Vehicle Sales January: 2022లో ఆటో కంపెనీలు ఎదుర్కొన్న కష్టాలు ఇప్పుడు మబ్బుల్లా విడిపోతున్నాయి. ముడి పదార్థాల ధరలు దిగి వస్తున్నాయి, సెమీ కండక్టర్ల కొరత కూడా భారీగా తగ్గింది. సరఫరా గొలుసులో అవాంతరాలు మరుగునపడ్డాయి. ఇదే ఊపులో, కొత్త సంవత్సరం ప్రారంభంలో వాహన రంగం టాప్‌ గేర్‌లో దూసుకు వెళ్లింది.


వాహన కంపెనీలకు కలిసొస్తున్న కాలం ప్రభావం 2023 జనవరి నెలలో స్పష్టంగా కనిపించింది. ఆ నెలలో, దేశంలోని అన్ని కంపెనీల ప్రయాణీకుల వాహనాల అమ్మకాలు భారీగా పెరిగాయి. వాహన అమ్మకాల ఒగణాంకాలపై, వాహన డీలర్ల సంస్థ 'ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్' (FADA - ఫాడా) ఒక సవివర నివేదికను విడుదల చేసింది.


కరోనా మహమ్మారి తర్వాత, ఈ ఏడాది జనవరిలో వాహనాల అమ్మకాలు అకస్మాత్తుగా పెరిగాయి. ఇందులో.. ప్యాసింజర్ వాహనాలు (Passenger Vehicles), టూ వీలర్లు (Two Wheelers), ట్రాక్టర్లు (Tractors) అమ్మకాలు బలంగా ఉన్నాయి. మొత్తంగా చూస్తే, రిటైల్ ఆటో సేల్స్‌ (Auto Sale) 14 శాతం పెరిగాయి. FADA నివేదిక ప్రకారం, వివిధ కేటగిరీల వాహనాల మొత్తం అమ్మకాలు 2023 జనవరిలో 18,26,669 యూనిట్లకు పెరిగాయి. గతేడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 16,08,505 యూనిట్లుగా ఉంది. 


వాణిజ్య వాహన విక్రయాలు 16 శాతం వృద్ధి
జనవరి నెలలో, త్రి చక్ర వాహనాల (Three Wheeler) రిటైల్ అమ్మకాలు 59 శాతం పెరిగి 41,487 యూనిట్లకు చేరుకున్నాయి. వాణిజ్య వాహనాల (Commercial Vehicle Sales) విక్రయాల రిజిస్ట్రేషన్లు 16 శాతం పెరిగి 82,428 యూనిట్లకు చేరుకున్నాయి. అంతకుముందు జనవరి 2022లో వాణిజ్య వాహనాల విక్రయం 70,853 యూనిట్లుగా ఉంది. 2023 జనవరి నెలలో ట్రాక్టర్ విక్రయాలు 8 శాతం పెరిగి 73,156 యూనిట్లకు చేరుకోగా, గత ఏడాది ఇదే నెలలో 67,764 యూనిట్లుగా ఉన్నాయి.


ప్యాసింజర్ వాహన విక్రయాలు 22 శాతం వృద్ధి
FADA డేటా ప్రకారం, జనవరిలో ప్రయాణీకుల వాహనాల రిజిస్ట్రేషన్లు 22 శాతం పెరిగి 3,40,220 యూనిట్లకు చేరుకున్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 2,79,050 యూనిట్లుగా ఉంది. గత నెలలో, ద్విచక్ర వాహనాల రిటైల్ విక్రయాలు 12,65,069 యూనిట్లకు పెరిగాయి, జనవరి 2022లో ఈ సంఖ్య 11,49,351 యూనిట్లుగా ఉంది. అంటే ద్విచక్ర వాహనాల విక్రయాల్లో 10 శాతం వృద్ధి నమోదైంది.


FADA ఏం చెప్పిందంటే...
FADA ప్రెసిడెంట్ మనీష్ రాజ్ సింఘానియా (FADA President, Manish Raj Singhania) చెప్పిన ప్రకారం.. "2023 జనవరిలో వాహనాల మొత్తం రిటైల్ అమ్మకాలు గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే పెరిగాయి. అయితే, కొవిడ్‌కు ముందు గణాంకాలతో పోలిస్తే, అంటే 2020 జనవరి విక్రయాలతో పోలిస్తే ఇప్పటికీ 8 శాతం తక్కువగానే ఉన్నాయి. చైనాలో పారిశ్రామిక కార్యకలాపాలు మళ్లీ పుంజుకోవడంతో వాహన విడిభాగాలు, సెమీకండక్టర్ల విషయంలో ప్రపంచ సరఫరా పరిస్థితులు మెరుగుపడ్డాయి. దీంతో వాహనాల సరఫరా మెరుగ్గా సాగుతోంది. ఫలితంగా, ఆర్డర్‌ ఇచ్చిన వాహనాల కోసం ఎదురు చూసే సమయం (వెయిటింగ్‌ పిరియడ్‌) ఇకపై క్రమంగా తగ్గే అవకాశం ఉంది. ప్యాసింజర్‌ వెహికల్స్‌ అమ్మకాలు మరింత మెరుగు కావడానికి ఇది దోహదపడుతుంది".


వాహన విక్రయాల్లో ఇదే వృద్ధి కొనసాగితే, ఆటో కంపెనీలు 2023 జనవరి-మార్చి త్రైమాసికంలో మంచి ఆర్థిక ఫలితాలను పోస్ట్‌ చేసే అవకాశం ఉంది.