HDFC Hikes Home Loan Rates: గృహ రుణం తీసుకుని ఇల్లు కట్టుకోవాలని లేదా కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి చేదు వార్త. దేశంలో అతి పెద్ద హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ అయిన HDFC లిమిటెడ్, తన రుణ రేటును 35 బేసిస్ పాయింట్లు లేదా 0.35 శాతం పెంచింది. ఈ పెంపుదల ఇవాళ్టి (మంగళవారం, 20 డిసెంబర్ 2022) నుంచి అమల్లోకి కూడా వచ్చింది. 


తాజా వడ్డీ రేటు పెంపుతో, HDFC ఇచ్చే గృహ రుణాలు మరింత ఖరీదుగా మారాయి. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే గృహ రుణాలు తీసుకుని, వాటిని నెలనెలా EMIల రూపంలో తిరిగి చెల్లిస్తున్న వారి మీద భారం పెరిగింది. వడ్డీ రేటు పెంపు వల్ల, చెల్లించాల్సిన EMI మొత్తం పెరిగింది. HDFC ఆఫర్‌ చేస్తున్న గృహ రుణాల మీద వడ్డీ రేట్లు 8.20 శాతం నుంచి ప్రారంభం అయ్యేవి. ఇప్పుడు, పెరుగుదల తర్వాత, కనీసం రేటు 8.65 శాతంగా మారింది. అయితే, 800 లేదా ఆ పైన క్రెడిట్‌ స్కోరు ఉన్న వారికి మాత్రమే ఈ కనిష్ట రేటుకు గృహ రుణం అందిస్తామని కంపెనీ తెలిపింది. మొత్తం పరిశ్రమలోనే అతి తక్కువ రేటు అని వెల్లడించింది. 


వడ్డీ రేట్ల పెంపులో HDFC ఎక్కువ దూకుడుగా ఉంది. గత 8 నెలల్లోనే 8వ సారి వడ్డీ రేటును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సగటున ప్రతి నెలా వడ్డీ రేటును పెంచుతూనే వచ్చింది. 


రూ. 20 లక్షల రుణం మీద నెలకు రూ. 448 భారం
ప్రస్తుతం, 20 ఏళ్ల కాలానికి 8.65 శాతం వడ్డీ రేటుతో తీసుకున్న 20 లక్షల రూపాయల గృహ రుణానికి EMI రూ. 17,547 గా ఉంది. 35 బేసిస్‌ పాయింట్ల పెంపు తర్వాత ఇది ఇదే గృహ రుణ రేటు 9 శాతంగా మారుతుంది. ఫలితంగా నెలనెలా రూ. 17,995 EMI చెల్లించాల్సి ఉంటుంది. అంటే, ఈ తరహా రుణం మీద నెలకు రూ. 448 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.


రూ. 30 లక్షల రుణం మీద నెలకు రూ. 624 భారం
ఒకవేళ మీరు 15 సంవత్సరాల కాలనికి రూ. 30 లక్షల గృహ రుణం తీసుకున్నట్లయితే, దాని మీద 8.75 శాతం చొప్పున నెలకు 29,983 EMI చెల్లించాలి. వడ్డీ రేటు పెంచిన తర్వాత కొత్త రేటు 9.10 శాతంగా మారుతుంది. నెలనెలా కట్టాల్సిన EMI రూ. 30,607 అవుతుంది. ఈ తరహా రుణం మీద నెలకు రూ. 624 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.


మిగిలిన బ్యాంకులదీ ఇదే బాట
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) తన రెపో రేటు పెంచిన తర్వాత, బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల (NBFCలు) దగ్గర నుంచి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల వరకు ఒకదాని తర్వాత ఒకటి వడ్డీ రేట్లను పెంచుతూ వచ్చాయి. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) తర్వాత ఇప్పుడు HDFC కూడా గృహ రుణ రేటును పెంచింది. మిగిలిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కూడా అతి త్వరలోనే వడ్డీ రేట్ల పెంపును ప్రకటించవచ్చని సమాచారం.