IRCTC WhatsApp Food Delivery: ప్రయాణీకులకు చేరువ కావడానికి ఎప్పటికప్పుడు కొత్త ఐడియాలను వెదుక్కుంటున్న ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC), ఫుడ్ ఆర్డర్ విషయంలో కొత్త సేవతో ప్రయాణీకుల ముందుకు వచ్చింది. టిక్కెట్ బుక్ చేసుకునే సమయంలో ఫుడ్ ఆర్డర్ పెట్టకపోయినా పర్లేదు, ఆ తర్వాత రైలు ప్రయాణ సమయంలో ఎప్పుడైనా ఆహారం ఆర్డర్ పెట్టేలా నయా సర్వీసును ప్రారంభించింది. ఇందుకోసం వాట్సాప్ (WhatsApp) చాట్‌ను ఉపయోగించుకుంటోంది.
వాట్సాప్ ఆధారంగా ఆహారాన్ని ఆర్డర్ పెట్టేలా సేవలను తీసుకొచ్చిన మొదటి, ఏకైక (ఇప్పటివరకు) ప్లాట్‌ఫాం ఇదే కావడం విశేషం.
రైలు ప్రయాణ సమయంలో ప్రయాణీకులు ఆహారాన్ని ఆర్డర్ పెట్టేలా ఫుడ్ డెలివరీ యాప్ "జూప్"ను (Zoop) ఐఆర్‌సీటీసీ ప్రారంభించింది. వాట్సాప్ ద్వారా ప్రయాణీకులు ఆహారాన్ని ఆర్డర్ చేయడంలో ఈ యాప్ సాయపడుతుంది. టిక్కెట్‌పై ఉండే 'ప్యాసింజర్ నేమ్ రికార్డ్' (PNR) నంబర్‌ను ఉపయోగించి ప్రయాణీకులు ఈ సేవను పొందవచ్చు.
ఐఆర్‌సీటీసీ, జియో హాప్టిక్ (Jio Haptik) భాగస్వామ్యంలో జూప్ యాప్ వచ్చింది. ఈ యాప్‌లో చాట్ చేస్తూ (చాట్‌బాట్ సర్వీస్) చాలా సులభంగా, కొన్ని స్టెప్స్‌లోనే ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు. వాట్సాప్ చాట్ నుంచి మరొక లింక్‌కి ప్రయాణీకులను మళ్లించబడం జరగదు. ఈ చాట్‌లోనే ఆహారాన్ని ఆర్డర్ పెట్టవచ్చు. అంతేకాదు, ఇలా ఫుడ్ ఆర్డర్ చేయడానికి ప్రయాణికులు ఎలాంటి అదనపు యాప్ లేదా ఇతర సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు.
వాట్సాప్ చాట్‌బాట్ పేరు జివా (Ziva). కస్టమర్‌లు తమ PNR నంబర్ ద్వారా ఫుడ్ ఆర్డర్ పెట్టడమే కాదు, ఆర్డర్ ఏ దశలో ఉంది?, ఎంతసేపట్లో డెలివరీ అవుతుందన్న విషయాలను రియల్ టైమ్ ఆర్డర్ ట్రాకింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. జివాతో చాట్ చేస్తూ ఫీడ్‌బ్యాక్ ఇవ్వొచ్చు, సపోర్ట్ పొందవచ్చు. ఆర్డర్ పెట్టిన ఫుడ్ నేరుగా వారి సీట్ల వద్దకే డెలివరీ అవుతుంది.
వాట్సాప్ ద్వారా రైల్లో ఫుడ్ ఆర్డర్ ఇలా పెట్టొచ్చు..
సంప్రదించాల్సిన నంబర్
ప్రయాణీకులు 91 7042062070 నంబర్ ద్వారా వాట్సాప్‌లో జూప్‌తో చాట్ చేయవచ్చు. పెట్టిన ఆర్డర్ కన్ఫర్మ్ అయితే, ప్రయాణికులున్న సీట్లు లేదా బెర్త్‌ల దగ్గరకే ఐఆర్‌సీటీసీ సిబ్బంది ఆహారాన్ని తీసుకొచ్చి అందిస్తారు.
లొకేషన్
ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్, డెలివరీ సేవలు విజయవాడ, వడోదర, మొరాదాబాద్, వరంగల్, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్, కాన్పూర్, ఆగ్రా, తుండ్ల జంక్షన్, బల్లార్ష జంక్షన్ తోపాటు 100కు పైగా A1, A, B కేటగిరీ రైల్వే స్టేషన్లలో అందుబాటులో ఉన్నాయి.
మెనులో ఏ వంటకాలు ఉంటాయి?
ఐఆర్‌సీటీసీ అందించే వివిధ రకాల శాఖాహార, మాంసాహార వంటకాలను వాట్సాప్ ద్వారా ఆర్డర్ చేయవచ్చు. మనకు మెనూ కనిపిస్తుంది. వాటితోపాటు వెజ్ థాలీ, రైతాతో కలిపి వెజ్ లేదా చికెన్ బిర్యానీ, స్టాండర్డ్ లేదా జైన్ స్పెషల్ థాలీని కూడా ఆర్డర్ పెట్టవచ్చు.
చెల్లింపు విధానం
జూప్ యాప్ ద్వారానే డబ్బు చెల్లించవచ్చు. ఈ విధానం కూడా సులభంగానే ఉంటుంది. కేవలం మూడు క్లిక్స్‌లో (3-click payment experience) డబ్బు చెల్లింపును పూర్తి చేయవచ్చు.