Maharashtra Seamless Bonus shares: స్టీల్ పైపులు, ట్యూబులు తయారు చేసే మహారాష్ట్ర సీమ్‌లెస్ కంపెనీ బోర్డు, తమ షేర్‌హోల్డర్లకు దీపావళి బోనస్ ప్రకటించింది. 1:1 నిష్పత్తిలో షేర్ బోనస్ ప్రకటించింది. అంటే, హోల్డ్ చేస్తున్న 1 షేరుకు మరో షేరును బోనస్ రూపంలో ఉచితంగా అందిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికం ఫలితాలను వెల్లడించిన తర్వాత బోనస్ షేర్ల గురించి అనౌన్స్ చేసింది. మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి (SEBI) సోమవారం సమర్పించిన ఫైలింగ్‌లో ఈ విషయాన్ని కంపెనీ వెల్లడించింది.
బోనస్ షేర్
బోనస్ షేర్ల విషయంలో రికార్డ్ తేదీని మహారాష్ట్ర సీమ్‌లెస్ ప్రకటించలేదు. దీపావళి నాటికి రికార్డ్ తేదీని కంపెనీ ప్రకటించవచ్చని తెలుస్తోంది. బోనస్ షేర్ అంటే కంపెనీ ఉచితంగా ఇచ్చే షేర్. అయితే, షేరు ధర ఆ మేరకు తగ్గిపోతుంది. ఈ కంపెనీ ఒక షేరుకు మరో షేరును బోనస్‌గా ప్రకటించింది కాబట్టి, షేరు ధర ఆటోమేటిక్‌గా సగానికి సగం సర్దుబాటు అవుతుంది. రికార్డ్ తేదీన ఈ సర్దుబాటు జరుగుతుంది. రికార్డ్ తేదీకి ముందు మీ దగ్గరున్న 1 షేరు ధర ఎంత ఉందో, రికార్డ్ తేదీ తర్వాత రెండు షేర్ల ధర కలిపి అంత ఉంటుంది.
బోనస్ నిర్ణయం వివరాలు మార్కెట్‌కు తెలిసిన తర్వాత, మంగళవారం కంపెనీ షేర్లు 6.75 శాతం క్షీణించి, రూ. 814.45 దగ్గర క్లోజయ్యాయి. ఫలితాలకు ముందు నుంచి, అంటే ఈ నెల ప్రారంభం నుంచి స్టాక్ ధర దాదాపు 20 శాతం పెరిగింది. సోమవారం ఫలితాల ప్రకటన నుంచి ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్స్ ప్రారంభించారు. దీంతో, స్టాక్ ధర ఒక్కసారిగా కిందకు జారింది.
ఈ ఏడాది ఈ స్టాక్ బాగానే పరుగులు పెట్టింది. ఈ ఏడాది ప్రారంభంలో ఉన్న రూ.518.70 నుంచి రూ.910 స్థాయికి పెరిగింది. ఈ క్రమంలో షేర్ దాదాపు 65 శాతం మేర పెరిగింది. గత 6 నెలల కాలంలో 39 శాతం లాభాలు తెచ్చి పెట్టింది. NSEలో ఈ షేర్ 52 వారాల గరిష్ట ధర రూ.910.
Q2 ఫలితాలు
ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో, మహారాష్ట్ర సీమ్‌లెస్ నికర లాభం 94.26% పెరిగి రూ.176.58 కోట్లకు చేరుకుంది. 2021 సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఇది రూ.90.90 కోట్లుగా ఉంది. 2021 సెప్టెంబర్ త్రైమాసికంలో అమ్మకాలు రూ.951.42 కోట్లుగా లెక్క తేలగా.. 2022 సెప్టెంబర్ త్రైమాసికానికి 48.64% పెరిగి రూ.1414.21 కోట్లకు చేరాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.