HDFC Bank Noida Office Rent: పారిశ్రామిక, ఐటీ సంస్థల కేంద్రంగా మారిన నోయిడాలో స్థిరాస్తి వ్యాపారం, అద్దెలు ఎంత భయంకరంగా పెరిగాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. దేశంలో అతి పెద్ద ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, నోయిడాలో ఒక భవనాన్ని కార్యాలయ అవసరాల కోసం అద్దెకు తీసుకుంది. భవనం నెలవారీ అద్దె వింటే కళ్లు గిర్రున తిరగడం మాత్రం ఖాయం. ఆ బిల్డింగ్‌కు చెల్లించే ఒక్క నెల అద్దెతో మా ఊర్లో ఒక రాజభవనం కట్టొచ్చని మీరే అంటారు. బ్యాంక్‌ కాబట్టి భరిస్తోంది గానీ, మామూలు జనం అక్కడ ఎలా బతుకుతున్నార్రా బాబూ అని కూడా అనుకుంటారు.


బ్యాంక్‌ చెల్లించే నెలవారీ అద్దె ఎంతంటే?
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నోయిడాలో అద్దెకు తీసుకున్న కార్యాలయ భవనం విస్తీర్ణం 2.17 లక్షల చదరపు అడుగులు. CRE మ్యాట్రిక్స్ డేటా ప్రకారం, ఆ భవనం నెలవారీ అద్దె రూ. 1.47 కోట్ల రూపాయలు.


మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. ఆ భవనం పూర్తిగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కంట్రోల్‌లో ఉండదు. భవంతిలో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 5వ అంతస్తు వరకు & 7వ అంతస్తు నుంచి 15 వ అంతస్తు వరకు మాత్రమే బ్యాంక్‌ అద్దెకు తీసుకుంది. అంటే మొత్తం 14 అంతస్తులను రెంట్‌కు తీసుకుంది, ఈ భాగం కోసం నెలకు 1 కోటి 47 లక్షల రూపాయల అద్దె చెల్లిస్తోంది. ఆ భవనం పేరు ACE క్యాపిటల్ టవర్-1. నోయిడాలోని సెక్టార్- 132లో ఉంది. ACE గ్రూప్‌నకు అనుబంధంగా ఉన్న మ్యాంగో ఇన్‌ఫ్రాటెక్ సొల్యూషన్స్ LLP నుంచి ఈ భవనాన్ని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లీజుకు తీసుకుంది.


2041 మే నెల వరకు భవనం లీజు
అద్దె ఒప్పంద పత్రాల ప్రకారం, ACE క్యాపిటల్ టవర్-1లోని గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 5వ అంతస్తు వరకు & 7వ అంతస్తు నుంచి 15 వ అంతస్తు వరకు, 18 సంవత్సరాల పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లీజుకు తీసుకుంది. ఈ లీజ్‌ ఒప్పందం 15 మే 2023 నుంచి ప్రారంభమై, 14 మే 2041 వరకు అమల్లో ఉంటుంది. ఇందుకోసం రూ. 8.87 కోట్ల మొత్తాన్ని సెక్యూరిటీ రూపంలో బ్యాంకు చెల్లించినట్లు సమాచారం. ఈ లీజులో భాగంగా.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు 376 కార్ పార్కింగ్ స్లాట్‌లు అందుబాటులోకి వచ్చాయి. 24 మార్చి 2023న లీజ్‌ రిజిస్ట్రేషన్‌ను బ్యాంక్‌ పూర్తి చేసింది.


విడతల వారీగా అద్దె పెరుగుదల
మ్యాంగో ఇన్‌ఫ్రాటెక్ సొల్యూషన్స్ LLP - హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా, మూడేళ్ల తర్వాత అద్దెను 15 శాతం పెంచుతారు. నాలుగో సంవత్సరం నుంచి ఆరో సంవత్సరం వరకు, నెలవారీ అద్దె కార్పెట్ ఏరియాలో చదరపు అడుగుకి ఒక రూపాయి చొప్పున పెరుగుతుంది. ఆ తర్వాత ఏడో సంవత్సరం నుంచి ప్రతి మూడు సంవత్సరాలకు 15 శాతం పెరుగుతుంది. 


గత సంవత్సరం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నవీ ముంబైలోని ఐరోలి ప్రాంతంలో ఉన్న మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ REITకి చెందిన బిజినెస్‌ పార్కులో ఒక కార్యాలయాన్ని అద్దెకు తీసుకుంది. 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న కార్యాలయ స్థలాన్ని 10 సంవత్సరాల పాటు లీజుకు తీసుకుంది.