GST collections: ఒక్క నెలలో రెండున్నర లక్షల కోట్ల జీఎస్టీ కట్టిన ప్రజలు - ఇంత భారీ పన్ను వసూళ్లు దేనికి సంకేతం?
Gross GST: 2026 ఏప్రిల్ నెలలో GST వసూళ్లు సరికొత్త రికార్డును సృష్టించాయి. 2.43 లక్షల కోట్ల గ్రాస్ రెవెన్యూ వసూలైంది. ఇది చరిత్రలోనే అత్యధికం.

GST collections hit record high: 2026 ఏప్రిల్ నెలలో వస్తు సేవల పన్ను (GST) వసూళ్లు సరికొత్త రికార్డును సృష్టించాయి. గతేడాది ఏప్రిల్ వసూళ్లతో పోలిస్తే 8.7% వృద్ధిని నమోదు చేస్తూ, మొత్తం 2.43 లక్షల కోట్ల రూపాయల గ్రాస్ రెవెన్యూ వసూలైంది. అంతర్జాతీయంగా అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు , మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ మేఘాల మధ్య కూడా భారత్ ఈ ఘనత సాధించడం సానుకూల అంశంగా మారింది.
ఈ రికార్డు స్థాయి వసూళ్ల వెనుక ప్రధానంగా దిగుమతుల ద్వారా వచ్చే పన్ను ఆదాయం కీలక పాత్ర పోషించింది. దిగుమతులపై పన్ను వసూళ్లు ఏకంగా 25.8% పెరిగి 57,580 కోట్లకు చేరాయి. ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసులో ఆటంకాలు, ముడి చమురు ధరల పెరుగుదల వంటి కారణాల వల్ల దిగుమతి ఖర్చులు పెరగడం ఈ భారీ వసూళ్లకు ఒక కారణమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు, దేశీయ లావాదేవీల ద్వారా వచ్చే జీఎస్టీ ఆదాయం 4.3 శాతం వృద్ధి చెంది రూ. 1.85 లక్షల కోట్లుగా నమోదైంది.
రిఫండ్‌ల చెల్లింపుల తర్వాత చూస్తే, నికర జీఎస్టీ వసూళ్లు రూ. 2.11 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇది అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 7.3 శాతం వృద్ధిని సూచిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాలు అత్యధిక వృద్ధిని కనబరిచాయి. తెలంగాణలో జీఎస్టీ వసూళ్లు ఏకంగా 36 శాతం వృద్ధి చెందాయి. పన్ను చెల్లింపుల్లో పారదర్శకత పెరగడం, సాంకేతిక మార్పుల వల్ల పన్ను ఎగవేతలకు అడ్డుకట్ట పడటం వంటి అంశాలు ప్రభుత్వ ఖజానాను నింపాయి.
ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఏప్రిల్ నెలలో ఎప్పుడూ వసూళ్లు ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం ఆర్థిక సంవత్సరం ముగింపు. మార్చి నెలలో వ్యాపారాలు తమ టార్గెట్లను పూర్తి చేసేందుకు చేసే ప్రయత్నం ఏప్రిల్ వసూళ్లలో ప్రతిబింబిస్తుంది. అయితే, గ్లోబల్ వార్ పరిస్థితుల వల్ల సరకుల ధరలు పెరగడం కూడా ఈ సంఖ్య పెరగడానికి పరోక్షంగా దోహదపడింది. భవిష్యత్తులో ఈ స్థాయి వసూళ్లు స్థిరంగా కొనసాగుతాయా లేదా అనేది రాబోయే నెలల వినియోగాన్ని బట్టి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.
Total April Gross GST collection stood at Rs 2,42,702 crore, an increase of 8.7 per cent against the previous year, which was Rs 2,23,265 crore.
— ANI (@ANI) May 1, 2026
Source: Government of India pic.twitter.com/31PEEl2L3n
అంతర్జాతీయంగా యుద్ధ భయాలు ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, భారత దేశీయ మార్కెట్ బలంగా ఉందని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి. పన్నుల రేట్లు తగ్గించినప్పటికీ ఆదాయం పెరగడం అనేది కేవలం వినియోగం పెరగడమే కాకుండా, పటిష్టమైన పన్ను వసూళ్ల వ్యవస్థకు నిదర్శనమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ రికార్డు స్థాయి వసూళ్లు భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్ల దిశగా అడుగులు వేయడానికి ఒక సానుకూల సంకేతంగా నిలిచాయి.
ట్రెండింగ్ వార్తలు





















