Gautam Adani: అమెరికన్ షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) ఇచ్చిన నెగెటివ్‌ రిపోర్ట్‌తో, ఇవాళ (బుధవారం, 25 జనవరి 2023) ఒక్కరోజే అదానీ గ్రూప్‌ కంపెనీ షేర్లు 10% వరకు పడిపోయాయి. దీంతో, గ్రూప్‌ యజమాని, బిలియనీర్ గౌతమ్ అదానీ వ్యక్తిగత సంపద ఒక్క రోజులో $5.9 బిలియన్ల వరకు క్షీణించింది.


ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం.. ఈ 60 ఏళ్ల అహ్మదాబాద్‌ వ్యాపారవేత్త సంపద ఇవాళ $5.9 బిలియన్లు ( రూ. 4,81,16,27,00,000) తగ్గి $120.6 బిలియన్లకు దిగి వచ్చింది. 


US ట్రేడెడ్ బాండ్స్‌, 'నాన్ ఇండియన్ ట్రేడెడ్ డెరివేటివ్స్‌' ద్వారా అదానీ గ్రూప్ కంపెనీలను షార్ట్ సెల్లింగ్ చేస్తున్నట్లు హిండెన్‌బర్గ్ ఇటీవల వెల్లడించింది. ఈ ప్రకటన తర్వాత, అదానీ ఇటీవల కొనుగోలు NDTV సహా మొత్తం 10 అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు లోయర్‌లో ట్రేడవుతున్నాయి.


అన్ని అదానీ కంపెనీల స్టాక్స్‌ బాధితులే
అదానీ గ్రూప్ స్టాక్స్‌లో... అంబుజా సిమెంట్స్ (Ambuja Cements) 9.6% వరకు పడిపోయి రూ. 450.75 వద్ద టాప్ లూజర్‌గా నిలిచింది. ACC, అదానీ పోర్ట్స్ ‌‍(Adani Ports), అదానీ పవర్ (Adani Power), అదానీ ట్రాన్స్‌మిషన్ (Adani Transmission) 5% తక్కువ కాకుండా నష్టపోయాయి.


తన నివేదికలో, అదానీ గ్రూప్‌లోని అకౌంటింగ్, కార్పొరేట్ గవర్నెన్స్ సమస్యల గురించి హిండెన్‌బర్గ్ ప్రస్తావించింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ 8 సంవత్సరాల కాలంలో 5 మంది చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్లను మార్చిందని, ఇది అకౌంటింగ్ సమస్యలను సూచించే కీలకమైన రెడ్ ఫ్లాగ్" అని ఆ కంపెనీ పేర్కొంది.


శుక్రవారం (27 జనవరి 2023) నుంచి అదానీ ఎంటర్‌ప్రైజెస్ రూ. 20,000 కోట్ల ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (FPO) ప్రారంభం అవుతుంది. దీనికి ముందు వచ్చిన హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌ ఆ ఎఫ్‌పీవో మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే, తన నివేదికలో హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలపై అదానీ గ్రూప్ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.


అంతకు ముందు, 2022 ఆగస్టులో, ఆర్థిక సేవల సంస్థ ఫిచ్ గ్రూప్‌నకు (Fitch Group) చెందిన క్రెడిట్‌సైట్స్ కూడా అదానీ గ్రూప్‌ రుణ భారంపై రిపోర్ట్‌ విడుదల చేసింది. FY22 ముగింపు నాటికి ఆ గ్రూప్‌లోని అన్ని కంపెనీల నెత్తిన ఉమ్మడిగా ఉన్న  రూ. 2.2 ట్రిలియన్ల రుణంపై ఆందోళన వ్యక్తం చేసింది.


2022లో రాకెట్‌లా పెరిగిన అదానీ కంపెనీల స్టాక్స్‌
2022లో అదానీ ఎంటర్‌ప్రైజెస్ (Adani Enterprises) షేర్లు 125% పెరిగాయి. అదానీ పవర్, అదానీ టోటల్‌ గ్యాస్ సహా ఇతర గ్రూప్ కంపెనీలు 100% పైగా పెరిగాయి. గత కొన్ని సంవత్సరాలుగా అదానీ గ్రూప్ షేర్లలో తారస్థాయి పెరుగుదల ఉన్నప్పటికీ, చాలా కౌంటర్ల మీద మార్కెట్‌ ఎనలిస్ట్‌లు ఎలాంటి కవరేజ్‌ ప్రారంభించలేదు.


ఒక షేర్‌ ఒక రిజిస్టర్డ్‌ ఎనలిస్ట్‌ కవరేజ్‌లోకి వచ్చిందంటే.. సదరు ఎనలిస్ట్‌ ఆ కంపెనీ తీరుతెన్నులను ఆమూలాగ్రం పరిశీలించి, ఆ కంపెనీ స్టాక్‌కు రేటింగ్స్‌, టార్గెట్‌ ప్రైస్‌లు ఇస్తారు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.