Steel Price: అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు భారత్ పారిశ్రామిక రంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం, ఇరాన్‌పై అమెరికా జరుపుతున్న దాడులు గ్లోబల్ సప్లై చైన్‌ను దెబ్బ తీయడమే కాకుండా దేశీయంగా స్టీల్‌ ధరలు ఆకాశాన్ని తాకేలా చేస్తున్నాయి. ముడి పదార్థాల కొరత, రవాణా ఖర్చులు పెరగడంతో ఉక్కు కంపెనీలు తమ ధరలను భారీగా పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. 

Continues below advertisement

ముడి పదార్థాల ధరల పెరుగుదలకు అసలు కారణాలేంటి?

ప్రస్తుతం ఇరాన్‌పై అమెరికా దాడులు సుదీర్ఘకాలం కొనసాగుతుండటంతో, దిగుమతి చేసుకునే కోకింగ్ కోల్ వంటి కీలక ముడి పదార్థాల ధరలు విపరీతంగా పెరిగాయి. వాటితోపాటు షిప్పింగ్ ఛార్జీలు కూడా భారమయ్యాయి. ఇది ఉక్కు కంపెనీల ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే ఐరన్ ఓర్‌, ఇంధన ఖర్చులు పెరగడంతో ఉక్కు సంస్థలు ధరలను సవరించాయి. 

గత ఏడాది నవంబర్‌లో టన్నుకు 47వేలుగా ఉన్న డొమెస్టిక్‌ హాట్‌ రోల్ట్‌ కాయిల్ ధరలు ప్రస్తుతం 54వేల నుంచి 58వేల మధ్యకు చేరుకున్నాయి. అంటే కేవలం కొన్ని నెలల్లోనే సుమారు 23 శాతం ధర పెరిగింది. ముడి పదార్థాలైన కోకింగ్ కోల్‌, ఫెర్రో అల్లాయ్స్‌ ధరలు మరింత వేగంగా పెరుగుతుండటంతో ఇంటిగ్రేటెడ్‌ ప్లాంట్లు లేని కంపెనీల లాభాల మార్జిన్ దారుణంగా పడిపోతోంది. రానున్న వారాల్లో టన్నుకు మరో 1000 నుంచి రెండు వేల వరకు ధరలు పెరిగే అవకాశం ఉంది. 

Continues below advertisement

MSME రంగంపై పిడుగు 

భారత్‌ మొత్తం ఉక్కు ఉత్పత్తిలో దాదాపు 40 శాతం వాటా కలిగిన సూక్ష్మ, చిన్న, మధ్యతరగా పరిశ్రమల క్లస్టర్లు ప్రస్తుతం మనుగడ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. దేశవ్యాప్తంగా గ్యాస్, ఇంధన కొరత ఈ రంగాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తోంది. ముఖ్యంగా పంజాబ్, మహారాష్ట్రవంటి కీలక పారిశ్రామిక హబ్‌లలో గ్యాస్ సరఫరాలో 70 శాతం వరకు కోత విధించడంతో అనేక పరిశ్రమలు షిప్టులను తగ్గించుకున్నాయి. కొన్ని మూతపడే దిశగా ఉన్నాయి. గ్యాస్ కొరత కారణంగా ఇప్పటికే అనేక డౌన్‌స్ట్రీమ్‌ ఉత్పత్తిదారులు యాక్టివిటీస్‌ను నిలిపేశారు. ఇది భవిష్యత్‌లో ఉక్కు డిమాండ్‌ను మరింత తగ్గించే ప్రమాదం ఉంది. 

దిగ్గజ సంస్థల సవాళ్లు 

దేశీయ ఉక్కు దిగ్గజం JSW స్టీల్స్ కూడా ఈ అడ్డంకుల వల్ల ఇబ్బంది పడుతోంది. ఇంధన సరఫరాలో అంతరాయాలు, సముద్ర రవాణాలో సమస్యలు తమ కార్యకలాపాలను ప్రభావితం చేస్తున్నాయని సంస్థ పేర్కొంది. ప్రభుత్వ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం కింద టిన్‌ప్లేట్‌ సరఫరా చేయాల్సిన బాధ్యత కలిగిన JSW స్టీల్స్‌ కోటెడ్ ప్రొడక్ట్స్‌, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆరు నెలల గడువు పొగింపును కోరుతోంది. పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ లిమిటెడ్‌ వంటి కీలక సరఫరాదారుల నుంచి ఫోర్స్ మెజ్యూర్‌ నోటీసులు అందడం వల్ల ఎల్‌ఎన్‌జీ సరఫరా నిలిచిపోయిందని సంస్థ వెల్లడించింది. 

పెరిగిన రవాణా ఖర్చులు

మైనింగ్, లాజిస్టిక్స్‌ రంగంపై డీజిల్ ధరల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అంతర్జాతీయ డీజిల్‌ ధరలు బ్యారెల్‌కు 180 డాలర్లకు చేరుకొని రెట్టింపు కావడంతో, ఉక్క ఉత్పత్తి వ్యయం నేరుగా ప్రభావితమైంది. మైనింక్ కార్యకలాపాల నుంచి ఫ్యాక్టరీ వరకు ముడి సరకును తరలించడం ఇప్పుడు అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారింది. 

భవిష్యత్‌పై అనిశ్చితి

ఒకవైపు ఖర్చుల ఒత్తిడి వల్ల ఉక్క ధరలు పెరుగుతుంటే మరోవైపు ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, తగ్గుతున్న డిమాండ్ మార్కెట్‌ను కలవరపెడుతున్నాయి. ఆటోమోటివ‌, వైట్ గూడ్స్‌ వంటి రంగాలు భారీ ధరల పెరుగుదలను అడ్డుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ధరలు పెరిగితే ఆయా రంగాల్లో అమ్మకాలు పడిపోతాయి. మార్కెట్ ప్రస్తుత అస్థిరత మధ్య కొట్టమిట్టాడుతోంది. 

ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ముడి పదార్థాల ధరల పెరుగుదల, సప్లై చైన్‌లో ఉన్న సమస్యలు తక్షణమే పరిష్కారం కాకపోతే భారత ఉక్కు పరిశ్రమో మరిన్ని ఒడిదుడుకులు తప్పవని స్పష్టమవుతోంది. ఇటు సామాన్యుడిపై నిర్మాణ రంగ ఖర్చుల భారం పడటమే కాకుండా, అటు పారిశ్రామిక వేగంలో కూడా మందగమనం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.