How To Check Gas Cylinder Pipe Expiry Date: కట్టెల పొయ్యిలపై ఆహారాన్ని వండుకునే కాలం నుంచి గ్యాస్‌ స్టవ్‌లను వినియోగించే కాలానికి జనం మారి దశాబ్దాలైంది. భారతదేశంలో ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో గ్యాస్ స్టవ్ (Gas Stove) కనిపిస్తుంది. వర్షాకాలంలోనైనా సులభంగా ఉపయోగించడం, పొగ లేకపోవడం వల్ల అనారోగ్యాలు దూరం కావడం, స్థిరమైన స్థాయి మంట కారణంగా వంట త్వరగా అయిపోవడం వంటి సుగుణాల కారణంగా గ్యాస్ స్టవ్ ప్రతి ఇంట్లో వెలిసింది.


అయితే, వంట గ్యాస్‌ ఉపయోగిస్తున్నప్పుడు కొన్ని విషయాలను కచ్చితంగా గుర్తుంచుకోవాలి. అప్పడే, గ్యాస్ స్టవ్‌ను సురక్షితంగా ఉపయోగించవచ్చు. కొన్ని విషయాల్లో ఏ కాస్త అజాగ్రత్తగా ఉన్నా చాలా నష్టం భరించాల్సి రావచ్చు.



వంట కోసం ఉపయోగించే గ్యాస్‌, ఎల్‌పీజీ సిలిండర్‌ (LPG Cylinder) నుంచి పైప్‌ ద్వారా స్టవ్‌లోకి చేరి మంటను వెలిగిస్తుంది. కాబట్టి, గ్యాస్‌ పైప్‌ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్యాస్‌ సిలిండర్‌కు ఎక్స్‌పైరీ డేట్‌ (Gas Cylinder Expiry Date) ఉన్నట్లే, గ్యాస్‌ పైపునకు కూడా గడువు తేదీ (Gas Pipe Expiry Date) ఉంటుంది. ఆ తేదీ తర్వాత, సిలిండర్‌కు అమర్చిన పైపును తప్పనిసరిగా మార్చాలి.


గ్యాస్‌ పైప్‌ను ఎన్నాళ్లు వినియోగించుకోవచ్చు?
సిలిండర్ పైప్ గడువు తేదీ అది ఉపయోగించిన కాల వ్యవధిపై ఆధారపడి ఉంటుంది. మీరు కొత్త బ్రాండెడ్‌ గ్యాస్‌ పైపును కొనుగోలు చేస్తే, దానిని 18 నెలల నుంచి 24 నెలల (ఏడాదిన్నర నుంచి రెండేళ్లు) వరకు వినియోగించుకోవచ్చు. ఇదే దాని గడువు తేదీ. ఆ తర్వాత ఆ పైపును తీసేసి, మళ్లీ కొత్త బ్రాండెడ్‌ పైపును అమర్చాలి.


ఎక్స్‌పైరీ డేట్‌ తర్వాత కూడా గ్యాస్‌ పైపును మార్చకపోతే, దానిలో పగుళ్లు వచ్చే ప్రమాదం ఉంది. దానివల్ల గ్యాస్‌ లీక్ అయ్యి పెద్ద అగ్నిప్రమాదానికి దారి తీయొచ్చు. కొన్నిసార్లు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా జరగొచ్చు. అందువల్ల, గడువు తేదీకి ముందే మీ పాత పైపును కొత్తదానితో భర్తీ చేయాలి.



గ్యాస్‌ పైపు ధర
బ్రాండెడ్‌ గ్యాస్‌ పైపు ధర పేదలకు కూడా అందుబాటులో ఉంటుంది, దానిని మార్కెట్‌లో కొనుగోలు చేయవచ్చు. ఇంకా చౌకగా వస్తుంది కదాని ఏదోక పైపును మాత్రం కొనొద్దు, ఇది మీ మొత్తం కుటుంబం భద్రతకు సంబంధిచిన విషయం. పైపును కొనుగోలు చేసేటప్పుడు, దానిపై ISI మార్క్‌ ఉందో, లేదో చూడండి. ISI మార్క్‌ ఉన్న పైపును మాత్రమే కొనుగోలు చేయండి. అప్పుడే దాని నాణ్యత మెరుగ్గా ఉంది.


ఒకవేళ మంచి పైపు మార్కెట్‌లో దొరక్కపోతే, మీకు దగ్గరలోని గ్యాస్ ఏజెన్సీ ఆఫీస్‌కు వెళ్లి కొత్త పైపును కొనుగోలు చేయవచ్చు. సాధారణంగా, బ్రాండెడ్‌ గ్యాస్‌ పైప్‌ ధర (Gas Pipe Price) రూ. 200 నుంచి రూ. 300 మధ్యలో ఉంటుంది. 



మీరు మార్కెట్‌/ గ్యాస్‌ ఏజెన్సీ ఆఫీస్‌ వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఇంటి నుంచి కాలు కూడా బయటకు పెట్టకుండా గ్యాస్‌ పైప్‌ కొనేందుకు ఓ ఆప్షన్‌ ఉంది. అమెజాన్ (Amazon) లేదా ఫ్లిప్‌కార్ట్ (Flipkart) వంటి ఆన్‌లైన్ మార్కెట్‌ ప్లేస్‌ల నుంచి కూడా గ్యాస్ సిలిండర్ పైపును ఆర్డర్ చేయవచ్చు.


మరో ఆసక్తికర కథనం: పసిడి మరింత పతనం, నగలు కొనేవాళ్లకు లక్కీ ఛాన్స్ - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ