాయింపు శాతం మారుతుంది. మిగిలిన మొత్తాన్ని డెట్ ఫండ్స్‌, ఇతర స్థిర ఆదాయ పెట్టుబడుల్లోకి తీసుకెళ్లాలి. 


30-40 వయస్సులో పెట్టుబడి వ్యూహం
మీరు వయస్సు ముప్ఫైల్లో ఉంటే, ఎక్కువ రిటర్న్‌ కోసం ఎక్కువ రిస్క్ తీసుకోవచ్చు. మీరు నాణ్యమైన స్టాక్స్‌, ఈక్విటీ ఫండ్స్‌ కోసం పోర్ట్‌ఫోలియోలో ఎక్కువ వాటాను కేటాయించవచ్చు. ఈక్విటీ మార్కెట్‌తో రిస్క్‌ను తగ్గించాలని భావిస్తే యులిప్‌లో పెట్టుబడి పెట్టొచ్చు. 


“మీరు నలభైల్లోకి అడుగు పెట్టినప్పుడు, బాండ్స్‌ వంటి స్థిర ఆదాయ పెట్టుబడులను పెంచడం ప్రారంభించాలి. దీనికోసం ఈక్విటీల్లో పెట్టుబడులను తగ్గిస్తూ, మీ పోర్ట్‌ఫోలియోను బ్యాలెన్స్ చేయాలి. ఈక్విటీల నుంచి మంచి రిటర్న్‌ వస్తున్నప్పటికీ, రిటైర్మెంట్‌ ఏజ్‌కు మీరు దగ్గర పడుతున్నారన్న విషయాన్ని గుర్తుంచుకుని, పోర్ట్‌ఫోలియో మరింత బ్యాలెన్స్‌ చేయాలి. ఈ దశలో, కొత్త ఇంటి కోసం రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టొచ్చు, లేదా అద్దె ఆదాయం సంపాదించడాన్ని కూడా ప్రయత్నం చేయవచ్చు.


మీరు 40ల్లో ఉన్నప్పుడు... మీ పోర్ట్‌ఫోలియోలో 40% ఈక్విటీ - 40% డెట్ ఫండ్స్‌ ఉండేలా ప్రయత్నం చేయాలి. మిగిలిన 10 శాతాన్ని క్యాష్‌ రూపంలో దగ్గర ఉంచుకోవాలి. ఇందులో 5% మొత్తాన్ని అత్యవసర పరిస్థితుల కోసం ఉపయోగించుకోవాలి. మిగిలిన 5%ను కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి వాడుకోవాలి.


మీ జీవితంలోని వివిధ దశల్లో ఎలా పెట్టుబడి పెట్టాలో ఆలోచించే ముందు, ఆస్తి కేటాయింపును ‍‌(asset allocation) అర్థం చేసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. అంటే... బంగారం, రియల్ ఎస్టేట్, స్టాక్స్‌, మ్యూచువల్ ఫండ్స్‌, బాండ్స్‌, PPF, EPF వంటి విభిన్న ఆస్తుల మధ్య మీరు పెట్టుబడి డబ్బును డిస్ట్రిబ్యూట్‌ చేయాలి. దీనినే ఆస్తి కేటాయింపు అంటారు.


అసెట్‌ క్లాస్‌లు ప్రధానంగా మూడున్నాయి. 1. స్టాక్స్ (ఈక్విటీలు), 2. బాండ్స్‌ (స్థిర-ఆదాయ సెక్యూరిటీలు), 3. నగదు లేదా నగదుతో సమానమైన ఆస్తులు. ఇవి కాకుండా... మరికొన్ని అసెట్‌ క్లాస్‌లు కూడా ఉన్నాయి. అవి... కమొడిటీస్‌, 
రియల్ ఎస్టేట్.


డైవర్సిఫికేషన్ ఎందుకు ముఖ్యం?
మీరు మీ మొత్తం డబ్బును ఒకే అసెట్‌ క్లాస్‌లో పెడితే రిస్క్‌ ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ప్రతికూల పరిస్థితి వస్తే ఆ పెట్టుబడిని రక్షించుకునే ఛాన్స్‌ ఉండదు. వివిధ అసెట్ క్లాస్‌లలో పెట్టుబడి పెట్టడం వల్ల మీ పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యం ఉంటుంది. ఒక అసెట్‌ క్లాస్‌లో రిస్క్‌ పెరిగినా, మిగిలినవి మీ పెట్టుబడిని నిలబెడతాయి. 30, 40 ఏళ్లలో పాటించాల్సిన పెట్టుబడి సూత్రం ఇదే. అయితే, రిటైర్‌మెంట్‌కు దగ్గరవుతున్న కొద్దీ క్రమంగా ఈక్విటీ నుంచి డెట్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు మారాలి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: డబ్బు పుట్టించగల 4 ఎక్స్‌పర్ట్‌ ఐడియాలు, షార్ట్‌టర్మ్‌లో ధనవర్షం కురుస్తుందట!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial