Mukesh Ambani: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత, ప్రపంచ కుబేరుడు ముకేష్ అంబానీ  (Mukesh Ambani) మరో సంచలనానికి సిద్ధం అవుతున్నారు. గతంలో, జియోను తీసుకువచ్చి, టెలికాం రంగంలో ఆకాశంలో ఉన్న రేట్లను నేల మీదికి దించిన అంబానీ... ఇప్పుడు అలాంటి మరో ఫీట్‌కు సిద్ధం అవుతున్నారు. 


ఆయిల్‌, రిటైల్, టెలికాం రంగాల్లో అగ్రస్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్‌, ఇప్పుడు మరో కొత్త వ్యాపార విభాగంలోకి కూడా అడుగు పెట్టబోతోంది. అదే, హెల్త్‌ కేర్‌ సెగ్మెంట్‌. ఆ విభాగంలోనూ నంబర్‌ వన్‌గా నిలిచేందుకు, ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకు జెనెటిక్ మ్యాపింగ్‌ (జన్యు పరీక్షలు) సర్వీసును అందించాలని తాపత్రయ పడుతోంది. ఆరోగ్య సంరక్షణ విషయంలో భారతదేశ వినియోగదార్ల మార్కెట్ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, అమెరికాలోని 23అండ్‌మీ అంకుర సంస్థ తరహాలో అత్యంత తక్కువ ధరకే భారతీయులకు జన్యు పరీక్షలను అందుబాటులోకి తీసుకురావాలని అనుకుంటోంది. తద్వారా, ఆరోగ్య సంరక్షణను మరింత సరసమైన ధరల్లోకి, సమగ్రంగా మార్చాలని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చూస్తోంది.


చౌక ధరకు జీనోమ్ టెస్టింగ్‌
రిలయన్స్‌ గ్రూప్‌ మరికొన్ని వారాల్లో సమగ్ర రూ. 12,000 (145 డాలర్లు) ధరకే జీనోమ్ టెస్టింగ్‌ను పరిచయం చేస్తుందని స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ CEO రమేష్ హరిహరన్ చెప్పినట్లు బ్లూంబెర్గ్ రిపోర్ట్‌ చేసింది. 2021లో, స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాను కొనుగోలు చేసింది, ఆ సంస్థలో ఇప్పుడు రిలయన్స్‌కు 80 శాతం వాటా ఉంది.


రిలయన్స్ గ్రూప్. అమెరికాలోని 23అండ్‌మీ స్టార్టప్ కంపెనీ తరహాలో అత్యంత తక్కువకే భారతీయులందరికీ ఈ జీనోమ్ టెస్టింగ్ అందుబాటులోకి తీసుకురావాలని రిలయన్స్ భావిస్తోంది. 


భారతదేశంలో బిజినెస్‌ చేస్తున్న మ్యాప్‌మైజీనోమ్, మెడ్‌జీనోమ్ వంటి కంపెనీలు సంపూర్ణ జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ప్రస్తుతం 1,000 డాలర్లకు పైగా వసూలు చేస్తున్నాయి. వాటితో పోలిస్తే, తాము అందించే జినోమ్ సీక్వెన్సింగ్ టెస్టింగ్ కిట్‌ ధర 86 శాతం చౌక అని స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ CEO చెప్పారు. క్యాన్సర్, గుండె, న్యూరో డిజెనరేటివ్ వ్యాధులతో పాటు వంశపారంపర్యంగా వచ్చే జన్యుపరమైన వ్యాధులను గుర్తించేందుకు జీనోమ్ మ్యాపింగ్ (Genome Mapping) పరీక్షలు ఉపయోగపడతాయి. 


మై జియో (My Jio) యాప్ ద్వారా జీనోమ్ మ్యాపింగ్ టెస్ట్ కిట్స్‌ను మార్కెటింగ్ చేయాలని రియలన్స్ ఇండస్ట్రీస్‌ భావిస్తోంది. 


1.4 బిలియన్ల ప్రజలకు పెద్ద ఉపశమనం
ఈ ప్రాజెక్టు అమల్లోకి వస్తే... భారతదేశంలోని 1.4 బిలియన్ల ప్రజలకు సరసమైన ధరలకు వ్యక్తిగత జెన్-మ్యాపింగ్‌ అవకాశాన్ని అందిస్తుంది. 145 డాలర్ల ధరతో, ప్రపంచంలోనే అత్యంత చౌకైన జీనోమిక్ ప్రొఫైల్ తమదే అని కంపెనీ CEO వెల్లడించారు. ఇది దూకుడైన నిర్ణయమని అభిప్రాయపడ్డారు.


ముఖేష్ అంబానీ వ్యూహం ఇదే
ఇదే విధంగా... 2006లో రిటైల్ రంగంలోకి, 2016లో టెలికాం రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ముఖేష్ అంబానీ, ధరలను చుక్కల నుంచి నేల మీదకు దించారు. మార్కెట్ లీడర్‌గా ఆవిర్భవించేంత వరకు ఆయా రేట్లను కంపెనీ పెంచలేదు.


అలైడ్ మార్కెట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం... గ్లోబల్ జెనెటిక్ టెస్టింగ్ మార్కెట్ విలువ 2019లో $12.7 బిలియన్లుగా ఉంది, 2027 నాటికి $21.3 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా.