గృహ రుణం తీసుకున్నవారు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సి మరియు సెక్షన్ 24(బి) ద్వారా పన్ను మినహాయింపులు పొందవచ్చు. సెక్షన్ 80సి కింద ప్రిన్సిపల్ మొత్తంపై, సెక్షన్ 24(బి) కింద వడ్డీపై మినహాయింపులు వర్తిస్తాయి.
Home Loan Tips:మొదటిసారి ఇల్లు కొంటున్నారా? హోమ్‌లోన్ ట్యాక్స్ బెనిఫిట్స్ పెంచుకోవడానికి మంచి టిప్స్ ఇవే!
Home Loan Tips: బడ్జెట్ 2026లో ప్రభుత్వం గృహ రుణాలకు సంబంధించిన పాత పన్ను నిబంధనలనే కొనసాగించింది. వడ్డీ రేట్లు కూడా స్థిరంగా ఉండటంతో కొనుగోలుదారులు తమ ఆర్థిక ప్రణాళికలను పక్కా ప్లాన్ చేసుకోవచ్చు.

New Tax Regime vs Old Tax Regime for Home Loan: సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి జీవితకాల స్వప్నం. అయితే ప్రస్తుత కాలంలో పెరుగుతున్న రియల్ ఎస్టేట్ ధరల దృష్ట్యా , మధ్యతరగతి ప్రజలకు హోమ్ లోన్ అనేది అనివార్యమైంది. కేవలం ఇల్లు కొనడమే కాకుండా, ఆ రుణాన్ని తెలివిగా ప్లాన్ చేసుకోవడం ద్వారా పన్ను రూపంలో భారీగా ఆదా చేయవచ్చు అని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ 2026లో గృహ రుణాలపై ఉన్న పన్ను మినహాయింపులు, వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ టైంలో మొదటిసారి ఇల్లు కొనేవారు తమ పన్ను ప్రయోజనాలను ఎలా పెంచుకోవాలి, లోన్ స్ట్రక్చర్‌ను ఎలా రూపొందించుకోవాలి అనే అంశాలను ఓసారి పరిశీలిద్దాం.
2026 బడ్జెట్‌లో ప్రభుత్వం గృహ రుణాలకు సంబంధించిన పాత పన్ను నిబంధనలనే కొనసాగించింది. వడ్డీ రేట్లు కూడా స్థిరంగా ఉండటంతో కొనుగోలుదారులు తమ ఆర్థిక ప్రణాళికలను పక్కా ప్లాన్ చేసుకోవచ్చు. సరైన సమయంలో డాక్యుమెంటేషన్ పూర్తి చేయడం, స్వాధీనం, రుణ చెల్లింపుల మధ్య సమన్వయం సాధించడం ద్వారా గరిష్టంగా పన్ను ఆదా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, హోమ్‌లోన్ తీసుకున్న వారు సెక్షన్ 80సి, సెక్షన్ 24(బి) ద్వారా మినహాయింపులు పొందవచ్చు. సెక్షన్ 80సి ప్రకారం గృహరుణంలో మీరు చెల్లించే ప్రిన్నిపల్ మొత్తంపై ఏడాదికి గరిష్టంగా 1.5 లక్షల వరకు మినహాయింపు లభిస్తుంది. సెక్షన్ 24(బి) ప్రకారం మీరు సెల్ఫ్ ఆక్యుపెయిడ్ ప్రాపర్టీ అయితే మీరు చెల్లించే వడ్డీపై ఏడాదికి 2 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.
పన్ను మినహాయింపులను రెట్టింపు చేసే మార్గం
మీరు మీ జీవిత భాగస్వామి ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నట్టు అయితే జాయింట్ లోన్ తీసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల భార్యాభర్తలు ఇద్దరూ విడివిడిగా సెక్షన్ 80 సీ, సెక్షన్ 24(బి) కింద మినహాయింపులు క్లెయిమ్ చేయవచ్చు. అంటే కుటుంబం మొత్తం వడ్డీపై నాలుగు లక్షలు, అసలుపై 3 లక్షల వరకు మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది. అయితే ఆదాయ నిష్పత్తులకు అనుగుణంగా లోన్ వాటాలను సర్దుబాటు చేయడం ద్వారా చట్టబద్ధంగా పన్ను ఆదా పెంచుకోవచ్చు.
స్వాధీనం, పన్ను ప్రయోజనాల సంబంధం
హోమ్‌లోన్ పన్ను ప్రయోజనాల విషయంలో చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే... ఇల్లు చేతికి రాకముందే మినహాయింపులు కోరడం. నిజానికి, పన్ను ప్రయోజనాల ఇల్లు స్వాధీనం చేసుకున్న తర్వాతే ప్రారంభమవుతాయి. అందుకే నిర్మాణంలో ఉన్న ఇళ్ల విషయంలో లోన్ డాక్యుమెంటేషన్, రిజిస్ట్రేషన్ ప్రక్రియలను స్వాధీనం చేసుకునే సమయానికి అనుగుణంగా పక్కాగా ఉంచుకోవాలి. మొదటి ఈఎంఐ నుంచి ఐదేళ్ల వరకు మీరు చెల్లించే ఈఎంఐలో ఎక్కువ భాగం వడ్డీకే వెళ్లిపోతుంది. అందుకే ఆ టైంలో ట్యాక్స్ ప్లానింగ్ మరింత కీలకం.
న్యూ ట్యాక్స్ విధానం vs పాత విధానం
ప్రస్తుతం చాలా మంది కొత్త ట్యాక్స్ విధానాన్ని ఎంచుకుంటున్నారు. అయితే కొత్త ట్యాక్స్ విధానంలో గృహ రుణాలపై లభించే మినహాయింపులు చాలా పరిమితం. ప్రతి సంవత్సరం మీ ఆదాయాన్ని బట్టి ఏ పన్ను విధానం మీకు మేలు చేస్తుందో సమీక్షించుకోవాలి. ఒక వేళ మీరు కొత్త విధానంలో ఉంటే పన్ను మినహాయింపుల కంటే రుణంపై అయ్యే మొత్తం వడ్డీ ఖర్చును తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాలి. దీని కోసం భారీ డౌన్ పేమెంట్ చేయడం లేదా తక్కువ టెన్యూర్ ఎంచుకోవడం మంచిది.
మొదటిసారి కొనుగోలుదారులకు అదనపు ప్రయోజనం
మొదటిసారి ఇల్లు కొనేవారికి ప్రభుత్వం కొన్ని ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తోంది. ప్రాపర్టీ విలువ, లోన్ మొత్తం రుణం మంజూరైన తేదీ ఆధారంగా సెక్షన్ 80EEA కింద అదనపు వడ్డీ మినహాయింపులు పొందే అవకాశం ఉంది. ఈ ప్రయోజనం పొందాలంటే ప్రాపర్టీ బదిలీకి ముందే లోన్ అప్రూవల్ పొందడం, సరైన పత్రాలు కలిగి ఉండటం తప్పనిసరి.
కాలపరిమితి విషయంలో జాగ్రత్త అవసరం
లోన్ కాలపరిమితి పెంచితే ఈఎంఐ భారం తగ్గుతుంది. కానీ మీరు చెల్లించే మొత్తం వడ్డీ భారీగా పెరుగుతుంది. దీనికి విరుద్ధంగా తక్కువ కాలపరిమితి ఎంచుకుంటే వడ్డీ తగ్గుతుంది. కానీ నెలవారీ ఈఎంఐ పెరుగుతుంది. మొదట మీకు సౌకర్యమంతగా ఉండే కాలపరిమితితో లోన్ ప్రారంభించి, ఆ తర్వాత ఆర్థికంగా వెసులుబాటు ఉన్నప్పుడు ప్రీ పేమెంట్స్ చేయడం ద్వారా వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు.
ఫ్లెక్సిబుల్ రీ పేమెంట్ ఆప్షన్స్
ప్రైవేటు ఉద్యోగులు లేదా వేరియబుల్ ఆదాయం ఉన్న వారి కోసం స్టెప్ అప్ లేదా బెలూన్ ఈఎంఐ వంటి ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి ప్రారంభంలో తక్కువ ఈఎంఐ చెల్లించే వెసులుబాటు కల్పిస్తాయి. కాలక్రమేణా మీ ఆదాయం పెరిగే కొద్దీ అసలు మొత్తాన్ని త్వరగా చెల్లించి రుణ విముక్తులు కావచ్చు.
నిరంతర రివ్యూ చాలా అవసరం
హోమ్‌లోన్ అనేది 15-20 ఏళ్ల సుదీర్ఘ ప్రక్రియ. ఉపయోగించుకోని పన్ను మినహాయింపులను తర్వాతి సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ చేయలేం. అందుకే ప్రతి ఏటా వడ్డీ సర్టిఫికెట్‌లను సేకరించి, మీ ఈఎంఐ చెల్లింపులతో సరి చూసుకోవాలి. ప్రతి 2-3 ఏళ్లకోసారి మీ లోన్ స్ట్రక్చర్‌ను, వడ్డీ రేట్లను రివ్యూ చేయడం ద్వారా మారుతున్న ఆర్థిక నిబంధనలకు అనుగుణంగా లాభం పొందవచ్చు.
హోమ్‌లోన్ కేవలం అప్పు మాత్రమే కాదు. అది ఒక ఆర్థిక వ్యూహం. సెక్షన్ 80 సి, 24(బి) వంటి నిబంధనలను అర్థం చేసుకుని, జాయింట్ లోన్, ప్రీ పేమెంట్ వంటి పద్ధతులను పాటిస్తే మీ కలల ఇల్లు మీకు ఆర్థికంగా భారం కాకుండా మారుతుంది.
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు సర్టిఫైడ్ ఆర్థిక నిపుణులను సంప్రదించడం మంచిది.
Frequently Asked Questions
గృహ రుణాలపై ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఏయే సెక్షన్ల ద్వారా మినహాయింపులు పొందవచ్చు?
జాయింట్ హోమ్ లోన్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?
భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుంటే జాయింట్ లోన్ తీసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల ఇద్దరూ విడివిడిగా సెక్షన్ 80సి, సెక్షన్ 24(బి) కింద పన్ను మినహాయింపులు క్లెయిమ్ చేసుకోవచ్చు.
గృహ రుణంపై పన్ను ప్రయోజనాలు ఎప్పటి నుండి ప్రారంభమవుతాయి?
పన్ను ప్రయోజనాలు ఇల్లు స్వాధీనం చేసుకున్న తర్వాతే ప్రారంభమవుతాయి. నిర్మాణంలో ఉన్న ఇళ్ల విషయంలో, లోన్ డాక్యుమెంటేషన్ మరియు రిజిస్ట్రేషన్ ప్రక్రియలను స్వాధీనం చేసుకునే సమయానికి అనుగుణంగా పక్కాగా ఉంచుకోవాలి.
కొత్త పన్ను విధానంలో గృహ రుణాలకు సంబంధించిన మినహాయింపులు ఎలా ఉంటాయి?
కొత్త పన్ను విధానంలో గృహ రుణాలపై లభించే మినహాయింపులు చాలా పరిమితంగా ఉంటాయి. ఈ విధానంలో ఉన్నవారు పన్ను మినహాయింపుల కంటే, రుణంపై అయ్యే మొత్తం వడ్డీ ఖర్చును తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాలి.
మొదటిసారి ఇల్లు కొనేవారికి ఏమైనా అదనపు పన్ను ప్రయోజనాలు ఉన్నాయా?
అవును, మొదటిసారి ఇల్లు కొనేవారికి సెక్షన్ 80EEA కింద అదనపు వడ్డీ మినహాయింపులు పొందే అవకాశం ఉంది. దీనికి లోన్ అప్రూవల్ మరియు సరైన పత్రాలు తప్పనిసరి.























