Govt Suspend The Call Forwarding Service: మన దేశంలో సైబర్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రజల వ్యక్తిగత మొబైల్‌ నంబర్లకు అందే సేవల్లోని లొసుగుల ఆధారంగా రెచ్చిపోతున్న సైబర్‌ కేటుగాళ్లు, జనం కష్టార్జితాన్ని సులభంగా దోచుకుంటున్నారు. సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. కాల్ ఫార్వార్డింగ్ సౌకర్యాన్ని నిలిపివేయాలని నిర్ణయించింది. దీనిపై, అన్ని టెలికాం కంపెనీలకు టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ (DoT) నుంచి ఆదేశాలు వెళ్లాయి. 


USSD ఆధారిత కాల్ ఫార్వార్డింగ్‌పై టెలికమ్యూనికేషన్స్ విభాగం నుంచి టెలికాం సంస్థలకు కొన్ని సూచనలు వెళ్లాయి. ఈ నెల 15 (15 ఏప్రిల్‌ 2024) నుంచి, USSD ఆధారిత కాల్ ఫార్వార్డింగ్‌ను నిలిపివేయాలని టెలికాం కంపెనీలను ‍‌(Telecom Companies) డాట్‌ ఆదేశించింది. కాల్ ఫార్వార్డింగ్ సౌకర్యం కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించింది.


USSD ఆధారిత సర్వీస్‌ అంటే ఏంటి?                
USSD (Unstructured Supplementary Service Data) ఆధారిత సేవల కింద, టెలికాం కస్టమర్‌లు చాలా సౌకర్యాలు పొందుతారు. కాల్ ఫార్వార్డింగ్ సర్వీస్‌ కూడా వాటిలో ఒకటి. IMEI నంబర్‌ను తనిఖీ చేయడం నుంచి బ్యాలెన్స్‌ను తనిఖీ చేయడం వరకు చాలా పనులు USSD ద్వారా జరుగుతాయి. ఈ సేవల కోసం, కస్టమర్ తన ఫోన్ నుంచి యాక్టివ్ కోడ్‌ను డయల్ చేయాలి. యాక్టివ్ కోడ్‌లో హ్యాష్‌ట్యాగ్, స్టార్ వంటి చిహ్నాలు, అంకెలు కలిసి ఉంటాయి.


సైబర్ మోసంలో ఉపయోగించే అవకాశం                
ఫోన్ కాల్స్‌ ద్వారా మోసం చేయడానికి USSD సేవలను సైబర్ నేరగాళ్లు దుర్వినియోగం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కారణంగా, ఏప్రిల్ 15 నుంచి USSD ఆధారిత కాల్ ఫార్వార్డింగ్ సేవలను నిలిపివేయాలని ఆదేశించింది. 'అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా' (USSD) ఆధారంగా జరిగే కాల్ ఫార్వార్డింగ్ సేవలను *401# సర్వీస్ అని కూడా అంటారు.


మళ్లీ యాక్టివేట్ చేయాలి              
కస్టమర్ సమ్మతి లేకుండా లేదా అతనికి తెలీకుండా అతని ఫోన్‌లో కాల్ ఫార్వార్డింగ్ సదుపాయం యాక్టివేట్ కాకూడదని కేంద్ర ప్రభుత్వం టెల్కోలను (టెలికాం కంపెనీలు) ఆదేశించింది. సర్కారు ఆదేశాలను అనుసరించి, USSD ఆధారిత కాల్ ఫార్వార్డింగ్ సౌకర్యం ఈ నెల 15 (ఏప్రిల్‌ 15, 2024) నుంచి దేశంలోని యూజర్లందరికీ ఆటోమేటిక్‌గా నిలిచిపోతుంది. ఈ ఫెసిలిటీ కావాలి అనుకున్న వాళ్లకు, దానిని రీయాక్టివేట్‌ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ప్రస్తుతం USSD కాల్ ఫార్వార్డింగ్ సదుపాయాన్ని యాక్టివేట్ చేసుకున్న కస్టమర్‌ను, ఏప్రిల్ 15 తర్వాత, మళ్లీ ఆ సర్వీస్‌ను యాక్టివేట్ చేసుకోవాలని కంపెనీలు అడుగుతాయి. దీని కోసం, వినియోగదార్లకు USSD కాకుండా ఇతర ఆప్షన్స్‌ ఇస్తాయి. కస్టమర్‌ కోరితేనే కాల్ ఫార్వార్డింగ్ సదుపాయం తిరిగి  అందుబాటులోకి వస్తుంది. 


మరో ఆసక్తికర కథనం: పుత్తడి కొనేవాళ్లకు కాస్త ఊరట - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి