Mukesh Ambani Birthday: ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ ఈ రోజు (బుధవారం, 19 ఏప్రిల్ 2023) 66వ వసంతంలోకి అడుగుపెట్టారు. ధీరూభాయ్ అంబానీ, కోకిలాబెన్ అంబానీల ముద్దుబిడ్డగా ఏప్రిల్ 19, 1957న జన్మించారు. అయితే, ముకేష్ అంబానీ పుట్టింది భారత్‌లో కాదు, యెమెన్‌లో. ఇప్పుడు, ప్రపంచంలోని టాప్-15 మంది సంపన్నుల జాబితాలో ముకేష్ అంబానీ పేరు ఉంది. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితాలో ముకేష్ అంబానీ 13వ స్థానంలో నిలిచారు. ఆయన ఆస్తుల మొత్తం నికర విలువ $86.3 బిలియన్లు. తండ్రి ధీరూభాయ్ అంబానీ మరణానంతరం రిలయన్స్‌కు చైర్మన్ అయ్యారు. కఠోర శ్రమతో కంపెనీని కొత్త శిఖరాలకు తీసుకెళ్లారు.
వ్యాపార ప్రపంచంలోకి అడుగు
ముకేష్ అంబానీ బొంబాయి విశ్వవిద్యాలయం నుంచి కెమికల్ ఇంజనీరింగ్‌లో పట్టా పొందారు. ఆ తరువాత, స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ తీసుకున్నారు. కానీ, తన చదువును మధ్యలోనే వదిలేసి 1981 సంవత్సరంలో తన తండ్రి వ్యాపారంలో చేరారు. అక్కడి నుంచి వ్యాపార ప్రయాణం ప్రారంభమైంది. 1985లో రిలయన్స్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ పేరు రిలయన్స్ ఇండస్ట్రీస్‌గా మారింది. దీంతో పాటు, వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్‌ను కూడా ప్రారంభించారు.
తండ్రి మరణానంతరం రిలయన్స్ చైర్మన్
ముకేష్ అంబానీ తండ్రి ధీరూభాయ్ అంబానీ 2022 జులై 6వ తేదీన మరణించారు. తండ్రి మరణానంతరం వ్యాపార విషయంలో ముకేష్ అంబానీకి, అతని సోదరుడు అనిల్ అంబానీకి విభేదాలు తలెత్తాయి. దీంతో రిలయన్స్ కంపెనీల విభజన జరిగింది. విభజన తర్వాత, ముకేష్ అంబానీకి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, తమ్ముడు అనిల్ అంబానీకి రిలయన్స్ ఇన్ఫోకామ్ దక్కింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ ఎంత?
తన కంపెనీని దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా మార్చేందుకు ముకేశ్ అంబానీ అహోరాత్రులు కష్టపడ్డారు. 2002 సంవత్సరంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మార్కెట్ విలువ కేవలం రూ.75,000 కోట్లు. ఇప్పుడు రూ.15 లక్షల కోట్లు దాటింది. దీనికంటే ముందు రూ.19 లక్షల కోట్లు దాటింది. ఆ తర్వాత కంపెనీ మార్కెట్ విలువ తగ్గుముఖం పట్టి ప్రస్తుతం రూ.15 లక్షల కోట్ల మీద ఉంది. గత ఏడాది ముకేశ్ అంబానీ తన వారసత్వ ప్రణాళికను ప్రకటించారు. టెలికాం వ్యాపారం ఆకాష్‌కు, రిటైల్ నాయకత్వం ఇషా అంబానీకి అప్పగించారు. చిన్న కుమారుడు అనంత్ అంబానీకి ఇంధన వ్యాపారాన్ని అప్పగించారు.
ఆసియాలోనే అత్యంత సంపన్నుడు
ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితా 2023 ప్రకారం, ముకేష్ అంబానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపన్నుల జాబితాలో 13వ స్థానంలో ఉన్నారు. గత సంవత్సరం వరకు, ముకేష్ అంబానీ ప్రపంచంలోని టాప్-10 మంది సంపన్నుల జాబితాలో ఉన్నారు. గత సంవత్సరం రిలయన్స్ షేర్లు భారీ పతనం తరువాత, టాప్-10 సంపన్నుల జాబితా నుంచి బయటకు వచ్చారు.