IMF India's GDP Growth Outlook: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి అంతర్జాతీయ ద్రవ్య నిధి (International Monetary Fund- IMF) చాలా కీలక ప్రకటన చేసింది. 


ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై IMF అంచనా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రపంచ ఆర్థిక వృద్ధి నెమ్మదిస్తుందని, ప్రగతి వేగం గతం కంటే తక్కువగా ఉంటుందని IMF తెలిపింది. ఆ సంస్థ లెక్క ప్రకారం "ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2022 సంవత్సరంలో 3.4 శాతం చొప్పున వృద్ధి చెందుతుంది. 2023లో ఇది 2.9 శాతానికి పడిపోతుంది, ఆ తర్వాత పుంజుకుని 2024లో తిరిగి 3.1 శాతానికి పెరుగుతుంది. వృద్ధి క్షీణత మధ్య ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది". 


భారతదేశ ఆర్థిక వ్యవస్థపై IMF అంచనా
అంతర్జాతీయ ద్రవ్య నిధి, భారతదేశ ఆర్థిక వ్యవస్థపైనా (India Economy) తన అంచనాలు వెలువరించింది. 2022 సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఐఎంఎఫ్‌ పేర్కొంది. ఆ సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 6.8 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని, 2023 ఏడాదిలో ఇది 6.1 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని తన నివేదికలో వెల్లడింది.


భారతదేశం స్థానం ప్రకాశవంతం
భారత ఆర్థిక వ్యవస్థపై నివేదిక విడుదల చేసిన అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ప్రధాన ఆర్థికవేత్త పియరీ ఒలివర్ గౌరించాస్ ‍‌(Pierre-Olivier Gourinchas) మాట్లాడుతూ... "2022 సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 6.8 శాతం చొప్పున వృద్ధి చెందుతుంది. ఆ తర్వాత, 2023 సంవత్సరంలో భారతదేశ GDPలో (Gross Domestic Production) క్షీణత నమోదవుతుంది, 6.1 శాతం చొప్పున మాత్రమే వృద్ధి చెందుతుంది. ఈ క్షీణత తర్వాత కూడా ప్రపంచ దేశాల్లో భారత్‌ పైచేయిగా నిలుస్తుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత ఆర్థిక వ్యవస్థ ఒక 'వెలుగు రేఖ'గా (bright spot) ఉంటుంది. దీంతో పాటు, 2024 సంవత్సరంలో, భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరోసారి 6.8 శాతం వృద్ధిని సాధిస్తుంది. అనేక అంతర్జాతీయ కారకాలు ప్రభావం చూపినా స్థిరమైన దేశీయ డిమాండ్‌తో భారత్‌ బలంగా వృద్ధి చెందుతుంది".
 
ఆసియా పరిస్థితి ఎలా ఉంటుంది?
IMF నివేదిక ప్రకారం, 2023, 2024 సంవత్సరాల్లో ఆసియా ఖండం వరుసగా 5.3 శాతం, 5.4 శాతం వృద్ధిని నమోదు చేయవచ్చు. ఆసియా వృద్ధి చైనా వృద్ధిపై ఆధారపడి ఉంటుంది. 2022లో చైనాలో జీరో కోవిడ్ విధానం కారణంగా జీడీపీలో భారీ క్షీణత నమోదైంది, 4.3 శాతానికి చేరుకుంది. 2023 జనవరి- మార్చి కాలంలో చైనా స్థూల జాతీయ ఉత్పత్తి (GDP) 0.2 శాతం క్షీణతతో 3.0 శాతానికి చేరవచ్చు. గమనించదగ్గ విషయం ఏంటంటే.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి కంటే చైనా జీడీపీ వృద్ధి తక్కువగా నమోదు కావడం గత 40 ఏళ్లలో ఇదే మొదటిసారి అవుతుంది. అదే సమయంలో, 2023 సంవత్సరంలో చైనా ఆర్థిక వ్యవస్థ 5.2 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి లెక్కలు వేసింది.


ALSO READ: బడ్జెట్‌ తర్వాత పెరిగే స్టాక్స్‌ ఇవి, ముందే కొని పెట్టుకోమంటున్న ఎక్స్‌పర్ట్స్‌


ALSO READ: గూగుల్‌లో మరో హిట్‌ వికెట్‌, సుందర్‌ పిచాయ్‌ జీతంలో భారీ కోత!