Gold price  peak of Rs 98 000 per 10 gm: బంగారం ధర ఊహించని విధంగా పెరుగుతోంది.  అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా సురక్షితమైన పెట్టుబడిగా బంగారాన్ని ప్రజలు భావిస్తూండటంతో విపరీతంగా గోల్డ్ లో పెట్టుబడులు పెడుతున్నారు. ఈ కారణంగా బంగారం ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి.  బుధవారం దేశ రాజధానిలో బంగారం ధరలు రూ.1,650 పెరిగి ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి రూ.98,100కు చేరుకున్నాయి.

ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం  99.9 శాతం స్వచ్ఛత కలిగిన ఈ విలువైన లోహం మంగళవారం నాడు 10 గ్రాములకు రూ.96,450 వద్ద ముగిసింది.బుధవారం రూ.98వేలు దాటింది.  99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం కూడా రూ.1,650 పెరిగి 10 గ్రాములకు రూ.97,650 వద్ద తాజా గరిష్ట స్థాయికి చేరుకుంది.  వెండి ధరలు రూ.1,900 పెరిగి కిలోకు రూ.99,400కు చేరుకున్నాయి. మంగళవారం వెండి  కిలోకు రూ.97,500 వద్ద ముగిసింది. 

ప్రపంచవ్యాప్తంగా స్పాట్ బంగారం ఔన్సుకు రికార్డు స్థాయిలో 3,318 డాలర్లకు చేరుకుంది. తరువాత కొంత తగ్గింది. ఔన్సుకు 3,299.99 డాలర్ల వద్ద ట్రేడయింది.  అమెరికా ప్రభుత్వం చైనాకు ఎగుమతి నియమాలను కఠినతరం చేసిన తర్వాత పెరుగుతున్న వాణిజ్య యుద్ధం ఆందోళనలు పెరిగిపోయాయి. ఈ కారణంగానే బంగారం ధర రికార్డు స్థాయికి చేరుకుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

ట్రంప్ సుంకాలు వేయడానికి కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు.  కీలకమైన ఖనిజాలపై సుంకాలు వేయడానికి అవసరమైన పరిశీ లన ట్రంప్ యంత్రాంగం ప్రారంభించింది.  ఇది మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.  బుధవారం  చైనా నుండి వచ్చే చాలా వస్తువులపై సుంకాలను అమెరికా 245 శాతానికి పెంచింది. ఇది వాణిజ్య యుద్ధ భయాలను మరింతగా పెంచింది.  US డాలర్ ఇండెక్స్ 100 మార్కు కంటే దిగువకు పడిపోవడంతో  బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.ఇక ముందు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ]

అలాగే వడ్డీ రేటు తగ్గింపు అంచనాలు పెరగడం వల్ల కూడా బంగారం ధరలు పెరుగుతున్నాయని అంచనా వేస్తున్నారు.  US ఫెడరల్ రిజర్వ్ చైర్ జెరోమ్ పావెల్  చేయబోయే ప్రకటనపై అంతర్జాతీయ మార్కెట్లు ఆసక్తికగా గమనిస్తున్నాయి. అదే సమయంలో ప్రధాన బ్యాంకులు కూడా బంగారం సురక్షితంగా భావిస్తున్నాయి.  

 మొత్తంగా బంగారం, వెండి ధరలు ట్రంప్ పుణ్యమా అని.. మధ్యతరగతికి అందనంత ఎత్తుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది.