Gold Invest Tips: బంగారం పెట్టుబడి; సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న పసిడి.. మీ పెట్టుబడికి సురక్షిత మార్గాలు, జాగ్రత్తలు!
Gold Invest Tips: ఆర్థిక అనిశ్చితి నెలకొన్న సమయంలో బంగారం బాగా ఆదుకుంటుంది అందుకే బాగా స్టడీ చేసి పోర్ట్ పోలియోను పెంచుకోండి.

Gold Invest Tips: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎన్ని మలుపులు తిరిగినా, ఎన్ని కొత్త టెక్నాలజీలు వచ్చినా మానవాళికి బంగారంపై ఉన్న మక్కువ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లలో బంగారం ధరలు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. కాస్త ఒడిదుడుకులు ఉన్నా, పెరుగుతూనే ఉన్నాయి. గతేడాది 64 శాతం వృద్ధిని నమోదు చేయగా, వెండి ఏకంగా 146 శాతం పెరిగి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించింది. ఈ పరిస్థితుల్లో పెట్టుబడి ఎలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయో చూద్దాం.
వేల ఏళ్ల చరిత్ర చెక్కు చెదరని విలువ
బంగారం కేవలం ఒక లోహం మాత్రమే కాదు. అది ఒక సామాజిక హోదా, ఆర్థిక భద్రతకు చిహ్నం. క్రీస్తు పూర్వం నాలుగు వేల సంవత్సరాల నాటికే మానవుడు బంగారాన్ని విలువైన వస్తువుగా గుర్తించినట్టు ఆధారాలు ఉన్నాయి. క్రీస్తు పూర్వం 550లో మొదటి బంగారు నాణేలు చలామణిలోకి వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా కాగితపు కరెన్సీలు కుప్పకూలిన సందర్భాల్లో కూడా బంగారం తన విలువను నిలబెట్టుకుంది. దీనికి ప్రధాన కారణం దాని కొరత. ప్రపంచవ్యాప్తంగా ఒక గంటలో తయారయ్యే ఉక్కు పరిమాణం, చరిత్ర మొత్తం మీద తవ్విన బంగారం కంటే ఎక్కువంటే పసిడి ఎంత అరుదైనదో అర్థం చేసుకోవచ్చు.
ఆభరణాలకే కాదు, పరిశ్రమలకు అవసరం
మనం బంగారాన్ని కేవలం నగలుగానే చూస్తాం. కానీ ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌లో దాదాపు 46.6శాతం ఆభరణాల తయారీకి వెళ్తుంటే, మిగిలినది పెట్టుబడి , పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడుతోంది. బంగారం అద్భుతమైన విద్యుత్ వాహకం. అందుకే మనం వాడే సెల్‌ఫోన్లు, టెలివిజన్లు, అత్యాధునిక ఏరోస్పేస్ పరికరాల్లో బంగారాన్ని విరివిగా వాడుతున్నారు. అంతేకాకుండా, వైద్య రంగంలో ముఖ్యంగా దంత వైద్యంలో ఫిల్లింగ్స్, క్రౌన్స్‌కోసం దీనిని వాడుతున్నారు.
పసిడి ప్రయాణం ఇదే !
బంగారం భూమి నుంచి మన చేతికి వచ్చే వరకు అనేక ప్రక్రియలు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా నాలుగు ప్రధాన పద్ధతుల్లో బంగారం తవ్వకాలు జరుగుతాయి. నదులు, వాగులు నుంచి ఇసుకను వడపోయడం ద్వారా బంగారాన్ని సేకరిస్తారు. దీన్ని ప్లేసర్ మైనింగ్ అంటారు. భూమి లోపల సొరంగాలు తవ్వి శిలల నుంచి బంగారాన్ని తీస్తారు. దీనినే హార్డ్ రాక్ మైనింగ్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ఉత్పత్తి ఈ విధానంలో జరుగుతుంది. రాగి లేదా ఇతర లోహాల కోసం తవ్వాలు జరిపినప్పుడు అనుబంధంగా బంగారం లభిస్తుంది. ఉదాహరణకు ఇండోనేషియాలోని గ్రాస్‌బ్గ్ గనిలో రాగి కోసం వెతికితే వంద మిలియన్ ఔన్ బంగారం దొరికింది. రాళ్లను పొడి చేసి రసాయన పద్ధతుల్లో పసిడిని వేరు చేస్తారు.
ఇన్వెస్టర్ల ముందు ఉన్న ఆప్షన్లు ఏంటీ?
బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి నేడు అనేక మార్గాలు ఉన్నాయి. నాణేలు, బిస్కెట్లు లేదా నగల రూపంలో కొనడం మొదట విధానం. ఇది అత్యంత ప్రాచుర్యం పొందిన మార్గం. అయితే దీనికి స్టోరేజ్, ఇన్సూరెన్స్ ఖర్చులు ఉంటాయి. నేరుగా బంగారాన్ని కొనకుండా, స్టాక్‌మార్కెట్ ద్వారా గోల్డ్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం. ఇది చిన్న ఇన్వెస్టర్లకు సులభమైన, సురక్షితమైన మార్గంగా చెబుతారు. గోల్డ్ ఫ్యూచర్స్‌లో అనుభవజ్ఞులైన ట్రేడర్లకు మాత్రమే ఉపయోగపడతాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందే అవకాశం ఉన్నప్పటికీ, ఇందులో రిస్క్ కూడ అంతే ఎక్కువగా ఉంటుంది. గోల్ట్‌మైనింగ్ కంపెనీల షేర్లు కొనడం ద్వారా కూడా పెట్టుబడి పెట్టొచ్చు.
బంగారం vs క్రిప్టోకరెన్సీ ఏదీ మేలు
ప్రస్తుతం డిజిటల్ యుగంలో బిట్‌కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీలు డిజిటల్ గోల్డ్‌గా ప్రచారం పొందుతున్నాయి. అయితే, గత ఐదేళ్ల గణాంకాలను చూస్తే బంగారం స్థిరమైన వృద్ధిని కనబరిచింది. బిట్‌కాయిన్ 294 శాతం కంటే ఎక్కువ రాబడి ఇచ్చినప్పటికీ, దాని అస్థిరత చాలా ఎక్కువ. సంప్రదాయ ఇన్వెస్టర్లు ఎప్పుడూ బంగారాన్నే సురక్షితమైందిగా భావిస్తారు.
ఇన్వెస్ట్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
బంగారం ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుందని భావించడం తప్పు. మార్కెట్ పరిస్థితులను బట్టి ధరల్లో హెచ్చుతగ్గులు సహజం. కాబట్టి మీ మొత్తం పెట్టుబడిలో ఐదు నుంచి పది శాతం మాత్రమే బంగారంలో ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు స్టాక్ మార్కెట్ పడిపోయినప్పుడు, బంగారం ఒక రక్షణ కవచంలా పని చేస్తుంది.























