Indian Government Bans 87 Loan Apps Over Data Misuse : ప్రజలను చట్టవిరుద్ధ కార్యకలాపాలతో వేధిస్తూ, సైబర్ మోసాలు, డేటా దుర్వినియోగం, అధిక వడ్డీ దోపిడీలకు పాల్పడుతున్న 87 అనధికార డిజిటల్ లోన్ యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకుంది. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (IT) చట్టం, 2000లోని సెక్షన్ 69A ప్రకారం ఈ యాప్‌లను బ్లాక్ చేసినట్లు మంత్రి ఆఫ్ స్టేట్ ఫర్ కార్పొరేట్ అఫైర్స్ హర్ష్ మల్హోత్రా లోక్‌సభలో తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) , ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) కలిసి చేపట్టిన సమగ్ర సమీక్ష అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫామ్‌లపై పర్యవేక్షణను మరింత కఠినతరం చేయాలని కేంద్రం నిర్ణయించింది.
ప్రజల్ని పట్టి పీడిస్తున్న లోన్ యాప్ లు - ఒక్క సారి లోన్ తీసుకుంటే వేధింపులే
గత కొన్ని సంవత్సరాలుగా డిజిటల్ లోన్ యాప్‌లు ప్రజలను లక్ష్యంగా చేసుకుని అనధికార కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటి ద్వారా అధిక వడ్డీలు వసూలు చేసుకోవడం, రుణాలు తిరిగి చెల్లించకపోతే బాధితుల కుటుంబ సభ్యులను వేధించడం, వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేయడం వంటి సమస్యలు తీవ్రమవుతున్నాయి. ఈ యాప్‌లు RBI మార్గదర్శకాలను పాటించకుండా, ఆక్రమణాత్మక రికవరీ పద్ధతులు అనుసరిస్తున్నాయి. ఫిర్యాదులు పెరగడంతో కేంద్రం సమగ్ర సమీక్ష చేపట్టింది.
చైనీస్ లోన్ యాప్ ల వేధింపులు - గతంలోనే కేంద్రం చర్యలు
2024లోనే RBI , కేంద్రంతో కలిసి 665 చైనీస్ లోన్ యాప్‌లపై విచారణ ప్రారంభించాయి. ఈ యాప్‌లు ప్రజల ఫోటోలు, కాంంటాక్ట్ లిస్ట్‌లను మోసపూరితంగా సేకరించి, రుణాలు చెల్లించకపోతే బెదిరింపులు చేస్తున్నాయని ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఆరోపణలతో కేంద్రం ఈ చర్యలు తీసుకుంది. RBI డిజిటల్ లెండింగ్ మార్గదర్శకాలు (2022) ప్రకారం, అన్ని లోన్ యాప్‌లు RBI నుంచి అనుమతి పొందాలి. కానీ ఈ 87 యాప్‌లు ఈ నిబంధనలను ఉల్లంఘించాయి.
మరింత కఠినంగా లోన్ యాప్స్ పై పర్యవేక్షణ
కేంద్రం ఇకపై డిజిటల్ లోన్ యాప్‌లపై మరింత కఠిన పర్యవేక్షణ అమలు చేయనుంది. ఇందులో డేటా ప్రైవసీ, రికవరీ పద్ధతులు, వడ్డీ రేట్లపై కొత్త మార్గదర్శకాలు రూపొందించనున్నారు. ఈ యాప్‌లు అప్పు తీసుకున్న అనేక మంది జీవితాల్ని నరకం చేశాయి. 2022లో RBI 27 యాప్‌లపై చర్యలు తీసుకుంది, 2023లో మరో 50 యాప్‌లను బ్లాక్ చేసింది. ఈసారి 87 యాప్‌లను బ్లాక్ చేశారు. ఈ యాప్ లకు బాకీ ఉన్నవారు ఇక కట్టాల్సిన అవసరం ఉండదు. వారి యాప్స్ ను బ్లాక్ చేశారు కాబట్టి కమ్యూనికేషన్ కూడా ఉండదు.