Indian Wedding Industry: ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అనేది ఒక కీలక ఘట్టం. పెళ్లి ద్వారా ఒక వ్యక్తి తన జీవితంలో మరో కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. వివాహం అనేది ఇద్దరు వ్యక్తులకు మాత్రమే పరిమితం కాదు, రెండు కుటుంబాలకు సంబంధించిన విషయం అది.


ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలు/కుటుంబాలు తమ హోదాను, పరపతిని, ఐశ్వర్యాన్ని చాటేందుకు వివాహాన్ని ఒక మార్గంగా ఎంచుకుంటున్నారు. ఇండియాలోనూ ఇదే జరుగుతోంది. ఫలితంగా, మన దేశంలో పెళ్లిళ్ల మార్కెట్ విలువ భారీగా పెరుగుతోంది. ఇండియన్ వెడ్డింగ్ ఇండస్ట్రీ ఇప్పుడు 130 బిలియన్ డాలర్ల మార్కెట్‌గా మారింది. ఆహారం & కిరాణా తర్వాత ఇది రెండో అతి పెద్ద పరిశ్రమగా అవతరించింది. భవిష్యత్తులో ఇది మరింత పెరుగుతుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.


వివాహం కోసం విపరీతమైన ఖర్చు
పెట్టుబడి బ్యాంకింగ్ సంస్థ జెఫరీస్ నివేదిక ప్రకారం... భారతీయ వివాహ పరిశ్రమ అమెరికన్‌ వెడ్డింగ్‌ ఇండస్ట్రీ కంటే రెట్టింపు పరిమాణంలో ఉంది. అయితే, చైనా మార్కెట్‌తో పోలిస్తే భారతీయ వివాహ మార్కెట్‌ చిన్నది. జెఫరీస్ అంచనా ప్రకారం... భారతదేశంలో ఒక వివాహానికి సగటున 14,500 డాలర్లు లేదా రూ. 12 లక్షలు ఖర్చు చేస్తున్నారు. భారతదేశంలో తలసరి ఆదాయానికి 5 రెట్ల ఎక్కువ మొత్తాన్ని వివాహం కోసం వెచ్చిస్తున్నారు. ఒక భారతీయ జంట, తమ చదువుల కోసం అయిన వ్యయం కంటే రెట్టింపు ఖర్చును పెళ్లి కోసం కేటాయిస్తోంది. 


అమెరికాలో పరిస్థితి భారత్‌కు రివర్స్‌లో ఉంది. అక్కడ, పెళ్లిళ్లకు అయ్యే ఖర్చు చదువుకు అయ్యే ఖర్చులో సగంగా ఉంది. అమెరికన్‌ వెడ్డింగ్ మార్కెట్ విలువ 70 బిలియన్‌ డాలర్లు కాగా, చైనా వెడ్డింగ్‌ మార్కెట్‌ విలువ 170 బిలియన్‌ డాలర్లు.


భారత్‌లో ఏటా కోటి వివాహాలు
భారతదేశంలో, ఒక కుటుంబం సగటు ఆదాయం సంవత్సరానికి 4 లక్షల రూపాయలు. అయితే... సగటు ఆదాయానికి మూడు రెట్ల మొత్తాన్ని (రూ.12 లక్షలు) వివాహం కోసం ఖర్చు చేస్తున్నారు. జెఫరీస్ రిపోర్ట్‌ ప్రకారం, భారతదేశంలో ప్రతి సంవత్సరం 80 లక్షల నుంచి 1 కోటి వివాహాలు జరుగుతున్నాయి. ఈ సంఖ్య ప్రపంచంలోనే అత్యధికం. పెళ్లిళ్ల కారణంగా ఆభరణాలు, బట్టలు, ఈవెంట్ మేనేజ్‌మెంట్, క్యాటరింగ్, వినోదం వంటి బిజినెస్‌లు కూడా అభివృద్ధి చెందుతున్నాయి. మన దేశంలో జరిగే విలాసవంతమైన వివాహాల ఖర్చు సగటు వివాహ ఖర్చు (రూ.12 లక్షలు) కంటే చాలా ఎక్కువగా ఉంటోంది.


ఆభరణాల పరిశ్రమ ఆదాయంలో సగం వాటా పెళ్లిళ్లదే
ఈ రోజుల్లో ప్రి-వెడ్డింగ్‌ ఈవెంట్స్‌ను కూడా పెళ్లి తరహాలో ఘనంగా నిర్వహిస్తున్నారు. వివాహానికి ముందు జరిగే గ్రాండ్ ఈవెంట్‌, క్రూయిజ్‌ పార్టీ వంటి వేడుకల కోసం డబ్బును మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారని తన రిపోర్ట్‌లో జెఫరీస్‌ వెల్లడించింది. మన దేశంలో, ఆభరణాల పరిశ్రమ ఆదాయంలో సగానికి పైగా మొత్తం పెళ్లి ఆభరణాల అమ్మకాల నుంచే వస్తోంది. 


భారత ప్రజలు వివాహాల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తుండేసరికి, విదేశాల్లో కాకుండా భారతదేశంలోనే పెళ్లి చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ గత ఏడాది పిలుపునిచ్చారు.


మరో ఆసక్తికర కథనం: రెండు వారాల కనిష్టానికి పసిడి పతనం - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి