LIC Unclaimed Amount: భారతీయ జీవిత భీమా సంస్థ వద్ద క్లెయిమ్ చేయకుండా పడి ఉన్న నిధులపై కేంద్ర ఆర్థిక శాఖ పార్లమెంట్‌లో సంచలన గణాంకాలను వెల్లడించింది. మార్చి 31, 2026 నాటికి ఎల్‌ఐసీ వద్ద ఏకంగా రూ.7,318.5 కోట్లు అన్‌క్లెయిమ్డ్‌గా నిలిచిపోయాయి. ఇందులో రూ.5,564.5 కోట్లు పాలసీదారులు క్లెయిమ్ చేయని అసలు సొమ్ము కాగా, దానిపై వచ్చిన వడ్డీ, ఆదాయం విలువ మరో రూ.1,753.95 కోట్లు. మరోవైపు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ద్ద అధికారికంగా "అన్‌క్లెయిమ్డ్" ఖాతాలు లేవని స్పష్టం చేసిన ప్రభుత్వం, నిష్క్రియాత్మకంగా ఉన్న ఖాతాల్లో రూ.9,330.5 కోట్లు మూలుగుతున్నాయని తెలిపింది.
ఏజెంట్ల ఒత్తిడితో పాలసీలు చేసే వాళ్ల క్లెయిమ్‌లు తక్కువ
ఇంత పెద్ద మొత్తంలో నిధులు క్లెయిమ్ కాకుండా మిగిలిపోవడానికి ప్రధానంగా ఏజెంట్ల ఒత్తిడి, అవగాహనా రాహిత్యం కారణమవుతున్నాయి. గ్రామీణ, మధ్యతరగతి వర్గాల్లో చాలామంది బంధువులు లేదా తెలిసిన ఏజెంట్ల మాట నమ్మి ఎల్‌ఐసీ పాలసీలు తీసుకుంటారు. అయితే, కొన్ని వాయిదాలు చెల్లించిన తర్వాత ఆర్థిక ఇబ్బందుల వల్లనో లేదా చెల్లించే శక్తి లేకనో పాలసీలను మధ్యలోనే ఆపేస్తారు . ఆ తర్వాత తాము చెల్లించిన ఆ కొద్దిపాటి సొమ్మును సరెండ చేసుకుని వెనక్కి తీసుకోవచ్చనే కనీస సమాచారం 80% మంది పాలసీదారులకు తెలియకపోవడమే ఈ కొండలా పేరుకుపోయిన నిధులకు మూలకారణం.
సరిగ్గా సమాచారం లేకపోవడం కూడా మైనస్
దీనికితోడు కమ్యూనికేషన్ గ్యాప్ పెద్ద సమస్యగా మారింది. పాలసీ తీసుకున్న నాటికి ఉన్న చిరునామాలు, ఫోన్ నంబర్లు మారడం, నామినీలకు పాలసీ వివరాలు సరిగ్గా చెప్పకపోవడం వంటి నిర్లక్ష్యం వల్ల వేల కోట్లు ఎల్‌ఐసీ ఖజానాలోనే ఉండిపోతున్నాయి. పాలసీదారుడు ప్రమాదవశాత్తు లేదా సహజంగా మరణించినప్పుడు.. ఆయన కుటుంబానికి పాలసీ బాండ్ ఉందనే విషయమే తెలియక క్లెయిమ్ చేయడం లేదు. ఇటు సంస్థ వైపు నుంచి కూడా పాత వివరాలతో కస్టమర్లను పక్కాగా ట్రాక్ చేసే వ్యవస్థ బలహీనంగా ఉండటంతో కమ్యూనికేషన్ తెగిపోతోంది.
పీఎఫ్ ఖాతాల్లోనూ అంతే!
అన్‌క్లెయిమ్డ్ నిధుల జాబితాలో మధ్యతరగతి, అసంఘటిత రంగ కార్మికులు వలస కూలీలే ఎక్కువగా ఉంటున్నారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారు తరచూ కంపెనీలు మారడం వల్ల EPF ఖాతాల్లో ఉన్న పాత యుఏఎన్ నంబర్లను మర్చిపోయి, ఆ డబ్బును అలాగే వదిలేస్తున్నారు. అలాగే రోజువారీ వేతన కూలీలు, చిన్న వ్యాపారులు ఏజెంట్ల ప్రచారానికి ఆకర్షితులై రెండేళ్లు కట్టి ఆపేసిన సొమ్మును పట్టించుకోకపోవడంతో ఈ వేల కోట్ల రూపాయలు ఎవరికీ ఉపయోగపడకుండా నిరుపయోగంగా మారుతున్నాయి. ఈ పరిస్థితిని నివారించడానికి ఎల్‌ఐసీ, పిఎఫ్‌ఓ తమ వెబ్‌సైట్లలో అన్‌క్లెయిమ్డ్ ఫండ్స్ చెకర్ వెసులుబాటు కల్పించాయి. కస్టమర్లు తమ పాన్ కార్డ్, పేరు, పుట్టిన తేదీ నమోదు చేసి తమ పాత పాలసీల స్టేటస్ తెలుసుకోవచ్చు. మీ ఇంట్లో కూడా పాత ఎల్‌ఐసీ బాండ్లు మూలన పడి ఉంటే.. తక్షణమే సమీపంలోని బ్రాంచ్‌ను సంప్రదించి, బ్యాంక్ ఖాతా వివరాలు సర్పించి మీ హక్కుగా రావాల్సిన సొమ్మును సులభంగా తిరిగి పొందవచ్చు.
