Mutual Funds: 2023 ఫిబ్రవరి నెలలో, దేశీయ మ్యూచువల్ ఫండ్స్‌ (MFs) అదానీ స్టాక్స్‌లో వాటాలు తగ్గించుకున్నాయి. అదానీ స్టాక్స్‌ నుంచి వెనక్కు తీసుకున్న డబ్బును జొమాటో (Zomato), పేటీఎం (Paytm) వంటి కొత్త తరం టెక్ స్టాక్స్‌లోకి మళ్లించాయి. ఈ తరహా స్టాక్స్‌ మీద మనీ మేనేజర్లలో పెరిగిన నమ్మకాన్ని ఇది ప్రతిబింబిస్తోంది.


ఫిబ్రవరి నెలలో... అదానీ పోర్ట్స్ (Adani Ports), అదానీ ఎంటర్‌ప్రైజెస్ (Adani Enterprises), అదానీ టోటల్ గ్యాస్ (Adani Total Gas), అంబుజా సిమెంట్స్‌లో (Ambuja Cements) వాటాలను MFs ఆఫ్‌లోడ్ చేశాయి. లార్జ్‌ క్యాప్‌ సెగ్మెంట్‌లో, ఫిబ్రవరి నెలలో మ్యూచువల్ ఫండ్స్‌ చేసిన టాప్-10 అమ్మకాల్లో 3 అదానీ కౌంటర్లు ఉన్నాయి.


రంగాల వారీగా చూస్తే... ఫిబ్రవరి నెలలో, MFలు చమురు & గ్యాస్, IT, స్టేపుల్స్ & డిస్క్రిషనరీ స్టాక్స్‌ మీద ఎక్కువ పెట్టుబడులు పెట్టడం కనిపించింది. ఇదే సమయంలో... మెటల్స్ & మైనింగ్, హెల్త్‌కేర్, టెలికాం, మీడియా, ఇండస్ట్రియల్స్‌ మీద ఎక్స్‌పోజర్‌ తగ్గించాయి.


ఫిబ్రవరిలో టాప్ కొనుగోళ్లు
ఫిబ్రవరిలో రూ. 15,685 కోట్ల ఇన్‌ ఫ్లోస్‌ను దక్కించుకున్న ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్... ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో), గెయిల్, మాక్రోటెక్ డెవలపర్స్, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, HDFC AMC, PVR, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, నజారా టెక్నాలజీస్‌ షేర్లను కొనుగోలు చేశాయి.


ఆ నెలలో, 38 లక్షల  పేటీఎం షేర్లను ఎంఎఫ్‌లు కొనుగోలు చేశాయి. 52 వారాల గరిష్ట స్థాయి నుంచి 31% క్షీణించిన ఈ స్టాక్, మ్యూచువల్ ఫండ్స్ టాప్ 10 మిడ్‌ క్యాప్ బయింగ్స్‌లో ఒకటి.


భారతదేశంలో అతి పెద్ద AMC అయిన SBI మ్యూచువల్ ఫండ్, ఫిబ్రవరి నెలలో, 1.61 కోట్ల జొమాటో షేర్లను కొనుగోలు చేసింది. దీని ఇతర అగ్ర కొనుగోళ్లలో యునైటెడ్ స్పిరిట్స్, ఇన్ఫో ఎడ్జ్ ఉన్నాయి.


ACC, డిక్సన్ టెక్నాలజీస్, టైటన్, PNB, గ్లాండ్ ఫార్మా స్టాక్స్‌  HDFC AMC కొన్న టాప్‌-10 లిస్ట్‌లో ఉన్నాయి.


ఫిబ్రవరిలో టాప్ అమ్మకాలు
అదానీ స్టాక్స్‌తో పాటు, వేదాంత, టాటా పవర్, బ్యాంక్ ఆఫ్ బరోడా, వొడాఫోన్ ఐడియా, కెనరా బ్యాంక్, అనుపమ్ రసాయన్, ఈజీ ట్రిప్ ప్లానర్స్‌లో టాప్ మ్యూచువల్ ఫండ్స్ తమ వాటాలను విక్రయించాయి.


కొత్త తరం టెక్ స్టాక్స్‌ మళ్లీ లాభపడడం ప్రారంభించిన నేపథ్యంలో, ఈ కంపెనీల లాభదాయకత సుదీర్ఘ కాలం పాటు కొనసాగవచ్చని నిపుణులు చెబుతున్నారు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.