Nifty Bank: శుక్రవారం, స్టాక్ మార్కెట్ తీవ్ర అస్థిరంగా కదిలింది. ఉదయం అమ్మకాలకు దిగిన మదుపరులు, మధ్యాహ్నం యూరోపియన్ మార్కెట్లు ఓపెన్ అయిన దగ్గర్నుంచి కొనుగోళ్లు చేపట్టారు. దీంతో, సెన్సెక్స్, నిఫ్టీ, నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్‌లు కీలక లెవెల్స్ దగ్గర సపోర్ట్ - రెసిస్టెన్స్‌ను ఫేస్ చేస్తూ మొత్తంగా ఒక రేంజ్ బౌండ్‌లోనే కొనసాగాయి, ఫ్లాట్‌గా ముగిశాయి.
నిఫ్టీ (NSE Nifty) 3.35 పాయింట్లు లేదా 0.019 శాతం నష్టంతో 17,539.45 దగ్గర, సెన్సెక్స్ (BSE Sensex) 36.74 పాయింట్లు లేదా 0.063 శాతం లాభంతో 58,803.33 వద్ద ముగిశాయి.
నిఫ్టీ బ్యాంక్ కూడా కొద్దిపాటి లాభాలతో సరిపెట్టుకుంది. ఉదయం 39,422 వద్ద మొదలైన నిఫ్టీ బ్యాంక్, 39,200 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. తర్వాత 39,595 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఈ స్థాయి నుంచి మళ్లీ ముంచెత్తిన అమ్మకాలతో రెడ్ క్యాండిల్స్ ఫామ్ చేస్తూ కిందకు దిగింది. చివరకు డే ట్రేడింగ్ ముగిసేసరికి 119 పాయింట్లు లేదా 0.3 లాభంతో 39,421 వద్ద ఊగిసలాటను ఆపింది.
ఈ వారం మొత్తంలో చూస్తే... ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ కలిసి నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్‌ను నడిపించాయి. వారం మొత్తం కూడా ఈ ఇండెక్స్ అస్థిరంగానే కదిలినా, మెరుగైన పనితీరును కనబరిచింది. వారం మొత్తం మీద 433.85 పాయింట్లు లేదా 1.1 శాతం పెరిగింది.
శుక్రవారం ముగింపు తర్వాత చూస్తే, డైలీ ఛార్ట్‌లో చిన్న బాడీతో బుల్లిష్ క్యాండిల్‌ని ఏర్పాటు చేసింది. వీక్లీ చార్ట్‌లో... బుల్లిష్ క్యాండిల్‌ను ఏర్పాటు చేసింది, మంచి బలంతో హయ్యర్ జోన్‌లో ముగిసింది.
వచ్చే వారం నిఫ్టీ బ్యాంక్ ఎలా ఉండవచ్చు?
చందన్ తపారియా, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (Motilal Oswal Financial Services)
నిఫ్టీ బ్యాంక్ పుంజుకుని రూ.39,750, ఆ తర్వాత 40,000 జోన్ వైపు ఎగబాకడానికి ప్రయత్నించవచ్చు. ఇందుకోసం 39,500 మార్క్ వద్ద ఉన్న కఠిన పరీక్షను ఎదుర్కోవలసి ఉంటుంది. 39,500 జోన్‌ను మంచి బలంతో దాటితే, అక్కడి నుంచి స్పీడ్ అందుకుంటుంది. ఈ ఇండెక్స్‌కు మద్దతు 39,250 వద్ద ఉంది. ఈ స్థాయి కన్నా కిందకు పడితో, 38,888 జోన్ దగ్గర మరో సపోర్ట్ ఉంది.
రూపక్ దే, ఎల్‌కేపీ సెక్యూరిటీస్ (LKP Securities)
ఈ ఇండెక్స్ 37,700 పైన కొనసాగినంత కాలం డిప్స్‌లో కొనుగోళ్లు కనిపిస్తూనే ఉంటాయి. 37,700 మార్కు దిగువకు పడిపోతే మాత్రం ఇండెక్స్‌లో తీవ్రమైన కరెక్షన్‌ను చూడవచ్చు. 39,500 కంటే పైకి డెసిసివ్ మూవ్ ఉంటే, 41,800 వైపు ర్యాలీ కొనసాగవచ్చు.
మనీష్ షా, స్వతంత్ర విశ్లేషకుడు (Independent)
గత రెండు వారాల్లో ప్రైస్ యాక్షన్‌ను గమనిస్తే.. అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాట్రన్ కనిపిస్తుంది. ట్రెండ్ ఇకపైనా కొనసాగుతుందన్నదానికి ఇది టెక్నికల్ ఇండికేషన్. ర్యాలీ కొనసాగాలంటే ఇండెక్స్‌కు 39,600-40,000 పైన గట్టి పుష్ అవసరం.
పాలక్ కొఠారి, ఛాయిస్ బ్రోకింగ్ (Choice Broking)
నిఫ్టీ బ్యాంక్‌కు 38,500 స్థాయి వద్ద మద్దతు ఉండగా, 40,000 స్థాయిల వద్ద గట్టి నిరోధం ఉంది.
రాజ్ దీపక్ సింగ్, ఐసీఐసీఐ డైరెక్ట్ (ICICIdirect)
ఈ వారంలో, 37,850 - 40,649 రేంజ్‌లో నిఫ్టీ బ్యాంక్ ట్రేడర్లు షార్ట్ స్ట్రాడిల్ స్ట్రాటెజీలు తీసుకుని గరిష్ట లాభాలను పొందుతారని మేం భావిస్తున్నాం. అయితే, ఇండెక్స్ ఈ రేంజ్ బౌండరీల దగ్గరకు వచ్చినా, దాటినా చాలా అప్రమత్తంగా ఉండాలి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే!. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.