GPF Withdrawal Rules: జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF) చందాదార్లకు శుభవార్త. GPF నుంచి అడ్వాన్స్ అమౌంట్‌ ఉపసంహరించుకునే నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం కొంత సడలింపు ఇచ్చింది. 


జీపీఎఫ్‌ అడ్వాన్స్‌లకు సంబంధించి, కేంద్ర ఆర్థిక శాఖ ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. జనరల్ ప్రావిడెంట్ ఫండ్ నుంచి అడ్వాన్స్‌ రూపంలో కొంత డబ్బును విత్‌డ్రా చేయడానికి కొన్ని షరతులలో సడలింపు ఇచ్చింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఆర్థిక శాఖ గతంలో చాలాసార్లు విడుదల చేసినా, ఇప్పుడు ఆ సమాచారం మొత్తం ఒకే చోటకు వచ్చింది. దీంతో, విత్‌డ్రాయల్‌ రూల్స్‌ గురించి సబ్‌స్క్రైబర్లు సులభంగా అర్థం చేసుకోవచ్చు.


GPF అంటే ఏంటి?
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) పథకం ఉన్నట్లే, GPF కూడా ఉంది. పీపీఎఫ్‌ ప్రజలందరికీ అందుబాటులో ఉంటే, జీపీఎఫ్‌ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.


జనరల్ ప్రావిడెంట్ ఫండ్ కింద, సబ్‌స్క్రైబర్లు, అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఖర్చుల కోసం అడ్వాన్స్ రూపంలో డబ్బును విత్‌డ్రా చేయవచ్చు:


1. విద్య
ఈ కారణం కింద... ప్రైమరీ, సెకండరీ, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం డబ్బులు డ్రా చేసుకునేందుకు అనుమతి ఇస్తారు. అన్ని రకాల ఎడ్యుకేషన్‌ స్ట్రీమ్‌లు, సంస్థల కోసం డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.


2. తప్పనిసరి ఖర్చులు
నిశ్చితార్థం, వివాహం, అంత్యక్రియలు లేదా తన కోసం లేదా తన కుటుంబానికి సంబంధించిన ఇతర రకాల కార్యక్రమాల కోసం డబ్బులు తీసుకోవచ్చు.


3. వ్యాధులకు చికిత్స
మీరు లేదా మీపై ఆధారపడిన మీ కుటుంబంలోని వ్యక్తులు అనారోగ్యం పాలయితే, చికిత్స కోసం మీరు GPF నుంచి డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.


4. కన్స్యూమర్ డ్యూరబుల్స్ కొనడానికి
వినియోగ వస్తువుల కొనుగోలు కోసం GPF నుంచి ముందస్తుగా కొంత డబ్బును తీసుకునే వెసులుబాటును కూడా ఆర్థిక శాఖ కల్పించింది.


ఎంత డబ్బు విత్‌డ్రా చేయవచ్చు?
12 నెలల జీతంతో సమానమైన మొత్తాన్ని లేదా మీ అకౌంట్‌లో పోగుపడిన డబ్బులో నాలుగింట మూడొంతులు.. ఈ రెండింటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. డబ్బును విత్‌డ్రా చేయాలనుకుంటే, సబ్‌స్క్రైబర్‌ కనీసం 10 సంవత్సరాల సర్వీస్‌ను పూర్తి చేసి ఉండాలి. అనారోగ్యానికి చికిత్స కోసం, క్రెడిట్ మొత్తంలో 90 శాతం వరకు ఉపసంహరించుకోవడానికి అనుమతి ఇస్తారు.


ఇల్లు కట్టుకోవడానికి కూడా.. 
మీరు ఇల్లు కట్టుకోవడానికి లేదా మీకు రెసిడెన్షియల్‌ ప్రాపర్టీగా ఉండే ఫ్లాట్‌ను కొనుగోలు చేయడానికి కూడా జీపీఎఫ్‌ అకౌండ్‌ నుంచి అమౌంట్‌ విత్‌డ్రా చేయవచ్చు. దీని కొన్ని షరతులు వర్తిస్తాయి:


హౌసింగ్ లోన్ రీపేమెంట్ కోసం
ఇల్లు కట్టుకోవడానికి స్థలం కొనడానికి డబ్బు తీసుకోవచ్చు
ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి ముందస్తుగా డబ్బులు తీసుకోవచ్చు
ఇప్పటికే ఉన్న ఇంటికి రిపేర్‌ చేయడానికి లేదా కొన్ని అదనపు నిర్మాణ పనుల కోసం
పూర్వీకుల ఇంటిని పునర్మించడానికి లేదా లేదా మార్పులు చేయడానికి


ఈ పనుల కోసం, ఇప్పటికే ఉన్న క్రెడిట్ నుంచి 90 శాతం మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే, ఇంటి నిర్మాణానికి సంబంధించిన పనుల కోసం GPF నుంచి అడ్వాన్స్ తీసుకుంటే దానిని తిరిగి జమ చేయాల్సిన పరిస్థితి ఉంది. సబ్‌స్క్రైబర్ సర్వీస్‌లో ఉన్నప్పుడు మాత్రమే ఈ డబ్బు అందుతుంది. ఇంటిని నిర్మించడానికి డబ్బు తీసుకున్నట్లయితే, దానిని HBA రూల్స్‌ ప్రకారం పరిగణించబోమని GPF ముందస్తు మొత్తాన్ని విత్‌డ్రా చేసే నిబంధనల్లో స్పష్టంగా ఉంది.


2-వీలర్ లేదా 4-వీలర్ కొనడానికి
మీరు మోటార్‌సైకిల్, కారు లేదా స్కూటర్ కొనడానికి లేదా దానికి సంబంధించిన మునుపటి లోన్‌ని తిరిగి చెల్లించడానికి డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. కారు మరమ్మత్తు కోసం కూడా డబ్బును ముందస్తుగా వెనక్కు తీసుకోవచ్చు. మోటారు కారు లేదా బైక్ లేదా స్కూటర్ కొనుగోలు కోసం డిపాజిట్ చెల్లించడానికి డబ్బును ఉపసంహరించుకోవచ్చు. దీని కోసం, క్రెడిట్‌లో నాలుగో వంతు లేదా వాహనం ధరలో ఏది తక్కువైతే అది విత్‌డ్రా చేసుకోవడానికి అనుమతి ఇస్తారు. దీనికోసం కూడా 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేస్తేనే డబ్బులు అందుతాయి.


గుర్తుంచుకోవలసిన విషయాలు
డిక్లేర్డ్ హెడ్ ఆఫ్ ఆఫీస్ ద్వారా ఈ మొత్తాన్ని మంజూరు చేస్తారు. అడ్వాన్స్ మొత్తాన్ని 60 వాయిదాల్లో తిరిగి కట్టాలి.


మరో ఆసక్తికర కథనం: భారీగా దిగొచ్చిన పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial