Home Loan: ప్రతి కుటుంబానికి ఒక సొంత నివాసం ఉండాలి. అది సామాజిక & ఆర్థిక భద్రతను అందిస్తుంది. దీంతోపాటు, గృహ రుణంపై పన్ను ప్రయోజనాల రూపంలో డబ్బును ఆదా చేసుకోవచ్చు. హౌసింగ్ లోన్ అప్లికేషన్ త్వరగా ఆమోదం పొందాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఇందుకోసం కొన్ని చిట్కాలు పాటిస్తే సరి.


మీకు మంచి క్రెడిట్ స్కోర్ ఉండాలి
300-900 మధ్య ఉండే నంబరే క్రెడిట్‌ స్కోర్‌ ‍‌(credit score). మీ క్రెడిట్ స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే మీకు అంత ప్లస్‌ పాయింట్‌. ఎక్కువ క్రెడిట్‌ స్కోర్‌, రుణగ్రహీత నిర్ణీత గడువులోగా అప్పును తిరిగి చెల్లించగలడన్న నమ్మకాన్ని రుణదాతలో నింపుతుంది. తక్కువ క్రెడిట్ స్కోర్.. రుణం తిరిగి చెల్లింపులో అజాగ్రత్త వైఖరిని, సకాలంలో EMIలను చెల్లించడంలో అనాసక్తిని సూచిస్తుంది. గృహ రుణ మంజూరులో నష్టాన్ని అంచనా వేయడానికి, రుణదాత సంస్థలు దరఖాస్తుదారుడి క్రెడిట్ స్కోర్‌ను తనిఖీ చేస్తాయి. 


మీ హౌసింగ్ లోన్‌కు తక్షణం ఆమోదం రావాలంటే మీ క్రెడిట్ స్కోర్ 750కి తక్కువ కాకుండా ఉండాలని గుర్తుంచుకోండి. ఇది 900కి దగ్గరగా ఉంటే మరీ మంచిది. క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరుచుకోవడానికి సాయపడే కొన్ని అంశాలు ఇవి:


 మీ అన్ని EMIలు, క్రెడిట్ కార్డ్ బిల్లులను గడువు తేదీకి ముందే చెల్లించడం అలవాటు చేసుకోండి. 
 మీ క్రెడిట్ వినియోగ నిష్పత్తిని తగ్గించడానికి ప్రయత్నించండి. మీ క్రెడిట్ కార్డ్ మొత్తం పరిమితిలో 30% కంటే ఎక్కువ ఖర్చు చేయకండి.
 మీరు ఒకటి కంటే ఎక్కువ రుణాలు తీసుకున్నట్లయితే, మరో కొత్త రుణం కోసం దరఖాస్తు చేయడానికి ముందే పాత రుణాన్ని చెల్లించండి.


రుణదాత షరతులు, నిబంధనలు తెలుసుకోండి
హోమ్ లోన్‌కు సంబంధించి, ప్రతి రుణ సంస్థ పాటించే నిబంధనలు, విధించే షరతులు కొంచెం కఠినంగా ఉంటాయి. ఉదాహరణకు, కొన్ని సంస్థల నుండి రుణాన్ని పొందాలంటే, కస్టమర్ వయస్సు తప్పనిసరిగా 25 సంవత్సరాలు నిండి ఉండాలి, స్థిరమైన ఆదాయ వనరు కలిగి ఉండాలి. కొన్ని రుణ సంస్థలు రుణం పొందడానికి కస్టమర్‌లు కనీసం 5 సంవత్సరాలు నిరంతరం వ్యాపారంలో ఉండాలి లేదా 3 సంవత్సరాల ఉద్యోగ అనుభవాన్ని చూపాలి. మీ హౌసింగ్ లోన్ అప్లికేషన్ త్వరగా ఆమోదం పొందాలంటే, రుణదాత పాటించే ఇలాంటి నిబంధనల గురించి తెలుసుకోండి. ఆయా అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన తర్వాత మాత్రమే దరఖాస్తు చేయండి. మీరు నెరవేర్చలేని అర్హత ఏదైనా ఉంటే, రుణదాతతో నేరుగా మాట్లాడి కారణం వివరించండి. మీ వివరణతో రుణదాత సంతృప్తి చెందితే మీకు వెంటనే రుణం మంజూరు చేసే అవకాశం ఉంటుంది.


అప్పు-ఆదాయ నిష్పత్తి
అప్పు - ఆదాయ నిష్పత్తిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మీ మొత్తం ఆదాయంలో ఎంత శాతాన్ని లోన్ రీపేమెంట్‌కు ఖర్చు చేస్తారో రుణం-ఆదాయ నిష్పత్తి చూపిస్తుంది. మీ రుణం-ఆదాయ నిష్పత్తి ఇప్పటికే 40% కంటే ఎక్కువగా ఉంటే, అంటే మీ ఆదాయంలో 40%ను ఇప్పటికే ఉన్న అప్పుల కోసం తీరస్తుంటే, చాలా రుణ సంస్థలు అటువంటి కస్టమర్లకు రుణాలు ఇవ్వవు. మీ హౌసింగ్ లోన్ అప్లికేషన్‌ను వేగంగా ఆమోదం పొందాలనుకుంటే, కొన్ని రుణాలను చెల్లించడం ద్వారా మీ రుణం-ఆదాయ నిష్పత్తిని తగ్గించుకోండి.


అన్ని పత్రాలను సిద్ధంగా ఉంచండి
గృహ రుణం మొత్తం భారీగా ఉంటుంది, దానిని తిరిగి చెల్లించే కాల పరిమితి కూడా 30 సంవత్సరాల వరకు ఉంటుంది. అందువల్ల, రుణాన్ని తిరిగి చెల్లించగల సామర్థ్యం ఉన్నవారికి మాత్రమే రుణాలు అందించేలా రుణ సంస్థలు చాలా జాగ్రత్తగా ఉంటాయి. దరఖాస్తుదారుడి ప్రొఫైల్, ఆదాయానికి సంబంధించిన సమాచారాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తాయి. దీని కోసం, కస్టమర్ల నుంచి KYC, ఆదాయ ధృవీకరణ పత్రం వంటి వివిధ పత్రాలను డిమాండ్ చేస్తాయి. రుణం మొత్తంతో కొనుగోలు చేయాలనుకుంటున్న ఆస్తిపై చట్టపరమైన వివాదం లేదని నిర్ధారించుకోవడానికి ఆస్తి పత్రాలను కూడా తనిఖీ చేస్తాయి. హౌస్‌ లోన్‌ కోసం దరఖాస్తు చేయడానికి ముందే ఇలాంటి అన్ని పత్రాలను సిద్ధం చేయడం ద్వారా, లోన్ ఆమోద ప్రక్రియను వేగవంతం చేయవచ్చు. హౌసింగ్ లోన్ అప్లికేషన్‌తో పాటు సమర్పించాల్సిన డాక్యుమెంట్ల గురించిన పూర్తి సమాచారం అన్ని లెండింగ్ సంస్థల వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. 


చివరగా మరొక్క మాట. గృహ రుణాన్ని ఎక్కువ కాలం కోసం తీసుకుంటారు కాబట్టి, మీరు పూర్తిగా విశ్వసించగల & మీ సమస్యలను అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న సంస్థను మాత్రమే ఎంచుకోండి. రుణదాత వైఖరి పట్ల మీరు సంతృప్తిగా ఉంటేనే, ఆ సంస్థ నుంచి గృహ రుణం తీసుకోండి.