ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే ట్రావెల్ యాప్ ఇక్సిగో (ixigo).. హైదరాబాద్‌కు చెందిన బస్ టికెటింగ్ ప్లాట్‌ఫారమ్‌ అభిబస్‌ను కొనుగోలు చేసింది. లే ట్రావెన్యూస్‌ టెక్నాలజీ లిమిటెడ్‌ అనే సంస్థ ఇక్సిగో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. కొంత భాగం నగదు రూపంలో, మరికొంత షేర్ల రూపంలో కేటాయించడం ద్వారా అభిబస్‌ను ఇక్సిగో సొంతం చేసుకుంది. ఇదే విషయానికి సంబంధించి ఇక్సిగో సీఈవో అలోక్‌ బాజ్‌పాయ్‌ ట్వీట్ చేశారు.  






తెలుగు వ్యక్తి అయిన చిర్రా సుధాకర్‌రెడ్డి 2008లో అభిబస్‌ను ప్రారంభించారు. ఈ సంస్థ బస్ టికెట్ల రిజర్వేషన్లతో పాటు ఫ్లీట్‌ మేనేజ్‌మెంట్‌, వెహికల్‌ ట్రాకింగ్‌ సిస్టమ్స్‌ వంటి సేవలను అందిస్తోంది. ఇ-టికెటింగ్‌ విధానం ద్వారా వివిధ రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థల (RTC), ప్రైవేటు బస్‌ ఆపరేటర్లకు చెందిన బస్సులకు టికెట్లను బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తోంది. 


అభిబస్‌ వ్యవస్థాపకుడు సుధాకర్‌ రెడ్డి, అతని బృందం ఇక్సిగోలో చేరతారని ఇక్సిగో తెలిపింది. అభిబస్‌కు చెందిన మేధో సంపత్తి హక్కులు, టెక్నాలజీ, కార్యకలాపాలన్నీ ఇక్సిగోకు బదిలీ అవుతాయని పేర్కొంది. అయితే అభిబస్‌ను ఎంతకు కొనుగోలు చేశారన్న వివరాలను మాత్రం రెండు కంపెనీలు వెల్లడించలేదు.






2019-20 మధ్య కాలంలో అభిబస్ దేశంలో 26,000 బస్సు టికెట్లను విక్రయించింది. దీంతో దేశంలో రెండో అతిపెద్ద బస్సు అగ్రిగేటర్‌గా నిలిచింది. కాగా, గుర్గావ్ కు చెందిన ఇక్సిగో.. 2021 ఫిబ్రవరిలో రైలు టిక్కెట్ల బుకింగ్‌కు ఉపయోగించే కన్ఫార్మ్ టక్ట్ (Confirmtkt) యాప్‌‌ను సైతం కొనుగోలు చేసింది.