Paytm share buyback: పడడం తప్ప పెరగడం ఎరుగని కంపెనీ షేర్లకు కొత్త రెక్కలు తొడగడానికి, ఇన్వెస్టర్లలో క్షీణిస్తున్న నమ్మకాన్ని నిలబెట్టడానికి వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (One97 Communications Limited, ఇది Paytm మాతృ సంస్థ) మెగా ప్లాన్ వేసింది. మార్కెట్ ఫ్లోటింగ్‌లో ఉన్న షేర్లను బై బ్యాక్ చేస్తామంటూ స్టాక్ ఎక్చేంజీల ఫైలింగ్‌లో పేటీఎం అప్‌డేట్ చేసింది. షేర్ల బై బ్యాక్ ప్రతిపాదన పరిశీలించడానికి ఈ నెల (డిసెంబర్ 2022) 13న బోర్డ్ డైరెక్టర్లు సమావేశం అవుతారని ఆ కంపెనీ పేర్కొంది.
షేర్ల బై బ్యాక్ ప్రపోజల్ వార్తతో ఇవాళ్టి (శుక్రవారం, 09 డిసెంబర్ 2022) ఓపెనింగ్ సెషన్‌లో పేటీఎం షేర్లు భారీగా పెరిగాయి. గురువారం రూ. 508 దగ్గర క్లోజ్ అయిన షేర్ ప్రైస్, ఇవాళ ఏకంగా రూ. 544 దగ్గర ఓపెన్ అయింది. ఉదయం 9.37 గంటల సమయానికి రూ. 22.80 లేదా 4.49% లాభంతో రూ. 531 వద్ద స్టాక్ కదులుతోంది.
బైబ్యాక్ తేదీ, రికార్డ్ డేట్, బైబ్యాక్ మొత్తం
బై బ్యాక్ తేదీలు, క్యాప్, రికార్డ్ డేట్, బై బ్యాక్ టోటల్ సైజ్ వంటి వాటిని ఈ నెల 13న జరిగే బోర్డ్ మీటింగ్‌లో నిర్ణయిస్తారు. కంపెనీ ప్రస్తుత లిక్విడిటీ/ఆర్థిక స్థితిని బట్టి బై బ్యాక్ ఉంటుంది. ఇది షేర్‌హోల్డర్లకు ప్రయోజనకరంగా ఉంటుందని కంపెనీ మేనేజ్‌మెంట్ విశ్వసిస్తోంది. సెబి లిస్టింగ్ రెగ్యులేషన్స్‌లోని నిబంధనలకు అనుగుణంగా, డిసెంబర్ 13న బోర్డు సమావేశం ముగిసిన తర్వాత, బోర్డ్ మీటింగ్ నిర్ణయాలను స్టాక్ ఎక్స్ఛేంజీలకు కంపెనీ తెలియజేస్తుంది.
పేటీఎం షేర్లు లిస్టింగ్ సమయం నుంచి ఒత్తిడిలో ఉన్నాయి. ఎక్కువ వాల్యుయేషన్‌తో వచ్చిన కంపెనీ షేర్లను స్టాక్ మార్కెట్ తిరస్కరించింది. దీంతో, అప్పట్నుంచి షేర్ ధర పడుతూనే ఉంది. కొన్ని వారాల క్రితం కూడా, యాంకర్ ఇన్వెస్టర్ల ఏడాది లాక్ ఇన్ పిరియడ్ ముగిసింది. దీంతో, కంపెనీ షేర్లను అమ్ముకోవడానికి ప్రి-ఐపీవో పెట్టుబడిదారులకు స్వేచ్ఛ దొరికింది. ప్రి-ఐపీవో పెట్టుబడిదారుల్లో ఒకటైన సాఫ్ట్‌బ్యాంక్, లాక్ ఇన్ పిరియడ్ ముగిసిన తర్వాత సుమారు $200 మిలియన్ల విలువైన షేర్లను విక్రయించడానికి బ్లాక్ డీల్స్ ప్రారంభించింది. దీంతో కంపెనీ స్టాక్ మీద ఒత్తిడి మరింత పెరిగి, షేర ధర మరింత వేగంగా పతనమైంది.
ఇవాళ్టి జంప్‌ను మినహాయించి చూస్తే, గత 5 రోజుల్లో ఈ స్టాక్ దాదాపు 7 శాతం నష్టపోయింది. గత నెల రోజుల్లో 21 శాతం పైగా (ఈ రోజు మినహాయింపుతో) క్షీణించింది. ఇవాళ దాదాపు 6 శాతం లాభపడడంతో, ఆ నష్టాలను కొంతమేర పూడ్చుకోగలిగింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.