LTI Mindtree merger: మన ఐటీ రంగం చరిత్రలోకి మరో ఘట్టం వచ్చి చేరింది. ఐటీ కంపెనీలు ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌ (L&T Infotech - LTI), మైండ్‌ట్రీ (Mindtree) మెర్జ్‌ అయ్యాయి, ఒకే సంస్థగా అవతరించాయి. స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ సహా అన్ని విభాగాల రెగ్యులేటర్ల నుంచి అనుమతులు రావడంతో ఈ నెల 14 నాటికి విలీనం పూర్తయింది. మెర్జింగ్‌ ఎంటిటీ పేరు ‘ఎల్‌టీఐ-మైండ్‌ట్రీ’ (LTI-Mindtree). ఈ నెల 14 నుంచి కొత్త కంపెనీ ఉనికిలోకి వచ్చింది. 


ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌, మైండ్‌ట్రీ కలిసి ఈ విషయాన్ని ప్రకటించాయి. రెగ్యులేటరీలు, షేర్‌హోల్డర్ల నుంచి అన్ని రకాల ఆమోదాలు పూర్తయ్యాయని వెల్లడించాయి.


ఐదో అతి పెద్ద IT సేవల సంస్థ
సంయుక్త సంస్థ (Combined Entity) LTIMindtree మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా భారతదేశంలో ఐదో అతి పెద్ద IT సేవల సంస్థ. మాతృ సంస్థ అయిన L&Tకి విలీన సంస్థలో 68.73% వాటా ఉంటుంది. 


మైండ్‌ ట్రీ షేర్లు రద్దు - రికార్డ్‌ డేట్‌ నవంబర్‌ 24
విలీన ప్రణాళికలో భాగంగా... మైండ్‌ట్రీ షేర్లు రద్దవుతాయి. వాటిని స్టాక్‌ మార్కెట్ నుంచి డీలిస్ట్‌ చేస్తారు. అయితే, మైండ్‌ట్రీ షేర్‌హోల్డర్లకు అన్యాయం జరక్కుండా, ప్రతి 100 మైండ్‌ట్రీ షేర్లకు LTIలోని 73 షేర్లను జారీ చేస్తారు. అంటే, మీ దగ్గర 100 మైండ్‌ ట్రీ షేర్లు ఉంటే, వాటి స్థానంలో 73 LTI షేర్లు వచ్చి మీ డీమ్యాట్‌ ఖాతాలో చేరతాయి. ఇలా ప్రతి 100 షేర్లకు 73 LTI షేర్లు షేర్‌హోల్డర్ల డీమ్యాట్‌ అకౌంట్లలోకి ఆటోమేటిక్‌గా వచ్చి పడతాయి. మీరు ఏమీ చేయాల్సిన పని లేదు. ఒకవేళ మీ దగ్గర ఇంకా షేర్లు మిగిలితే, షేర్ల జారీ దామాషా ప్రకారం లెక్కవేసి, ఆ మేరకు నగదును మీ అకౌంట్లలో జమ చేస్తారు. LTI ఈక్విటీ షేర్ల ఇష్యూ కోసం మైండ్‌ట్రీ అర్హత గల వాటాదారులను గుర్తించడానికి, రికార్డ్ తేదీని నవంబర్ 24గా నిర్ణయించారు. అదే రోజు నుంచి ఎల్‌టీఐ షేర్లను ఎల్‌టీఐ మైండ్‌ట్రీగా రీబ్రాండ్‌ చేస్తారు. కొత్త పేరుతో కనిపించే షేర్లను అదే రోజు నుంచి ట్రేడ్‌ చేయవచ్చు.


ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌, మైండ్‌ట్రీ విలీనాన్ని ఈ ఏడాది మే 6న ప్రకటించారు. రెండు కంపెనీల వాటాదారులు, రుణదాతలతో పాటు, NCLT ముంబై బెంచ్‌, NCLT బెంగళూరు బెంచ్‌ కూడా ఈ పథకాన్ని ఆమోదించాయి.


LTIMindtree నూతన CFOగా వినిత్ తెరేసాయిని కంపెనీ నియమించింది. రెండు కంపెనీల బలమైన బ్యాలెన్స్ షీట్ల వల్ల... కొత్త టాలెంట్‌, టెక్నాలజీలు, క్లయింట్ రిలేషన్‌షిప్స్‌లో వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టగల సామర్థ్యం LTIMindtreeకి పెరుగుతుందని వినిత్ తెరేసాయి చెబుతున్నారు.


2026 నాటికి ఐటీ సేవల విలువను 25 శాతానికి చేర్చాలన్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ విలీనం దోహదపడుతుందని L&T గ్రూప్‌ ఛైర్మన్‌ ఎ.ఎం.నాయక్‌ వెల్లడించారు.


సోమవారం ట్రేడింగ్‌లో LTI షేర్లు 2% లాభంతో రూ. 5,161.20 వద్ద ముగియగా, మైండ్‌ట్రీ దాదాపు 3% పెరిగి రూ. 3,766.35 వద్ద ముగిసింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.