Government To Reduce In Five Public Sector Banks: దేశంలోని ఐదు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (PSBs) వాటా తగ్గించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిన కంపెనీల్లో.. ప్రజల వాటా కనీసం 25% (Minimum Public Shareholding - MPS) ఉండాలన్నది మార్కెట్ రెగ్యులేటర్ సెబీ (SEBI) నిబంధన. మిగిలిన 75% వాటా యాజమాన్యం దగ్గర ఉండొచ్చు. ఈ రూల్‌కు అనుగుణంగా, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వాటాను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రస్తుతం, దేశంలోని 12 ప్రభుత్వ బ్యాంకులు ఉన్నాయి. వీటిలో, కేవలం 4 బ్యాంకులు మాత్రమే MPS నియమానికి అనుగుణంగా ఉన్నాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడు బ్యాంకులు 25 శాతం కనీస పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధనను నెరవేర్చాయని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి వివేక్ జోషి చెప్పారు. మిగిలిన ఐదు బ్యాంకులు కూడా మినిమమ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ రూల్‌కు అనుగుణంగా ప్లాన్స్ సిద్ధం చేశాయి.
ఇవే ఆ 5 బ్యాంక్‌లు
ప్రస్తుతం, కేంద్ర ప్రభుత్వ వాటా (Central Government Stake in Banks) 75 శాతం కంటే ఎక్కువ ఉన్న ఐదు బ్యాంకుల్లో.. పంజాబ్ అండ్ సింథ్ బ్యాంక్‌లో (Punjab National Bank) ప్రభుత్వ వాటా 98.25 శాతంగా ఉంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో (Indian Overseas Bank) ప్రభుత్వానికి 96.38 శాతం షేర్లు ఉన్నాయి. యూకో బ్యాంక్‌లో (UCO Bank) 95.39 శాతం యాజమాన్యం కేంద్ర ప్రభుత్వానిది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో (Central Bank of India) ప్రభుత్వ వాటా 93.08 శాతం, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో (Bank of Maharashtra) ప్రభుత్వ వాటా 86.46 శాతం.
స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్‌లకు ప్రత్యేక మినహాయింపు ఇచ్చింది. ఈ ఏడాది ఆగస్టు నాటికి ఈ బ్యాంక్‌లు మినిమమ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.
ఈ ఐదు బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాను తగ్గించేందుకు, ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (FPO) లేదా క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషన్ ప్లేస్‌మెంట్ (QIP) ఆప్షన్లను పరిశీలిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తెలిపారు. స్టాక్ మార్కెట్ పరిస్థితిని బట్టి, తమ వాటాదార్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వాటా తగ్గింపు మార్గంపై ఈ బ్యాంకులు నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు.
గురువారం నాటి (14 మార్చి 2024) ట్రేడింగ్‌లో, PSB స్టాక్స్ భారీగా జంప్ చేశాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు 12 శాతం, యూకో బ్యాంక్ 10 శాతం, పంజాబ్ అండ్ సింథ్ బ్యాంక్ 8.88 శాతం, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 7.96 శాతం, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 7.56 శాతం పెరిగాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: రూ.66,000 పైనే పసిడి - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే