Huge Layoffs In Global Companies In 2024: 2024 సంవత్సరం గ్లోబల్‌ కంపెనీ ఉద్యోగులకు పీడకలలాంటింది. మేజర్‌ కంపెనీల్లో లేఆఫ్స్‌ ఈ ఏడాది తీవ్ర స్థాయి చర్చను సృష్టించింది, ఉద్యోగుల్లో అభద్రత భావం స్పష్టంగా కనిపించింది. 


2024లో కొన్ని మేజర్‌ లేఆఫ్స్‌ (Biggest Layoffs Of 2024)     


టెస్లా (Tesla Layoffs): ఎలాన్ మస్క్‌కు చెందిన ఈ EV సంస్థ, ఈ సంవత్సరం, ప్రపంచవ్యాప్తంగా తన ఉద్యోగుల్లో 10% మందిని తొలగించింది. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పడిపోవడం, పోటీ పెరగడం, వడ్డీ రేట్లు పెరగడంతో ఈ కంపెనీ తీవ్ర ఒత్తిడికి లోనైంది.


బాష్ (Bosch Layoffs): జర్మన్ ఆటోమోటివ్ కాంపోనెంట్స్ దిగ్గజం బాష్, వ్యాపార ప్రతికూలతల కారణంగా 7,000 ఉద్యోగులు ఇళ్లకు పంపుతామని ప్రకటించింది. 2024 ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడంలో కంపెనీ విఫలమైనందున, మరిన్ని లేఆఫ్స్‌ ఉంటాయని CEO స్టీఫన్ హార్టుంగ్ వెల్లడించారు.


నిస్సాన్ (Nissan Layoffs): నిస్సాన్ మోటార్, ఖర్చులు తగ్గించుకునేందుకు 9,000 ఉద్యోగాల కోత ప్రణాళికను వెల్లడించింది. ఈ ఆటోమేకర్, తన ఉత్పత్తిని 20 శాతం తగ్గించుకుంటామని కూడా ప్రకటించింది.


సిమెన్స్ (Siemens Layoffs): జర్మన్ టెక్ దిగ్గజం సిమెన్స్ కూడా, ఫ్యాక్టరీ ఆటోమేషన్ రంగంలో కొనసాగుతున్న సవాళ్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా 5,000 ఉద్యోగాలను తగ్గించాలని ఆలోచిస్తున్నట్లు తెలిపింది. డిజిటల్ ఇండస్ట్రీస్ విభాగంలో కంపెనీ లాభం 46 శాతం క్షీణించింది. 


బోయింగ్ (Boeing Layoffs): ఈ ఏడాది 17,000 మంది బోయింగ్ ఉద్యోగులు 60-డే లేఆఫ్ నోటీసులు అందుకున్నారు. వీళ్లలో చాలా మంది ఉద్యోగులు జనవరి మధ్య నాటికి కంపెనీని విడిచిపెట్టే అవకాశం ఉంది.


అమెజాన్ (Amazon Layoffs): మోర్గాన్ స్టాన్లీ రిపోర్ట్‌ ప్రకారం, సంవత్సరానికి $3 బిలియన్ల ఖర్చును తగ్గించుకునే లక్ష్యంతో, అమెజాన్ 2025 ప్రారంభంలో 14,000 మేనేజర్లను బయటకు పెంపాలను చూస్తోంది. 


సిస్కో (Cisco Layoffs): టెక్ దిగ్గజం సిస్కో రెండు రౌండ్ల తొలగింపు ద్వారా దాదాపు 10,000 మంది ఉద్యోగులను ఇళ్లకు పంపింది. 


ఇంటెల్‌ (Intel Layoffs): కొనసాగుతున్న నష్టాలను పూడ్చుకునే వ్యూహంలో భాగంగా 15,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతోంది. మొత్తం శ్రామిక శక్తిని 15 శాతానికి పైగా తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది.


డెల్ (Dell Layoffs): డెల్ టెక్నాలజీస్, ఈ ఏడాది దాదాపు 6,000 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. కొత్త రిక్రూట్‌మెంట్లు కూడా తగ్గించింది.


యూనిలీవర్ (Unilever Layoffs): వ్యయ తగ్గింపు పథకంలో భాగంగా ఈ కంపెనీ తీసుకున్న చర్యలు ప్రపంచవ్యాప్తంగా 7,500 ఉద్యోగాలపై ప్రభావం చూపుతాయని భావిస్తున్నారు.


గూగుల్‌ (Google Layoffs): టెక్ దిగ్గజం గూగుల్ ఈ సంవత్సరం దశలవారీగా లేఆఫ్స్‌ ప్రకటించింది. బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్‌ ప్రకారం, వాయిస్ ఆధారిత గూగుల్ అసిస్టెంట్ టీమ్, ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) హార్డ్‌వేర్ టీమ్‌లు మేజర్‌గా ఎఫెక్ట్‌ అవుతున్నాయి.


తోషిబా (Toshiba Layoffs): జపాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం, కొత్త యాజమాన్యంలోకి మారిన తర్వాత, జపాన్‌లో 4,000 మందికి పైగా ఉద్యోగులను తొలగిస్తోంది. 


మరో ఆసక్తికర కథనం: గ్లోబల్‌గా గోల్డ్‌ రేటు డీలా - తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ