Income Tax Update: TDS, TCS కోతల విషయంలో ఆదాయ పన్ను చెల్లింపుదార్లు, వ్యాపారవేత్తలకు ఆదాయ పన్ను విభాగం పెద్ద రిలీఫ్‌ ప్రకటించింది. పన్ను చెల్లింపుదార్లు ఈ ఏడాది మే చివరిలోగా (31 మే 2024) తమ ఆధార్‌ నంబర్‌ - పాన్‌ను లింక్ (Aadhar Number - PAN Linking‌) చేసే ఛాన్స్‌ ఇచ్చింది.


వాస్తవానికి, ఆధార్‌-పాన్‌ను ఉచితంగా లింక్‌ చేసే గడువు ఎప్పుడో ముగిసింది. ఇప్పుడు, ఈ రెండు కీలక పత్రాలను జత చేయాలంటే జరిమానా చెల్లించాలి. అంతేకాదు, ఆధార్‌తో  లింక్‌ చేయని పాన్‌ తాత్కాలికంగా డీయాక్టివేట్‌  (PAN card Deactivation) అవుతుంది. ఇలా నిష్క్రియంగా మారిన పాన్‌ కార్డ్‌ హోల్డర్ల నుంచి రెట్టింపు TDS (Tax Deducted at Source) లేదా TCS (Tax Collected at Source) వసూలు చేస్తున్నారు. 


డబుల్‌ టీడీఎస్‌/టీసీఎస్‌ లేదా జరిమానా
ఆధార్‌-పాన్‌ అనుసంధానం పూర్తి కాని వ్యక్తుల విషయంలో.. కంపెనీ యాజమాన్యాలు/ ఇతర సంస్థలు శాలరీ లేదా రెమ్యునరేషన్‌ చెల్లించే సమయంలో డబుల్‌ టీడీఎస్‌ కట్‌ చేస్తున్నాయి. ఆర్థిక లావాదేవీల సమయంలోనూ రెట్టింపు టీసీఎస్‌ వసూలు చేస్తున్నాయి. టాక్స్‌ పేయర్‌కు ఇది చాలా పెద్ద భారం. ఆధార్‌-పాన్‌ లింకింగ్‌ పూర్తి కాకపోయినా రెట్టింపు టీడీఎస్‌ లేదా టీసీఎస్‌ కట్‌ కాకపోతే.. అలాంటి వ్యక్తుల నుంచి ఫైన్‌ వసూలు చేస్తామని ఆదాయ పన్ను విభాగం గతంలోనే స్పష్టం చేసింది. 


చల్లటి వార్త చెప్పిన సీబీడీటీ
ఇప్పుడు, టాక్స్‌ పేయర్లకు ఈ మండు వేసవిలో చల్లటి కబురు చెప్పింది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్‌ (Central Board of Direct Taxes - CBDT). ఆధార్‌ నంబర్‌తో పాన్‌ను లింక్‌ చేయడానికి ఈ ఏడాది మే నెల 31వ తేదీ వరకు అవకాశం ఇస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ గడువులోగా ఆధార్‌ నంబర్‌తో పాన్‌ను జత చేసే పని పూర్తి చేసిన వ్యక్తుల నుంచి మామూలు పద్ధతిలోనే టీడీఎస్‌ లేదా టీసీఎస్‌ వసూలు చేయాలని కంపెనీ యాజమాన్యాలు/ ఇతర సంస్థలకు సూచించింది. ఇప్పటికీ ఆధార్‌ - పాన్‌ లింక్‌ చేయని టాక్స్‌ పేయర్లకు ఇది పెద్ద ఉపశమనం.


పాన్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేయకపోతే రెట్టింపు రేటుతో TDS కోత విధించాలన్న నిబంధన ఉన్నప్పటికీ చాలా చోట్ల అలా జరగడం లేదని CBDTకి భారీ సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. పాన్‌ నిష్క్రియంగా ఉన్న కేసుల్లో నిబంధన ప్రకారం TDS లేదా TCS తీసివేయలేదని ఆ ఫిర్యాదుల్లో ఉంది. ఈ ఫిర్యాదులను పరిష్కరించడానికి సీబీడీటీ రంగంలోకి దిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరం (31 మార్చి 2024) చివరి వరకు చేసిన లావాదేవీలకు సంబంధించి.. 31 మే 2024 లోపు ఆధార్‌ - పాన్‌ లింక్ చేయడం వల్ల పాన్ తిరిగి యాక్టివేట్‌ అయితే పన్ను చెల్లింపుదార్ల నుంచి రెట్టింపు టాక్స్‌ వసూలు చేయరని స్పష్టం చేసింది.


ఒక వ్యక్తి అందుకునే వివిధ రకాల ఆదాయాలకు 'మూలం వద్ద పన్ను కోత' (TDS) వర్తిస్తుంది. ఆ ఆదాయాల్లో... జీతం, పెట్టుబడి, బ్యాంక్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌, వడ్డీ ఆదాయం, కమీషన్ వంటివి ఉంటాయి. ఒక వ్యక్తి ఆదాయం లేదా పారితోషికం నుంచి కట్‌ చేసిన టీడీఎస్‌ను ప్రభుత్వ ఖాతాలో జమ చేసే బాధ్యత చెల్లింపు చేసే వ్యక్తి లేదా సంస్థది. భారత ప్రభుత్వ ఖజానాలోకి టీడీఎస్‌ రూపంలో పెద్ద మొత్తంలో పన్ను వచ్చి చేరుతుంది.


CBDT ఇచ్చిన వెసులుబాటును టాక్స్‌ పేయర్లు ఉపయోగించుకోవాలని ఇన్‌కమ్‌ టాక్స్‌ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. పాన్‌ కార్డ్‌ డీయాక్టివేట్‌ అయిన టాక్స్‌ పేయర్లు వీలైనంత త్వరగా దానిని ఆధార్‌తో జత చేయాలని సూచిస్తున్నారు. 


మరో ఆసక్తికర కథనం: గత పదేళ్లుగా అదరగొడుతున్న బెస్ట్‌ ఈక్విటీ ఫండ్స్‌ - వీటి ట్రాక్ రికార్డ్‌ కేక