India Manufacturing Growth: భారతదేశ తయారీ రంగంలో బలమైన వృద్ధి, ఆశాజనక ఫలితాలు నమోదు కొనసాగుతోంది. ఫ్యాక్టరీ కార్యకలాపాల్లో వేగ వృద్ధి పెరిగింది. బలమైన పారిశ్రామిక ఆర్డర్లు, ఉత్పత్తి నేపథ్యంలో భారతదేశ తయారీ పరిశ్రమ ఈ క్యాలెండర్ సంవత్సరంలో ఇప్పటివరకు అత్యంత వేగవంతమైన రేటుతో పరుగులు తీస్తోంది.
2023 ఏప్రిల్ నెలలో, S&P గ్లోబల్ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ PMI (S&P Global India Manufacturing Purchasing Managers’ Index) 57.2 వద్ద ఉంది. ఇది, గత నాలుగు నెలల కంటే గరిష్ట స్థాయి. ప్రధానంగా కొత్త ఆర్డర్లు, ఔట్‌పుట్ వంటి మంచి వృద్ధి గణాంకాల ఆధారంగా ఇది సాధ్యమైందని పర్చేజింగ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ సర్వేలో వెల్లడైంది. PMIలోని అన్ని విభాగాలు ఏప్రిల్ నెలలో బలమైన సహకారం అందించాయి. అంతకుముందు నెల, 2023 మార్చిలో PMI 56.4 స్థాయిలో ఉంది.
దేశ ఆర్థిక వృద్ధిలో వేగం - మాన్యుఫ్యాక్చరింగ్ PMI ఒక సూచన
భారతదేశ ఆర్థిక వృద్ధి వేగంగా ఉందని, ప్రస్తుత ప్రపంచ సవాళ్ల వాతావరణంలో ఇది ఒక మంచి సంకేతమని S&P గ్లోబల్ నిర్వహించిన సర్వే వెల్లడించింది. అనేక ఇతర దేశాల్లో నెమ్మదిగా ఉన్న ఆర్థిక వృద్ధి రేటు ఆందోళన కలిగిస్తున్నా, భారతదేశంలో తయారీ PMI పెరుగుదలను మంచి సంకేతంగా చూడాలని తెలిపింది.
"కొత్త ఆర్డర్లలో బలమైన & వేగవంతమైన విస్తరణను ప్రతిబింబిస్తూ, ఏప్రిల్‌లో ఉత్పత్తి వృద్ధి మరో ముందడుగు వేసింది. తక్కువ ధర ఒత్తిళ్లు, మెరుగైన అంతర్జాతీయ అమ్మకాలు, సరఫరా గొలుసు పరిస్థితులను మెరుగుపడడం వల్ల కంపెనీలు కూడా లాభపడ్డాయి" - S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్‌లో ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పొలియానా డి లిమా
భారతీయ ఉత్పత్తి కంపెనీలు ముందడుగులు వేయాడానికి విస్తారమైన అవకాశాలను కలిగి ఉన్నట్లు కనిపిస్తోందని లిమా అంచనా వేశారు. 2023లో కొత్త ఆర్డర్లలో బలమైన ఇన్‌ఫ్లోస్ కనిపించడం మాత్రమే కాదు, ఉద్యోగ కల్పన ద్వారా ఉత్పత్తి సామర్థ్యాలు పెరిగాయని చెప్పారు.
భారతదేశంలో... కొత్త ఆర్డర్‌లు, ఫ్యాక్టరీ ఔట్‌పుట్ రెండూ 2022 డిసెంబర్ నుంచి అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నాయి. గత 13 నెలల్లో మొదటిసారిగా 2023 మార్చిలో క్షీణత కనిపించినా, ఏప్రిల్‌లో ఉద్యోగ నియామకాలు పెంచుకోవడంతో ఔట్‌పుట్‌లో బలమైన వృద్ధి సాధ్యమైంది.
తయారీ PMI ఎందుకోసం?
తయారీ PMI సంఖ్య 50 కంటే తక్కువగా ఉంటే, ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుందని అర్థం. అదే సమయంలో, ఇది 50కి మించి నమోదైతే దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని అర్థం. 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో (జనవరి-మార్చి కాలం) దేశ తయారీ రంగం పటిష్టమైన పనితీరును కనబరిచింది. ఇప్పుడు, 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి నెలలోనూ వచ్చే మెరుగైన పనితీరు కనబరిచింది, మాన్యుఫాక్చరింగ్ PMI స్థాయి దానిని ప్రతిబింబించింది.