GST Rate Cut: జీఎస్టీ తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల దేశ ప్రజలకు శుభవార్త చెప్పారు. పలు రకాల వస్తువులు, ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గించారు. కానీ తక్కువ ధర కలిగిన ఉత్పత్తులపై ధరలను తగ్గించడం లేదని వినియోగ వస్తువులను తయారు చేసే కంపెనీలు (FMCG) పన్ను అధికారులకు స్పష్టం చేశాయి. వీటిలో రూ.5 బిస్కెట్లు, 10 రూపాయల సబ్బులు, రూ. 20 టూత్‌పేస్ట్ వంటి ప్రజలందరూ వినియోగించే ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై పన్ను రేటు తగ్గించినప్పటికీ, వాటి ధరలు తగ్గాలి. అయితే వాటి ధరలు తగ్గించడం వీలుకాదని కంపెనీలు స్పష్టం చేశాయి.
ధర తగ్గించడానికి రెడీగా లేని FMCG కంపెనీలు
వినియోగదారులు ఈ వస్తువులను స్థిర ధరలకు కొనుగోలు చేయడానికి అలవాటు పడ్డారని FMCG కంపెనీలు చెబుతున్నాయి. కనుక వాటి ధరలను తగ్గించి 9 రూపాయలు, 18 రూపాయలు చేస్తే, వినియోగదారులలో గందరగోళం నెలకొంటుంది. మరీ ముఖ్యంగా కొనుగోలు సమయంలో జరిగే లావాదేవీలలో అసౌకర్యం కలుగుతుందని కంపెనీలు పేర్కొన్నాయి.
అందుకు బదులుగా, కంపెనీలు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC)కి ధరలను యథాతథంగా ఉంచుతామని స్పష్టం చేశాయి. కావాలంటే ప్యాకెట్‌లో కాస్త పరిమాణాన్ని పెంచే దిశగా అడుగులు వేస్తున్నాయి. అంటే, ఇప్పుడు ఒక కస్టమర్ 20 రూపాయలకు బిస్కెట్ కొంటే, మునుపటి కంటే ఎక్కువ పరిమాణంలో బిస్కట్లు పొందుతాడు.
నివేదిక ప్రకారం, చాలా పెద్ద FMCG కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు అదే ధరకు ఎక్కువ పరిమాణాన్ని ఇవ్వడం ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా GST తగ్గింపు ప్రయోజనం వినియోగదారులకు చేరుతుందని చెప్పారు.
కంపెనీలు తగ్గింపు ప్రయోజనాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయా?
12 శాతం ఉన్న జీఎస్టీని కొన్ని వస్తువులు, ఉత్పత్తులపై 5 శాతానికి తగ్గించారు. 5 శాతంగా ఉన్న జీఎస్టీని కొన్ని ఉత్పత్తులపై పూర్తిగా తొలగించారు. వినియోగదారులకు ఎక్కువ విలువను అందించడానికి కంపెనీ చిన్న ప్యాకెట్ల బరువును పెంచుతుందని బికాజీ ఫుడ్స్ CFO రిషబ్ జైన్ ధృవీకరించారు. అదే సమయంలో డాబర్ CEO మోహిత్ మల్హోత్రా మాట్లాడుతూ.. తమ కంపెనీ ఖచ్చితంగా GST తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులకు అందిస్తుందని చెప్పారు. తక్కువ పన్నుల వల్ల ప్రతి ఉత్పత్తికి డిమాండ్ పెరిగే అవకాశం ఉందని, కొంత మొత్తం వినియోగదారుడికి అదనంగా చేరుతుందని అన్నారు.