Adani Group Stocks: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ‍‌(NSE), అదానీ గ్రూప్‌ కంపెనీలకు ఒక షాక్‌ ఇచ్చింది. నిఫ్టీ ఆల్ఫా 50 ఇండెక్స్ (Nifty Alpha 50 index) నుంచి 4 అదానీ గ్రూప్ స్టాక్స్‌ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మార్చి 31 నుంచి అమలులోకి వస్తుంది. 


నిఫ్టీ ఆల్ఫా 50 ఇండెక్స్ నుంచి బయటకు రాబోతున్న అదానీ గ్రూప్‌ స్టాక్స్... అదానీ ఎంటర్‌ప్రైజెస్ ‍‌(Adani Enterprises), అదానీ గ్రీన్ ఎనర్జీ (Adani Green Energy), అదానీ ట్రాన్స్‌మిషన్ (Adani Transmission), అదానీ టోటల్ గ్యాస్ (Adani Total Gas). 


నిఫ్టీ ఆల్ఫా 50 ఇండెక్స్ అంటే..?
ఒక నిర్ధిష్ట కాలంలో స్టాక్‌ మార్కెట్‌ ఇచ్చే మొత్తం రిటర్న్‌ కంటే ఒక ఇండివిడ్యువల్‌ స్టాక్‌ ఎక్కువ రిటర్న్‌ ఇస్తే, దానిని ఆల్ఫా స్టాక్‌ లేదా ఔట్‌పెర్ఫార్మ్‌డ్‌ స్టాక్‌ అని పిలుస్తారు. అలాంటి ఉత్తమ పనితీరు కనబరిచిన 50 పేర్లను నిఫ్టీ ఆల్ఫా 50 ఇండెక్స్‌లోకి NSE తీసుకుంటుంది. అన్ని రంగాలకు చెందిన 50 కంపెనీలు ఈ సూచీలో ఉంటాయి. అంటే, ఇవన్నీ ఆల్ఫా స్టాక్స్‌ లేదా ఔట్‌పెర్ఫార్మ్‌డ్‌ స్టాక్స్‌. ఈ సూచీ నుంచి తొలగించడం అంటే, మార్కెట్‌ కంటే బెటర్‌గా ఇవి పని చేయట్లేదని అర్ధం. ఈ ఇండీస్‌ను ఫాలో అయ్యే మ్యూచువల్‌ ఫండ్‌ మేనేజర్లు, ఈ స్టాక్స్‌ నుంచి తమ పెట్టుబడులు వెనక్కు తీసుకుంటారు.  


ఈ నాలుగు అదానీ స్టాక్స్‌తో పాటు అదానీ పోర్ట్స్ & స్పెషల్ ఎకనామిక్ జోన్‌ను కూడా నిఫ్టీ100 ఆల్ఫా 30 ఇండెక్స్ (Nifty100 Alpha 30 index) నుంచి NSE తొలగించింది, ఈ నిర్ణయం కూడా మార్చి 31 నుంచి అమలులోకి వస్తుంది.


వైదొలుగుతున్న - చేరుతున్న ఇతర స్టాక్స్‌
4 అదానీ స్టాక్స్‌తో పాటు... ఆదిత్య బిర్లా ఫ్యాషన్, ఏంజెల్ వన్, గుజరాత్ నర్మద వ్యాలీ ఫెర్టిలైజర్స్, పేజ్ ఇండస్ట్రీస్, సుజ్లాన్ ఎనర్జీ సహా మరో 10 షేర్లు (మొత్తం 14 స్క్రిప్స్‌) నిఫ్టీ ఆల్ఫా 50 ఇండెక్స్ నుంచి నుంచి వైదొలుగుతున్నాయి.


మినహాయిస్తున్న 14 స్టాక్స్‌ స్థానంలో.... ఆదిత్య బిర్లా క్యాపిటల్, అపోలో టైర్స్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, భెల్, బ్రిటానియా ఇండస్ట్రీస్, IDFC ఫస్ట్ బ్యాంక్, జిందాల్ స్టీల్ & పవర్, L&T ఫైనాన్స్ హోల్డింగ్స్, M&M ఫైనాన్షియల్ సర్వీసెస్, MRF, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ , సిమెన్స్, జైడస్ లైఫ్ సైన్సెస్ నిఫ్టీ ఆల్ఫా 50 ఇండెక్స్‌లో జాయిన్‌ అవుతాయి.


నిఫ్టీ హై బీటా 50 ఇండెక్స్‌లోనూ (Nifty High Beta 50 index) మార్పులు జరిగాయి. ఇది హై ఓలటిలిటీ ఇండెక్స్‌. ఈ సూచీ నుంచి 5 స్టాక్స్‌ను మినహాయించి, మరికొన్నింటిని NSE చేరుస్తోంది. వొడాఫోన్ ఐడియా, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, టాటా కెమికల్స్‌ను మినహాయిస్తుండగా... అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్‌మిషన్, JSW ఎనర్జీని చేరుస్తున్నారు.


అదేవిధంగా, నిఫ్టీ లో ఓలటిలిటీ 50 ఇండెక్స్‌ నుంచి 4 పేర్లను తీసేసి, మరో 4 పేర్లను చేరుస్తున్నారు. ఈ సూచీ నుంచి ACC, అంబుజా సిమెంట్స్ వైదొలగగా... భారతి ఎయిర్‌టెల్, ICICI బ్యాంక్ ప్రవేశిస్తాయి.


ఇది కాకుండా, మరికొన్ని వ్యూహాత్మక సూచీల్లోనూ మార్పులు జరిగాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.