PSUs Dividend:
ప్రభుత్వ రంగ సంస్థలు కేంద్ర ప్రభుత్వం, ఇన్వెస్టర్లకు జాక్‌పాట్ ఇచ్చాయి! 2023 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.లక్ష కోట్ల డివిడెండ్‌ను ప్రకటించాయి. ఎకానమీ బాగుండటం, ఎర్నింగ్స్ మెరుగవ్వడంతో ఉదారంగా ప్రవర్తించాయి. బ్యాంకులు, కంపెనీలు సహా వరుసగా రెండో ఏడాదీ లక్ష కోట్లను డివిడెండ్‌గా అందించడం గమనార్హం.
స్టాక్ మార్కెట్లో నమోదైన 90 పీఎస్‌యూలు 2023 ఆర్థిక ఏడాదిలో రూ.లక్ష కోట్ల మేర డివిడెండ్‌ను ప్రకటించాయి. 2023 మార్చి నాటికి వీటిలో 61 శాతం వాటా కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఇప్పటికే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ.87,416 కోట్లను బదిలీ చేసింది. ఈ మొత్తానికీ పీఎస్‌యూలు అందించే డివిడెండ్ కలవనుంది. క్యాపిటల్ ఎక్స్‌పెండీచర్, పెట్టుబడులు పెంచేందుకు, ఆర్థిక లోటు తగ్గించేందుకు ఈ నిధులు ఉపయోగపడనున్నాయి.
ఈ ఏడాది ప్రభుత్వం అందుకున్న మొత్తం డివిడెండ్‌లో కోల్ ఇండియా (Coal India), ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ఎన్టీపీసీ వాటాయే 56 శాతంగా ఉంది. కోల్ ఇండియా రూ.14,945 కోట్లు, ఓఎన్జీసీ రూ.14,153 కోట్లు, పవర్ గ్రిడ్ రూ.10,000 కోట్లు, ఎస్బీఐ రూ.10,000 కోట్లు, ఎన్టీపీసీ రూ.7,030 కోట్లు డివిడెండ్‌గా ప్రకటించాయి. ఎస్బీఐ ఒక్కో షేరుకు ఇస్తున్న డివిడెండ్ 59.2 శాతం మేర పెరిగింది. FY2023లో రూ.11.30 ఇచ్చింది. దేశంలోనే అతిపెద్దదైన ఎస్బీఐ తొలిసారి రూ.50,000 కోట్ల వార్షిక లాభాలను నమోదు చేయడం గమనార్హం.
'లాభదాయకత, మా ఇన్వెస్టర్లకు విలువ చేకూర్చడం పైనే మేం దృష్టి సారించాం. మేం ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నప్పుడు అండగా ఉన్నవారి కోసమే ఎంతో కష్టపడ్డాం. వారికి విలువను సంపాదించి పెట్టాం' అని నాలుగో త్రైమాసికం ఫలితాల తర్వాత ఎస్బీఐ ఛైర్మన్ దినేశ్ కుమార్ ఖారా అన్నారు.
ఇక 2023లో ఓఎన్జీసీ, ఎస్బీఐ తమ చరిత్రలోనే అత్యధిక డివిడెండ్‌ను ప్రకటించాయి. బీపీసీఎల్, ఐఓసీఎల్ వంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మాత్రం తక్కువ డివిడెండ్ ఇచ్చాయి. రూ.6,980 కోట్ల నికర నష్టాలు చూపించిన హెచ్‌పీసీఎల్ (HPCL) అసలు డివిడెండ్‌నే ప్రకటించలేదు.
Also Read: ప్రతి 3 నెలలకు రూ.60వేలు వడ్డీ ఇచ్చే గవర్నమెంట్ స్కీమ్ ఇది!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.