Gautam Adani: న్యూయార్క్‌కు చెందిన షార్ట్‌ సెల్లింగ్‌ కంపెనీ హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ (Hindenburg Research) నివేదిక తర్వాత అదానీ కంపెనీల షేర్ల తీవ్రంగా పతనయ్యాయి. ఈ కారణంగా, 2023 జనవరిలో ఇప్పటివరకు ఈ బిలియనీర్‌ 36 బిలియన్‌ డాలర్ల సంపదను కోల్పోయారు. దీంతో పాటు.. తాజాగా ప్రపంచ టాప్‌-10 సంపన్నల ఎలైట్ క్లబ్‌లోనూ తన స్థానాన్ని కోల్పోయారు.


బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ (Bloomberg Billionaires Index) ప్రకారం.. 60 ఏళ్ల గౌతమ్‌ అదానీ ఇప్పుడు 84.4 బిలియన్‌ డాలర్ల సంపదతో ప్రపంచ ధనవంతుల జాబితాలో 11వ స్లాట్‌లో ఉన్నారు. 2023 క్యాలెండర్ సంవత్సరంలో, ప్రపంచంలోని టాప్-500 కుబేరుల (పురుషులు + మహిళలు) జాబితాలో అతి ఎక్కువగా నష్టపోయింది గౌతమ్‌ అదానీనే.


సంవత్సర కష్టం 3 రోజుల్లో మాయం
విశేషం ఏంటంటే.. 2022లో దాదాపు 40 బిలియన్‌ డాలర్ల వార్షిక లాభంతో అతి పెద్ద సంపద సృష్టించుకున్న అదానీ, ఇప్పుడు ఆ మొత్తాన్నీ పోగొట్టుకున్నారు. అంటే.. ఒక సంవత్సర కాలంలో సంపాదించిన మొత్తాన్ని కేవలం ఒక్క నెల రోజుల్లో, అందులోనూ సింహభాగాన్ని కేవలం 3 రోజుల్లో కోల్పోయారు.


గుడ్డిలో మెల్ల ఏంటంటే, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ (Reliance Industries Chairman Mukesh Ambani) కంటే అదానీ ఒక మెట్టు పైనే ఉండడం. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో ముకేష్‌ అంబానీ 12వ స్థానంలో ఉన్నారు. గౌతమ్‌ అదానీ ఇప్పటికీ అత్యంత సంపన్న భారతీయుడిగానే ఉన్నారు.


అదానీ గ్రూప్‌ కంపెనీల్లో అనేక మోసాలు, అక్రమాలు, స్టాక్ మానిప్యులేషన్‌ జరిగిందని ఆరోపిస్తూ హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ కంపెనీ 32,000 పదాలతో కూడిన ఒక నివేదికను గత వారం విడుదల చేసింది. అప్పటి నుంచి సోమవారం వరకు, వరుసగా మూడు ట్రేడింగ్‌ రోజుల్లో, ప్రతి రోజూ బిలియన్ల డాలర్లను అదానీ కోల్పోయారు. 


మూడు సెషన్లలోనే 34 బిలియన్‌ డాలర్ల నష్టం
ఈ జనవరి నెలలో 30వ తేదీ వరకు గౌతమ్‌ అదానీ 36 బిలియన్‌ డాలర్ల సంపదను కోల్పోతే.. ఇందులో 34 బిలియన్‌ డాలర్లను కేవలం మూడంటే ముూడు రోజుల్లో పోగొట్టుకున్నారు. బ్లూమ్‌బెర్గ్ డేటా ప్రకారం, గత మూడు వరుస ట్రేడింగ్ సెషన్లలో (బుధవారం, శుక్రవారం, సోమవారం) అదానీ 34 బిలియన్‌ డాలర్ల నష్టాన్ని చవి చూశారు, అతని గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువలో నాలుగింట ఒక వంతు (25%) తుడిచి పెట్టుకుపోయింది.


పోర్ట్‌లు, FMCG, మైనింగ్, ఎనర్జీ సహా చాలా రంగాల్లో విస్తరించి ఉన్న తన విశాలమైన సామ్రాజ్యం అదానీ సొంతం. గత సంవత్సరం అతని స్టాక్స్‌ గురుత్వాకర్షణ శక్తిని ధిక్కరించి రాకెట్లలా దూసుకెళ్లాయి. దీంతో, గత సంవత్సరం సంపన్నుల జాబితాలో నం.2 స్లాట్‌ను అదానీ కొన్ని రోజుల పాటు ఆక్రమించారు. ఆ సమయంలో ఎలాన్ మస్క్ (Elon Musk ) మాత్రమే అతని కంటే ధనవంతుడు. ఆ తర్వాత మూడో స్థానానికి దిగి వచ్చారు. ప్రస్తుత నష్టంతో 3 నుంచి 11కి పడిపోయారు. 


ప్రస్తుత పరిస్థితులు చూస్తే... బిల్ గేట్స్, జెఫ్ బెజోస్, గూగుల్ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్ వంటి పది మంది బిలియనీర్ల వెనుక ఇప్పుడు అదానీ ఉన్నారు. ఇప్పుడు, మళ్లీ వీళ్లందరినీ దాటి మునుపటి స్థానానికి చేరడానికి గౌతమ్‌ అదానీకి ఎంత కాలం పడుతుందో చూడాలి.


84.4 బిలియన్‌ డాలర్ల సంపదతో, పన్నుల జాబితాలో ముకేశ్ అంబానీ 12వ స్థానంలో నిలిచారు.