Why gold prices are rising: బంగారం, వెండి ధరల విపరీతమైన పెరుగుదల ప్రపంచవ్యాప్తంగా ఉంది. అసలు ఎందుకు ఈ ధరలు ఇలా పెరుగుతున్నాయన్నదానిపై రకరకాల కారణాలు చెబుతున్నారు. కానీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వివరణ ఇచ్చారు. బడ్జెట్ అనంతర సమీక్షా సమావేశంలో భాగంగా ఆర్బీఐ డైరెక్టర్ల బోర్డుతో భేటీ అయిన ఆమె.. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో బంగారం వినియోగం ఎక్కువగా ఉన్నప్పటికీ, దేశీయ ఉత్పత్తి మాత్రం డిమాండ్‌కు సరిపడా లేదని ఆమె గుర్తు చేశారు. మన అవసరాల కోసం పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోందని, అందుకే అంతర్జాతీయ మార్కెట్లలో వచ్చే మార్పులు నేరుగా మన దేశీయ ధరలపై ప్రభావం చూపుతున్నాయని వివరించారు.

Continues below advertisement

బంగారాన్ని భారీగా కొంటున్న వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు

ప్రస్తుత ధరల పెరుగుదలకు ప్రధాన కారణం అంతర్జాతీయంగా వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు చేపడుతున్న కొనుగోళ్లేనని మంత్రి విశ్లేషించారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా అనేక దేశాలు తమ నిల్వలను పెంచుకునేందుకు భారీగా బంగారం, వెండిని కొనుగోలు చేస్తున్నాయని తెలిపారు. దీనివల్ల గ్లోబల్ మార్కెట్‌లో డిమాండ్ పెరిగి ధరలు రికార్డు స్థాయికి చేరుతున్నాయని, కేవలం భారతీయ వినియోగం వల్లే ఈ పెరుగుదల జరగడం లేదని స్పష్టం చేశారు. భారత్‌లో కూడా ఆర్బీఐ తన నిల్వలను పెంచుకోవడం వల్ల ఆర్థిక స్థిరత్వానికి భరోసా లభిస్తుందని పేర్కొన్నారు.              

Continues below advertisement

బంగారం పెరుగుదల వల్ల ఆందోళన అక్కర్లేదు ! 

బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు భయపడాల్సినంత ఆందోళనకరంగా లేవని సీతారామన్ అభిప్రాయపడ్డారు. భారతీయ కుటుంబాలకు బంగారం అనేది కేవలం ఆభరణం మాత్రమే కాదు, ఒక సురక్షితమైన పెట్టుబడి అని ఆమె వ్యాఖ్యానించారు. పండుగలు, శుభకార్యాల సమయంలో డిమాండ్ పెరగడం అనేది మన సంప్రదాయంలో భాగమని, ఆ సమయాల్లో ధరల్లో వచ్చే హెచ్చుతగ్గులు సహజమేనని పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ పరిణామాలను నిరంతరం గమనిస్తోందని, పరిస్థితిని అదుపు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

ప్రపంచ మార్కెట్ పరిస్థితుల వల్లే!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఈ అంశంపై ప్రత్యేక నిఘా ఉంచిందని మంత్రి తెలిపారు. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ.. ధరలు పెరిగినప్పటికీ, జనవరి వరకు దిగుమతుల విలువలో పెద్దగా మార్పు రాలేదని, వాల్యూమ్ పరంగా నియంత్రణలోనే ఉన్నాయని వివరించారు. దేశంలో లిక్విడిటీ సమస్యలు తలెత్తకుండా, ఆర్థిక వ్యవస్థ అవసరాలకు తగ్గట్టుగా నిధుల లభ్యత ఉండేలా చూస్తామని ఆయన స్పష్టం చేశారు. మొత్తానికి, ప్రపంచ మార్కెట్ ధోరణుల వల్లే ధరలు పెరుగుతున్నాయని, భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగానే ఉందని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.