Mortgage Property Buying Tips: నేటి కాలంలో సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. అయితే ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ చాలా మంది కొత్త ప్రాజెక్టుల కంటే రీసేల్‌ ప్రాపర్టీలవైపు మొగ్గు చూపుతున్నారు. ఆపార్టమెంట్‌లలో కూడా మార్ట్‌గేజ్‌ ఫ్లాట్‌లను తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా బ్యాంక్ తాకట్టులో ఉన్న ఆస్తులు తక్కువ ధరకే లభిస్తుండటంతో కొనుగోలుదారులు వీటిపై ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఇలాంటి ప్రాపర్టీలు కొనేటప్పుడు సాధారణ ఆస్తుల కంటే భిన్నమైన నిబంధనలు, ప్రక్రియు ఉంటాయి. వాటిని తెలుసుకోకపోతే మాత్రం చిక్కుల్లో పడతారు. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.   

Continues below advertisement

మార్ట్‌గేజ్ అంటే ఏంటీ? ఎలా పని చేస్తుంది?

సాధారణ పరిభాషలో చెప్పాలంటే, మార్ట్‌గేజ్ లేదా తాకట్టు అనేది అప్పు ఇచ్చే సంస్థ, అప్పు తీసుకునే వ్యక్తికి మధ్య జరిగే ఒక ఒప్పందం. ఒక వ్యక్తి తన ఇంటిని లేదా స్థలాన్ని సెక్యూరిటీగా ఉంచి బ్యాంక్‌ నుంచి తీసుకున్నప్పుడు, ఆ ఆస్తిపై బ్యాంకుకు హక్కులు ఉంటాయి. ఒక వేళ రుణం తీసుకున్న వ్యక్తి ఆ డబ్బును తిరిగి చెల్లించడంలో విఫలమైతే, సదరు ఆస్తిని స్వాధీనం చేసుకునే అధికారం బ్యాంకుకు ఉంటుంది. 

భారత్‌లో ప్రధానంగా రెండు రకాల మార్ట్‌గేజ్‌ రుణాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఒకటి కొత్త ఇల్లు కొనడానికి లేదా నిర్మించుకోవడానికి తీసుకునేది. రెండోది ఇప్పటికే ఉన్న ఆస్తిని తాకట్టు పెట్టి వ్యాపార అవసరాలు, ఉన్నత చదువులు లేదా వైద్య ఖర్చులు కోసం తీసుకునే రుణం. 

Continues below advertisement

మార్ట్‌గేజ్‌లో ఉన్న ఆస్తులు కొనడం వల్ల కలిగే లాభాలు 

బ్యాంక్ మార్ట్‌గేజ్‌ ఆస్తులను కొనడం వల్ల ప్రధానంగా మూడు ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి సాధారణంగా కొత్త ప్రాజెక్టుల కంటే పది నుంచి 20 శాతం తక్కువ ధరకు లభిస్తాయి. విక్రేతకు తక్షణమే డబ్బు అవసరం ఉండటం లేదా లోన్ భారం తగ్గించుకోవాలనే ఉద్దేశంతో తక్కువ ధరకు ఇచ్చే అవకాశం ఉంది. ఆ ఆస్తిపై ఇప్పటికే బ్యాంకు లోన్ ఇచ్చిందంటే ఆ బ్యాంక్‌ అన్ని డాక్యుమెంట్స్‌ పరిశీలించింది ఉంటుంది. కాబట్టి ఆస్తి డాక్యుమెంట్‌పై ఎలాంటి అనుమానం అవసరం ఉండదు. చాలా వరకు ఇలాంటి ఆస్తులు పూర్తి చేసి ఉంటారు. కొనుగోలు చేసిన వెంటనే గృహప్రవేశం చేయవచ్చు. 

కొనుగోలు చేసేటప్పుడు ఏం చేయాలి?

మొదట యజమాని వద్ద ఉన్న డాక్యుమెంట్స్ ఫొటో కాపీలు తీసుకోవాలి. అందులో పెండింగ్‌ లోన్ ఎంత ఉంది? ఎలక్ట్రిక్‌ ,వాటర్ బిల్లులు, మున్సిపల్‌ పన్నులు ఏమైనా బాకీలు ఉన్నాయో లేదో చెక్ చేయాలి. లోన్ తీసుకున్న బ్యాంక్ నుంచి అవుట్ స్టాండింగ్ లోన్ స్టేట్‌మెంట్ తీసుకోవాలి. లోన్ మొత్తం చెల్లించిన తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్‌ ఇచ్చేస్తానని బ్యాంకు ఇచ్చే అంగీకార పత్రాన్ని కూడా అడగాలి. మీరు మొత్తం క్యాష్‌ చెల్లించి తీసుకుంటే మొదట బ్యాంకుకు వెళ్లి లోన్ సెటిల్ చేసి మిగతా అమౌంట్‌ ఓనర్‌కు ఇవ్వాలి. లోన్‌ ద్వారా తీసుకుంటే ముందు బ్యాంకులో లోన్ కోసం దరఖాస్తు చేయాలి. అప్పుడు ఇంటర్నల్‌ ట్రాన్స్‌ఫర్‌ చేస్తారు. వేరే బ్యాంకులో తీసుకుంటే చెక్‌ ఇవ్వాల్సి ఉంటుంది. 

ఈ పత్రాలు లేకుండా మార్ట్‌గేజ్‌ ఆస్తులు కొనొద్దు

ఆస్తి హక్కులను నిరూపించే సేల్‌డీడ్‌ కచ్చితంగా ఉండేలా చూడాలి. గత లావాదేవీలు చెప్పే ఎన్‌కంబ్రాన్స్ సర్టిఫికేట్‌ అంటే ఈసీ అడగాలి. హోసింగ్ సొసైటీ లేదా బిల్డర్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. యజమాని పన్నులు సక్రమంగా చెల్లించిన ప్రాపర్టీ టాక్స్ రిసీట్‌లు తీసుకోవాలి. భవనం అనుమతి పొందిన ప్లాన్ ప్రకారం ఉందో లేదో నిర్దారించే శాంక్షన్ ప్లాన్, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ కావాలి. 

రిస్క్‌ ఏముంటుంది?

ఒక వేళ ఆ ఆస్తిపై ఏదైనా కోర్టు కేసు ఉంటే, బ్యాంక్ లోన్ ఇచ్చినప్పటికీ ఇబ్బందులు తప్పవు. లోన్ క్లోజ్ చేసిన తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్‌ బ్యాంక్ నుంచి రావడానికి ఐదు నుంచి పది రోజులు పడుతుంది. ప్రాపర్టీ అమ్మిన విక్రేత లోన్ ఇన్‌స్టాల్‌మెంట్‌ సరిగా కట్టకపోతే వచ్చే ాన్ ఎవరు భరించాలనేది అగ్రిమెంట్‌లో స్పష్టం చేసుకోవాలి. ఇలాంటి ఆస్తులు కొనేటప్పుడు కొనుగోలుదారు, విక్రేత, బ్యాంక్ ముగ్గురు సంతకాలు చేసే ఒప్పందం చేసుకోవడం చాలా మంచిది. కేవలం బ్యాంక్ వెరిఫికేషన్‌పైనే కాకుండా ఒక న్యాయవాది ద్వారా చెక్ చేయించడం ఉత్తమం. డాక్యుమెంట్స్ సరిగా ఉన్నాయని నిర్దారించుకున్న తర్వాతే టోకెన్ అమౌంట్ ఇవ్వాలి.